ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన అంశం తీవ్ర చర్చనీయాంశంగా ఉంది. సంక్రాంతి నాటికి జిల్లాల పునర్విభజన కసరత్తు పూర్తి చేసేందుకు సర్కారు సమాయత్తమవుతోంది. ప్రజాభిప్రాయ సేకరణకు, పునర్విభజన నిర్వహించేందుకు సర్కారు ఒక కమిటీ వేసింది. ప్రభుత్వం యోచిస్తున్నవిధంగా పార్లమెంటు నియోజకవర్గం ప్రాతిపదికన జిల్లాల విభజన జరిగితే సిక్కోలు తల, తోక లేని మొండెంగా మిగులుతుందని స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
సముద్రం ఇసుకే మిగులుద్ది
పార్లమెంటు నియోజకవర్గం ప్రాతిపదికన జిల్లాల విభజన జరిగితే శ్రీకాకుళం జిల్లాగా ఇచ్చాపురం, పలాస, పాతపట్నం, టెక్కలి, నరసన్నపేట, ఆమదాలవలస, శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గాలు మిగులుతాయి. ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం నియోజకవర్గంలోని అత్యధిక భాగం సముద్రతీరప్రాంతమే. అందువల్ల అక్కడ దేనికీ పనికిరాని సముద్రపు ఇసుక తప్పించి ఇంకొకటి దొరకదని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం బాగా అభివృద్ధి చెందిన రాజాం, ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గాలు విజయనగరం జిల్లాలో కలిసిపోతాయి. ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారంగా ప్రసిద్ధి చెంది సహజ , అటవీ ఉత్పత్తులకు నిలయమైన పాలకొండ అరకు జిల్లాలోకి వెళ్లనుంది. అటువంటి పరిస్థితుల్లో అభివృద్ధికి ఆమడదూరాన , నిరుద్యోగులకు నిలయంగా, పేదరికానికి మారుపేరుగా, వలసలకు పెట్టింది పేరుగా ఉన్న శ్రీకాకుళం మరింత వెనుకబడే అవకాశం ఉంది.
ప్రజాప్రతినిధులకు పట్టని వైనం..
స్థానికంగా ఒక ఉప ముఖ్యమంత్రి, శాసనసభాపతి, మత్స్యశాఖ మంత్రి, అధికార ప్రతిపక్షాల నుండి సీనియర్ ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ ఎవరూ ఈవిషయంలో నోరు విప్పడం లేదు. గొంతు పెగల్చడం లేదు. వారి వ్యక్తిగత రాజకీయ ప్రాభవం కోసం పాకులాడడం, ఒకరితోఒకరు కీచులాడుకోవడం తప్ప ప్రజాప్రయోజనాలు వారికి పట్టడం లేదు. అందువల్ల ఈ జిల్లా అనాదిగా అభివృద్ధికి ఆమడ దూరాన నిలుస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
భౌగోళిక ప్రాతిపదికన విభజన జరగాలి
జిల్లాల పునర్విభజన భౌగోళిక, అభివృద్ధి ప్రాతిపదికన జరగాలని , పార్లమెంటు నియోజకవర్గం ప్రాతిపదికన కాదని స్థానికులు , మేధావులు, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ప్రగతికాముకులు ఆశిస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గం ప్రాతిపదికన విభజిస్తే శ్రీకాకుళానికి ఒకటి, రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయనగరంలోను, 150కిలోమీటర్ల దూరంలో ఉన్న అరకులోను కలుస్తాయని, అప్పుడు పరిపాలన సౌలభ్యం ఎలా చేకూరుతుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం ఈ జిల్లా పునర్విభజన విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో , దానికి ప్రజల ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుందో వేచిచూడాలి.











