నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో షూటింగ్ ఈ పాటికే పూర్తి కావాల్సింది. అయితే లాక్ డౌన్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ నిలిచిపోయింది. ఈ మధ్యనే తిరిగి మొదలైంది. అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నా ఇప్పటివరకు హీరోయిన్ ను ఫైనల్ చేయలేదు బోయపాటి. ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ల ఎంపిక చాలా క్లిష్టంగా మారింది. ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోయిన్లతో బాలయ్య ఆడిపాడాడు. సినిమాలో కొత్తదనం కావాలంటే ఇప్పటివరకు బాలయ్యతో చేయని నటినే తీసుకురావాలి. అందుకే బోయపాటి శ్రీనుకు హీరోయిన్లను సెలెక్ట్ చేయడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది. ఫైనల్ గా ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా మలయాళ నటి ప్రయాగా మార్టిన్ ను ఎంపిక చేశారు.
ఇక ఈ సినిమాలో రెండవ హీరోయిన్ కు కూడా స్కోప్ ఉండడంతో మరో మల్లూ బ్యూటీ పూర్ణను ఎంచుకున్నారని సమాచారం. ఇప్పటివరకు పూర్ణ యంగ్ హీరోలతో మాత్రమే నటించింది. స్టార్ హీరోలతో ఒక్క సినిమా కూడా నటించలేదు. ఇప్పుడు బాలయ్య పక్కనే ఛాన్స్ కొట్టేసింది. పూర్ణకు మంచి నటి అనే పేరున్నా, కొన్ని చెప్పుకోదగిన హిట్లున్నా ఇంతవరకూ ఆమెకు బ్లాక్ బస్టర్ హిట్ పడలేదు. ఆ లోటు ఇప్పుడు బాలకృష్ణ, బోయపాటిల చిత్రంతో తీరిపోనుంది. అసలే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బోయపాటి శ్రీను ఒక పెద్ద హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద విజయం సాదిస్తుందని అభిమానులు కూడా ధీమాగా ఉన్నారు. అలాంటి సినిమాలో అవకాశం పూర్ణకు రావడంతో, ఈ సినిమాతో మంచి విజయం అందుకొని తిరిగి బిజీ అవ్వాలని భావిస్తోంది. మరి పూర్ణకి ఈ మూవీ ఏ స్థాయి హిట్టిస్తుందో చూడాలి.