తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు.. రాజకీయాల్లో ఆరితేరిన నేత. ఎన్నికల వ్యూహాల్లో ఆయనను మించిన వారు లేరు. ఇదేదో.. టీడీపీ శ్రేణులు చెప్పే మాటలు కాదు. తెలుగు ప్రజలకు మాత్రమే తెలిసిన మాట ఎంతమాత్రమూ కాదు. యావత్తు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలకు చంద్రబాబుపై ఇదే అభిప్రాయం ఉందనే చెప్పాలి. చంద్రబాబుతో ప్రత్యక్షంగా తలపడాలంటే.. ఏ పార్టీ అయినా వణికిపోవాల్సిందే. బాబు పోల్ ప్లాన్స్ అలాంటివి మరి. ఈ మాటను ఇప్పుడెందుకు గుర్తు చేసుకోవాలంటే.. తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ బాబు పేరు వింటేనే జడిసిపోతున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ మేనల్లుడు, పార్టీలో సీనియర్ నేత, మంత్రి తన్నీరు హరీశ్ రావు తాజాగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని చెప్పాలి.
రేవంత్ కు ఓనమాలు నేర్పింది బాబే
తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చంద్రబాబు వద్ద రాజకీయ ఓనమాలు దిద్దిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం టీ పీసీసీ చీఫ్ గా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. బాబు శిక్షణ ఫలితంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓ రేంజిలో దూకుడుతో సాగుతున్నారు. టీ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎంపికైన వార్త టీఆర్ఎస్ శ్రేణుల్లో అలజడి మొదలైంది. అందుకు నిదర్శనంగా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన నేతలను రంగంలోకి దించిన గులాబీ పార్టీ అధిష్ఠానం రేవంత్ పై దాడి మొదలెట్టేసింది. ఈ దాడికి రేవంత్ నుంచి వస్తున్న ప్రతిస్పందనతో ఇప్పుడు నిజంగానే టీఆర్ఎస్ లో ఓటమి భయం పట్టుకుందనే చెప్పాలి.
హరీశ్ ఏమన్నారంటే..?
ఇలాంటి తరుణంలో మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. హరీశ్ రావు ఏమన్నారంటే.. *రేవంత్ ముసుగులో టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలో మళ్లీ అడుగుపెట్టారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని తెలంగాణలో గెలవాలని చంద్రబాబు ప్రయత్నించారు. అయితే చంద్రబాబుని ఆంధ్రబాబు అంటూ తెలంగాణ ప్రజలు వెళ్లగొట్టారు. టీడీపీ ముఖం పెట్టుకుని వస్తే చంద్రబాబుని తెలంగాణ ప్రజలు రానివ్వరని.. అందుకే తన మనుషులను కాంగ్రెస్ పార్టీలోకి ముందు పంపి, ఇప్పుడు చంద్రబాబు అడుగుపెడుతున్నారు* అంటూ హరీశ్ తనలో, తన పార్టీలో చంద్రబాబు అంటే ఇప్పటికీ చెక్కుచెదరని భయాన్ని వెల్లడించారు. మొత్తంగా చంద్రబాబు పేరు వింటేనే ఇప్పటికీ టీఆర్ఎస్ వణికిపోతున్న తీరును స్వయంగా హరీశ్ బయటపెట్టిన తీరు ఆసక్తి రేకెత్తిస్తోంది.
Must Read ;- కాంగ్రెస్ లో టీజేఎస్ విలీనం ఉండదు!