పార్లమెంటు సమావేశాలు ఈ నెల 19 నుంచి జరగనున్న నేపథ్యంలో ఎంపీ రఘురామరాజు వ్యవహారంలో వైసీపీకి తలనొప్పులు తప్పేలా లేవు. దీని నుంచి బయటపడేందుకు వైసీపీ ఎంపీలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించే సూచనలు కనిపించడం లేదు. గురువారం సాయంత్రం మరోసారి వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు ఆ పార్టీ ఎంపీలు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని డిమాండ్ చేస్తూ ఓంబిర్లాకు విజయసాయిరెడ్డి ఇటీవల లేఖ కూడా రాశారు.ఈ రోజు నేరుగా వైసీపీ ఎంపీలు విజయసాయి, మిథున్‌రెడ్డి, భరత్‌లు స్పీకర్‌ను మరోసారి కలిసి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు రఘురాజు పాల్పడుతున్నారంటూ మరిన్ని ఆధారాలను స్పీకర్‌కు అందజేశారు. వెంటనే రఘురామరాజుపై అనర్హత వేటు వేయాలని కోరారు.
వైసీపీ స్పీడుకి స్పీకర్ ఓం బిర్లా బ్రేకులు
వైసీపీ ఎంపీల స్పీడుకి స్పీకర్ ఓం బిర్లా బ్రేకులు వేసినట్లు సమాచారం. రఘురామ ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీకి పంపామని, విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది. రఘురామరాజు వ్యవహారం పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ వరకూ వెళితే వ్యవహారం ముదిరి పాకాన పడుతుందని వైసీసీ నేతలు కంగారుపడుతున్నట్లు వాదనలున్నాయి. ఒక ఎంపీపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని నిరూపణ అయితే జగన్ సర్కార్‌కి షాక్ తప్పదన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎంపీ విజయసాయిరెడ్డి అసహనం వ్యక్తం చేస్తూ రఘురామపై అనర్హత పిటిషన్ వేసి ఏడాది గడిచిందని, తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరినట్టు తెలిపారు. స్పీకర్ చర్యలు తీసుకోకుంటే పార్లమెంట్‌లో ఆందోళన చేపడతామని వ్యాఖ్యానించటమే గాక అవసరమైతే పార్లమెంట్‌ను స్తంభింపజేస్తామన్నారు.
బెదిరింపులపై రఘురామ తాజా లేఖ..
ఎంపీ విజయసాయిరెడ్డి బెదిరింపు దోరణి అవలంభిస్తున్నానంటూ తాజాగా ఎంపీ రఘురామరాజు లేఖలు రాశారు. పార్లమెంట్‌ను స్తంభింపచేస్తాననటాన్ని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు, ప్రివిలేజ్ కమిటీకి రాసిన లేఖల్లో రఘురామ ప్రస్తావించారు. గతంలో కూడ రాజ్యసభలో ఎంపీ విజయసాయి చైర్మన్‌ను బెదిరించేలా వ్యాఖ్యానించి తర్వాత ఉప సంహరించుకున్న విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టిన రఘురామరాజు
ఓ వైపు జగన్ బెయిల్ రద్దు చేయాలని న్యాయపోరాటం చేస్తూనే మరో వైపు సీఐడీ అరెస్టు సందర్భంగా తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన అంశాన్ని జాతీయ స్థాయిలో అందరి దృష్టికి తెచ్చి జగన్ సర్కారును ఇరకాటంలో పెట్టారు. ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న లోక్‌సభ సమావేశాల్లో ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావాలని రఘురామరాజు పట్టుదలతో ఉన్నారు. అదే జరిగితే జాతీయ స్థాయిలో వైసీపీకి డ్యామేజ్ తప్పదు. అందుకే ఆయన్ను త్వరగా పార్టీ నుండి సస్పెండ్ చేయించాలని వైసీపీ ఎంపీలు ఆరాటపడుతున్నా అది జరిగే సూచనలు కనిపించడం లేదు.
Must Read ;- సీబీఐ ఓకే అంటే.. వారంలో జైలుకు జగన్