ఏపీ అప్పుల కుప్పగా మారింది. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఏపీ ప్రభుత్వం అప్పులమీద అప్పులు చేయడంపై కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఏపీ చేసిన అప్పులు పరిశీలిస్తే ఎవరికైనా ఆందోళన తప్పదన్నట్లుగా వ్యవహారం తయారైంది. 2020 నవంబరు నాటికి రూ. 3,73,140 కోట్ల అప్పులు చేసి ఏపీ ప్రభుత్వం సరికొత్త రికార్డులను నమోదు చేసింది. కేవలం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబరు వరకు చేసిన అప్పులే రూ.73811 కోట్లు దాటిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకోవాల్సిన మొత్తం అప్పులు రూ.48,295 కోట్లు మాత్రమే. అయితే ఏపీ ప్రభుత్వం అప్పులు చేయడంలో ప్రదర్శిస్తున్న దూకుడు రెవెన్యూ పెంచుకోవడంలో మాత్రం చూపడం లేదని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళన కలిగిస్తోన్న రెవెన్యూలోటు
ఏపీ చేస్తున్న అప్పులే కాదు, రెవెన్యూ లోటు కూడా ఆందోళన కలిగిస్తోంది. ఒక్క నవంబరు నెలలోనే ఏపీ ప్రభుత్వం తీసుకున్న అప్పులు రూ.13,001 కోట్లు అంటే కాగ్ అధికారులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక ఏపీ రెవెన్యూ లోటు రూ.57,925 కోట్లకు ఎగబాకింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీ సగటున నెలకు 9226 కోట్ల రూపాయల అప్పు చేసి, అప్పులు చేయడంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు కొత్త దారులు చూపుతోందని కొందరు ఆర్థిక నిపుణులు జోకేలేసుకుంటున్నారు. ఏపీ చేస్తున్న అప్పుల ట్రెండ్ ను పరిశీలిస్తే, 2021 మార్చి చివరి నాటికి మరో రూ.30,000 కోట్ల అప్పులు చేసే అవకాశం ఉంది.
దీంతో మొత్తం అప్పులు 2020-21 ఆర్థిక సంవత్సరంలో లక్షా 4 వేల కోట్లకు చేరతాయి. దీంతో అత్యధికంగా అప్పులు చేసిన రాష్ట్రాల్లో ఏపీ మొదటి రెండు స్థానాలకు చేరే అవకాశం ఉంది.
అప్పులు ఎవరి పాలనలో ఎంత పెరిగాయంటే?
రాష్ట్ర విభజన నాటికి ఏపీ అప్పులు రూ.97,000 కోట్లు మాత్రమే. అంటే ఉమ్మడి రాష్ట్రంలో అప్పులు తీసుకోవడంలో కొంచెం ఆచితూచి వ్యవహరించారని భావించాల్సి ఉంటుంది. ఇక 2019 నాటికి అది రూ.258,928 కోట్లకు చేరింది. అంటే చంద్రబాబు పాలనలో కొత్తగా లక్షా 61 వేల కోట్ల అప్పులు చేశారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక, అప్పులు చేయడంలో దూకుడు ప్రదర్శించారని అర్థం చేసుకోవచ్చు. 2019 ఏప్రిల్ నుంచి 2020 నవంబరు నాటికి అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి 17 నెలల్లో చేసిన అప్పు అక్షరాలా రూ.1,06,866 కోట్లు. అంటే అప్పు లేనిదే ఏపీలో జీతాలు, ఫించన్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదని అర్థం చేసుకోవచ్చు.
అంతా ఉచిత పథకాల మహిమే..
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 8 నెలల్లో రెవెన్యూ వ్యయం రూ.70,082 కోట్లకు చేరింది. ఇదంతా ఉచిత పథకాలకు అయిన ఖర్చుగానే పరిగణించాల్సి ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో ప్రజలపై రూ.21000 కోట్ల పన్నుల భారం వేసినా, కరోనా కారణంగా ఆశించిన ఆదాయం రాలేదని ప్రభుత్వం చెబుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం నవంబరు నాటికి పన్నుల ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.46,589 కోట్లు, గత ఏడాది ఇదే కాలంతో పోల్చుకుంటే కేవలం రూ.4,500 కోట్లు మాత్రమే తక్కువ. ఆదాయం లేకపోయినా ఉచిత పథకాలు మాత్రం ఆగడం లేదు. ఉచిత పథకాలు కొనసాగించేందుకు అయిన కాడికి అప్పులు తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.
అప్పుల కోసం కార్పొరేషన్ల ఏర్పాటు
కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే గ్రాంట్లు పెరిగినా ఏపీ మాత్రం అప్పులు చేయడంలో దూసుకుపోతోంది. ఈ ఏడాది కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో గత ఏడాది కన్నా రూ.8000 కోట్లు అదనంగా వచ్చాయి. అయినా కొత్త అప్పలు చేసేందుకు ఏపీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. జాతీయ బ్యాంకుల నుంచి రూ.10000 కోట్ల రుణాలకు ప్రయత్నిస్తున్నారు. అమ్మఒడి పథకం ద్వారా 43 లక్షల మంది ఖాతాలో నగదు వేసేందుకు భారతీయ స్టేట్ బ్యాంకు అప్పు కోసం ప్రభుత్వం ఎదురు చూస్తోంది. అమ్మఒడి ద్వారా చదువుకుంటున్న విద్యార్థుల తల్లి ఖాతాలో రూ.15000 జమ చేయాల్సి ఉంది. కానీ టాయిలెట్ డెవలప్ మెంటు కింద ప్రభుత్వం రూ.1000 కట్ చేయడం విమర్శలకు తావిస్తోంది. ఇచ్చినట్టే ఇచ్చి కట్ చేస్తున్నారని లబ్దిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వడ్డీల చెల్లింపు కోసం కొత్త అప్పులు
ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించేందుకే ఏటా రూ.35,000 కోట్ల అప్పులు చేయాల్సి వస్తోందని, పేరు చెప్పడానికి ఇష్ట పడని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి నెలా మొదటి వారంలో అప్పు చేయనిదే జీతాలు, పింఛన్లు చెల్లించే పరిస్థితి లేదని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెవెన్యూ లోటు పైపైకి..
ఏపీ రెవెన్యూ లోటు పైపైకి ఎగబాకుతోందని ప్రతిపక్ష నేతలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ రెవెన్యూ లోటు 1,10,320 కోట్లకు చేరుకుందని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు. 19 నెలల జగన్మోహన్ రెడ్డి పాలనలో రూ.1,50,000 కోట్లు అప్పులు చేయడంతోపాటు, ప్రజలపై అదనంగా రూ.75,000 కోట్ల పన్నుల భారం మోపారని యనమల గుర్తు చేశారు. ఏపీలో అప్పులు చేయనిదే రోజు గడిచే పరిస్థితి లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ చేస్తున్న అప్పులపై కాగ్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది.
Also Read: కత్తితో దాడికి తెగబడ్డ వైసీపీ నేత











