ఒకపక్క ఎన్నికల పోలింగ్ జరుగుతునే ఉంది. మరోపక్క రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చివరి క్షణం వరకు ఓట్లను రాబట్టుకునేందుకు కొందరు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ టీవీ ఛానల్ లోగోతో కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చేస్తోంది. దీనిపై దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డ స్పందించారు.
దుబ్బాక ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి నిలిచారు. అయితే తాను తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరుతున్నారని ప్రచారం జరుగుతుందని ఫిర్యాదు చేశారు. ఈ ప్రచారంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఓటమి భయంతోనే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ న్యూస్ ఛానల్ లోగోతో శ్రీనివాస్ రెడ్డిపై ఫేక్ వీడియో చేయించినట్లు తెలిసింది. అయితే దీనిపై కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి.. తోగుట పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతోపాటు, సదరు టీవీ ఛానల్ సైతం అది తమ వీడియో కాదని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రజలారా ఒక్క మాటా: రేవంత్‌రెడ్డి
దుబ్బాక ప్రజలను ఉద్ధేశించి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మాట్లడారు. ప్రజలారా ఒక్క మాటా అంటూ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దుబ్బాకలో టీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్‌ను నేరుగా ఎదుర్కోలేక వెన్నుపోటు రాజకీయానికి తెర తీశాయి. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డిపై తప్పుడు ప్రచారాలకు తెగబడ్డాయి. తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజలు అనవసర గందరగోళాలకు గురికావద్దని ఆయన తెలిపారు. ఫేక్ వీడియో వ్యాప్తిలో హరీష్ రావు, రఘునందన్ రావుల హస్తం ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి కూడా తనపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేశారు.
దుబ్బాకలో బీజేపీ, టీఆర్ఎస్ లు కాంగ్రెస్ ను నేరుగా ఎదుర్కోలేక వెన్నుపోటు రాజకీయానికి తెర తీశాయి.కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పై తప్పుడు ప్రచారాలకు తెగబడ్డాయి.తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.ప్రజలు అనవసర గందరగోళాలకు గురి కావద్దు.. pic.twitter.com/A4jzRRun7g
— Revanth Reddy (@revanth_anumula) November 3, 2020
అది వాళ్లపనే: ఉత్తమ్ కుమార్‌రెడ్డి
దుబ్బాక ఉప ఎన్నిక ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. అక్కడక్కడ ఈవీఎంలు కాస్త మొరాయించాయి. అయితే కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి టీఆర్ఎస్‌లోకి వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. దీనిపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ స్పందించారు. ఈ వార్తలను ఆయన ఖండించారు. దుబ్బాకలో ఎన్నికలను ప్రభావితం చేయడానికే శ్రీనివాస్‌రెడ్డి పార్టీ మారబోతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ వార్తలను టీఆర్ఎస్, బీజేపీ పార్టీలే చేసి ఉంటాయని అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ వార్తలను ప్రజలు నమ్మొద్దని, చేతి గుర్తుకే ఓటు వెయ్యాలని ఆయన కోరారు.
రాములమ్మ ఫైర్..
టీఆర్ఎస్ పార్టీపై మరోసారి కాంగ్రెస్ ప్రచారకమిటీ ఛైర్మన్ విజయశాంతి దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో ఫైరయ్యారు. నిజాం నవాబుల విధేయులుగా టీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నట్లు ఆరోపించారు. ఆర్థిక, కిరాయి బలగాలతో ఏ విధమైన అధికారం నిజాం చెలాయించారో అదే ధోరణిలో నేటీ టీఆర్ఎస్ దొరలు ప్రజాస్వామ్యాన్ని అధికారంతో చెలాయిస్తున్నారని మండిపడ్డారు. ఇది గమనించి ప్రజలు దుబ్బాక ఎన్నికలలో టీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పాలని ఆమె విజ్ఞప్తి చేశారు.