వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరిగి జైలుకు వెళ్లక తప్పదా? అన్న దిశగా ఆసక్తికర, హైటెన్షన్ రేకెత్తించే వార్తలు వైరల్ గా మారాయి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ భారీ ఎత్తున అక్రమాస్తులను కూడబెట్టారని పిటిషన్ దాఖలు కాగా… దానిపై సీబీఐ విచారణ, జగన్ అరెస్ట్ వెంటవెంటనే జరిగిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 16 నెలల పాటు జగన్ జైల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆపై ఎలాగోలా బెయిల్ తెచ్చుకున్న జగన్… ఏపీకి ఏకంగా సీఎం అయిపోయారు. అయితే ఈ బెయిల్ ను రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ కేసును విచారిస్తున్న నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇప్పటికే దఫదఫాలుగా విచారణ జరగ్గా… గురువారం నాడు తుది తీర్పు వెలువడే అవకాశాలున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇంకెన్ని కౌంటర్లు వేస్తారు?
గురువారం నాటి విచారణ సందర్భంగా జగన్ తరఫు న్యాయవాదులపై సీబీఐ ప్రత్యేక కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఇంకెన్ని కౌంటర్లు వేస్తారు? ఆ కౌంటర్లకు ఇంకెన్ని సార్లు విచారణను వాయిదా వేయాలి? ఇక వాయిదాలే లేవు. ఏం చెప్పాలనుకుంటున్నారో… రెండు గంటల వ్యవధి తర్వాత చెప్పండి’’ అంటూ కోర్టు జగన్ న్యాయవాదులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే జగన్ అనుకూలురుల్లో, వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
విచారణకు ముగింపు ఖాయమే
జగన్ బెయిల్ ను రద్దు చేయాలని రఘురామ పిటిషన్ వేస్తే… దానికి కోర్టు ఆదేశాలతో జగన్ కౌంటర్ దాఖలు చేశారు. అయితే ఆ కౌంటర్ లో జగన్ అన్నీ తప్పుడు వివరాలే చెప్పారంటూ రఘురామ రీజాయిండర్ దాఖలు చేశారు. ఈ రీజాయిండర్ పై వాదనలు వినిపించడానికి బదులుగా… కౌంటర్ దాఖలు చేస్తామని జగన్ తరఫు లాయర్లు చెప్పినంతనే… సీబీఐ ప్రత్యేక కోర్టు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘రీజాయిండర్లపై కౌంటర్లు ఎందుకు? వాటిపై మధ్యాహ్నం 2,30 గంటల తర్వాత వాదనలు వినిపించండి. రీజయిండర్లపై కౌంటర్లకు అనుమతించే ప్రసక్తే లేదు’’ అని కోర్టు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో జగన్ బెయిల్ వ్యవహారంపై కోర్టు గురువారం నాటి విచారణతో తన నిర్ణయాన్ని చెప్పేందుకే సిద్ధమైనట్లుగా స్పష్టమవుతోంది. అయితే నిర్ణయాన్ని గురువారమే వెల్లడించకున్నా… విచారణను మాత్రం ముగించే అవకాశాలు అయితే స్పష్టంగానే కనిపిస్తున్నాయి. అయితే విచారణను ముగించడంతో పాటుగా నిర్ణయాన్ని కూడా గురువారమే వెల్లడిస్తే మాత్రం జగన్ వర్గానికి టెన్షన్ తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- జగన్‌తో షర్మిల ఢీ.. నమ్మశక్యంగా లేదే!