బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం వలన వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. ఈ వర్షాల వలన విశాఖ నగరం అతలాకుతలం అవుతోంది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో విశాఖ పోర్టుకు రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్ కు చెందిన కార్గో షిప్ ఒకటి వచ్చి ఉంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి వీచిన ఈదురు గాలులకు నౌక తెన్నేటి పార్క్ తీరానికి కొట్టుకు వచ్చింది. పార్క్ సమీపంలోని రాళ్ల మధ్య నౌక చిక్కుకుపోయింది. ప్రమాదాన్ని పసిగట్టిన సిబ్బంది ముందుగానే దాని నుంచి సురక్షితంగా బయటపడ్డారు. యాంకర్లు సరిగా వేయకపోవడంతో పాటు ఇంజన్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతోనే నౌక కదిలినట్లు సిబ్బంది చెబుుతున్నారు. ఈ నౌకలో దాదాపు 15 మంది బంగ్లాదేశీయులు ఉన్నారు.
భారీ నౌక తెన్నేటి పార్క్ సమీపానికి కొట్టుకుని వచ్చిందని తెలియడంతో స్థానికులు నౌకను చూడటానికి తరలివస్తున్నారు. విషయయం తెలుసుకున్న నేవి అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నౌకను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. నౌక దాదాపు 80 మీటర్ల పొడవు ఉండటంతో రాళ్ల మధ్య చిక్కుకున్న నౌకను తీసేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు.