తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగింది వాస్తవమేనని ఈ కేసులో A5గా ఉన్న అపూర్వ చావడా సిట్ విచారణలో అంగీకరించినట్లు సమాచారం.
కెమికల్ ఇంజినీరింగ్ చదివిన తాను నెయ్యిలో రసాయనాలు కలిపానని విచారణ సందర్భంగా అపూర్వ చావాడా అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆ రసాయనాలను ఎక్కడి నుంచి సేకరించారని ఎంత మోతాదులో వినియోగించారని, ఇంకా ఇందులో ఎవరెవరి పాత్ర ఉందనే విషయాలపై తదుపరి దర్యాప్తు అవసరమని సిట్ భావించింది. అందుకోసం అపూర్వ చావడాను మరోసారి కస్టడీకి అప్పగించాలని కోరుతూ తిరుపతి రెండో అదనపు మున్సిఫ్ కోర్టులో సిట్ తరఫున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు.
అపూర్వ చావాడా పాటు ఏ3 విపిన్ జైన్‌ను కూడా కస్టడీకి ఇవ్వాలని కోరారు సిట్ తరపు న్యాయవాదులు. సిట్ తరఫున స్థానిక ఏపీపీ, విజయవాడలోని సీబీఐ కోర్టు ఏపీపీ వాదనలు వినిపించారు. మరోవైపు భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్లు విపిన్ జైన్ (ఏ3), పొమిల్ జైన్ (ఏ4) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను వారి తరఫు న్యాయవాదులు ఉపసంహరించుకున్నారని ఏపీపీ పి.జయశేఖర్ తెలిపారు. కస్టడీ పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున బెయిల్ విజ్ఞప్తిని వెనక్కు తీసుకున్నామని న్యాయవాదులు తెలిపారు. దీంతో జడ్జి కోటేశ్వరరావు వారి పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న కేసులో కీలక నిందితులను ఈ నెల ప్రారంభంలో సిట్ అరెస్టు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో CBI నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్.. ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో ఉన్న బోలేబాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్‌తో పాటు..తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెనుమాకలోని వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్ లిమిటెడ్ సీఈవో అపూర్వ వినయ్‌కాంత్ చావాడా, తమిళనాడులోని దిండిగల్‌లో ఉన్న ఏఆర్ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ రాజు రాజశేఖరన్‌ను అరెస్టు చేసింది.











