జగన్ లో నిజంగానే జూలై టెన్షన్ పెరిగిపోయింది. జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై ఇప్పటికే దాదాపుగా విచారణ పూర్తి అయ్యింది. జగన్ కేసులను దర్యాప్తు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మాట కోసమే నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు వేచి చూస్తోంది. గురువారం జరిగిన విచారణ సందర్భంగా సీబీఐ కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నెల 14కు విచారణ వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించిన కోర్టు.. ఆ రోజున తుది విచారణ జరుపుతామంటూ తేల్చేసింది. అంటే.. ఆ రోజున జగన్ కు బెయిల్ కొనసాగుతుందా? రద్దు అవుతుందా? అన్న విషయం తేలిపోతుందన్న మాట.
బెయిల్ కొనసాగితే సీబీఐదే తప్పు
జగన్ కు కోర్టు గనుక బెయిల్ కొనసాగిస్తూ తీర్పు చెబితే.. ఆ తప్పు సీబీఐదేనన్న కోణంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఎందుకంటే.. రఘురామ దాఖలు చేసిన పిటిషన్ పై ఇప్పటికే రఘురామతో పాటు ప్రతివాదిగా ఉన్న జగన్ కూడా కోర్టుకు తమ అభిప్రాయాలను కౌంటర్లు, అఫిడవిట్ల రూపంలో దాఖలు చేశారు. అయితే మరో ప్రతివాదిగానే కాకుండా కీలక ప్రతివాది అయిన సీబీఐ ఈ పిటిషన్ కు సంబంధించిన కౌంటర్ ను ఇప్పటిదాకా దాఖలు చేయలేదు. గురువారం నాడు కూడా తన అభిప్రాయాన్ని చెప్పని సీబీఐ.. తదుపరి విచారణలోగా అయినా కౌంటర్ దాఖలు చేస్తుందా? లేదా? అన్న అంశంపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో 14వ తేదీన జరిగే విచారణలో సీబీఐ వ్యవహరించే తీరుపై జగన్ జైలుకు వెళతారా? రఘురామ పిటిషన్ డిశ్చార్జీ అవుతుందా? అన్నది అధారపడి ఉందన్నమాట.
అప్పుడలా.. ఇప్పుడిలా..
గతంలో జగన్ కు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలంటూ సీబీఐ ఇటు సీబీఐ ప్రత్యేక కోర్టుతో పాటు అటు హైకోర్టునూ ఆశ్రయించింది. అంతేకాకుండా కేసులో కీలక సాక్షులను జగన్ ప్రభావితం చేస్తున్నారని కూడా సీబీఐ ఆరోపించింది. అయితే ఇప్పుడు అవే అంశాలను ప్రస్తావిస్తూ రఘురామ పిటిషన్ దాఖలు చేస్తే మాత్రం సీబీఐ నోరు విప్పడం లేదు. అంటే.. నాడు జగన్ బెయిల్ ను రద్దు చేయాలన్న సీబీఐ.. ఇప్పుడు జగన్ కు బెయిల్ కొనసాగేలా వ్యవహరిస్తోందా? అన్న దిశగా ఆసక్తికర చర్చకు తెర లేసింది. అంతేకాకుండా 14వ తేదీన సీబీఐ గనుక తనదైన శైలి స్టాండ్ లో నిలిస్తే.. అదే రోజు జగన్ జైలుకు వెళ్లడం ఖాయమేనన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
Must Read ;- జగన్ పై రఘురామ బిగ్ ఫైట్.. హైకోర్టులో పిల్











