Vijayasai Reddy Eyes On Mudasarlova In Vizag :
ఒకప్పుడు పునాదులు వేసుకున్నారు. అనుకోకుండా కథలు అడ్డం తిరిగాయి. దీంతో ఆశలు వదిలేసుకున్నారు. కాని కాలం కలిసొచ్చి పవర్ పేచీ పెట్టకుండా చేతికొచ్చింది. దీంతో అడ్డం తిరిగిన కథలను మలుపు తిప్పి ముందుకు నడిపించుకుంటున్నారు. అప్పుడు తీరని కలను ఇప్పుడు తీర్చేసుకుంటున్నారు. విశాఖపట్నంలో విలువైన భూములను ఏరికోరి ఎంచుకుంటున్న ఎంపీ విజయసాయిరెడ్డి.. లేటెస్టుగా ముడసర్లోవ భూములపై కన్నేశారు.
ఎవరి ప్రమేయం లేకుండానే..
ముడసర్లోవ పార్కును రూ.30 కోట్లతో నిర్మించాలని ఎంపీగారు చెప్పేశారు. పర్యాటకశాఖా మంత్రికి తెలియదు.. విశాఖ కలెక్టర్‌కు తెలియదు.. కేవలం మున్సిపల్ కమిషనర్‌ను వెంటబెట్టుకుని వెళ్లి.. ఈ మాట చెప్పేశారు సార్. ఇంతకీ ఎందుకీ ఆలోచన అంటే.. దీని వెనక చాలా వంచనా లోచన ఉందని అర్ధమవుతోంది. దీని పక్కనే 200 ఎకరాల వరకు భూములను అప్పట్లో వైఎస్ హయాంలో కాంగ్రెస్ నేతలు కొన్నారు. ఇప్పుడు వైసీపీలో ఉన్న ఆ నేతలు.. ఆ ల్యాండ్ కొని డబ్బులు వేస్ట్ అయిపోయాయే అని బాధపడ్డారు. అప్పుడు కూడా ఇలాగే పార్క్ నిర్మించాలని ముందుకు వెళ్లి.. కనీసం పార్క్ మెయిన్ టెయినెన్స్ కాస్ట్ కూడా రాదని తెలిసి వైఎస్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
పాత ప్లాన్ తెరపైకి
అయితే ఇప్పుడు మళ్లీ అదే ప్లాన్‌ను ఇప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకు నెడుతోంది. అప్పుడు కాంగ్రెస్‌లో ఉండి భూములు కొన్న నేతలు.. ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. అందుకే ఈ కథ స్క్రీన్ ప్లే స్పీడుగా నడుస్తోందని తెలుస్తోంది. గిరిజన ప్రదిక్షణ రూట్ సర్వే పేరుతో బయల్దేరిన విజయసాయిరెడ్డి.. ఎక్కడెక్కడ విలువైన భూములున్నాయో..వాటిని ఎలా దక్కించుకోవాలో.. వాటితో ఏం చేయాలో .. ఇదే ప్లాన్ లో ఉన్నారు. అందులో భాగమే ఇప్పుడీ ముడసర్లోవ పార్కు ప్రతిపాదన.
ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్‌పై కన్ను
ఇంకో కొసమెరుపు ఏంటంటే.. ఈ పార్కు పక్కనే ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ ఉంది. ఇది ఎప్పుడో బ్రిటీష్ హయాంలో మొదలు పెట్టింది.. పాత జమీందారీ వంశస్తులు కూడా వాడుకున్నది. ఇప్పుడు గోల్ఫ్ క్లబ్ ఏ పేరుతో ఉంది..ఎవరి పేరుతో ఉంది.. ఏ జోన్‌లో ఉంది.. మొత్తం వివరాలు కావాలని విజయసాయిరెడ్డి అధికారులను ఆదేశించారు. అంటే ఇప్పుడు అవన్నీ తెలుసుకుని..దానిని తామెలా వాడుకోవాలో డిసైడ్ చేస్తారు ఎంపీ గారు. పార్కు పక్కనే ఉంటుంది కాబట్టి..ఇంకేదైనా పెద్ద ప్లాన్ వేస్తారా.. లీజుకు ఎవరో ఒకరి పేరుతో తీసేసుకునే ప్లాన్ వేశారా అనే అనుమానాలు ఇప్పుడు వస్తున్నాయి.
విశాఖను ఇక ఆ దేవుడే రక్షించాలంటూ..
ఏ రాజ్యసభ సభ్యుడు అయినా.. ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించి..వాటి పరిష్కారానికి కృషి చేస్తారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. కాని ఈ ఎంపీ మాత్రం భూముల సర్వేలు చేస్తూ.. ఏ భూమిని ఎలా బూమరాంగ్ చేయాలో ప్లాన్లు వేస్తూ.. పక్కా రియల్ ఎస్టేట్ వ్యాపారిలా పర్యటనలు చేస్తున్నారు. విశాఖ నగరాన్ని ఇక ఆ దేవుడే రక్షించాలని కొందరు కామెంట్ చేస్తున్నారు.
Must Read ;- లోకేశ్ క్వశ్చన్.. సాయిరెడ్డీ నీ అర్హతేంటి?











