దశాబ్దాల కాలం నాటి ఉత్తరాంధ్ర కల సాకారం అయ్యే సమయం వచ్చింది. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ రావాలన్న ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్నాయి. వైజాగ్ కేంద్రంగా ఏర్పాటు చేసిన దక్షిణా కోస్తా రైల్వే జోన్.. జనరల్ మేనేజర్ కార్యాలయం సిద్ధమైంది. నగరంలోని సిరిపురంలో జోనల్ కార్యాలయం కోసం రెండు అంతస్తులను లీజు ప్రాతిపదకన తీసుకొన్నారు. ఇందులో ఒక ఫ్లోర్‌ని జనరల్ మేనేజర్ ఆఫీసు కోసం సిద్దం చేశారు. రైల్వే జోన్‌లోని వివిధ డిపార్ట్‌మెంట్ల హెచ్‌ఓడీల కోసం రెండో ఫ్లోర్‌ను రెడీ చేస్తున్నారు. మరోవైపు కొత్తగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా జోన్ కోసం ఉద్యోగులను ఎంపిక చేయాలని రైల్వే శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి.
దక్షిణ కోస్తా జోన్‌తో పాటు.. కొత్తగా ఏర్పడుతున్న రాయగఢ డివిజన్‌లో పని చేయడానికి ఆసక్తి ఉన్న ఉద్యోగులు.. జోన్ కార్యాలయంలో ఆప్షన్స్ ఇవ్వాలని ఆర్డర్స్ ఇచ్చారు. సికింద్రాబాద్ కేంద్రంగా నడుస్తున్న దక్షిణ మధ్య రైల్వే జోన్, భువనేశ్వర్ కేంద్రంగా నడుస్తున్న తూర్పు కోస్తా రైల్వే జోన్‌లలో పని చేస్తున్న ఉద్యోగులు కొత్తగా వస్తున్న దక్షిణ కోస్తా జోన్‌లో పని చేయడానికి ఆసక్తి చూపిస్తే వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు.. తూర్పు కోస్తా జోన్‌లోని వాల్తేరు డివిజన్ ఉద్యోగులకు ప్రధమ ప్రాధాన్యం ఇస్తారు. ఈ జోన్లలో మిగిలిన డివిజన్ల వారికి ద్వీతీయ ప్రాధాన్యం దక్కుతుంది.
ఈ రెండు జోన్లు మినహా ఇండియన్ రైల్వేస్‌లో ఇతర ఏ ప్రాంతంలో పనిచేసే వారికైనా తృతీయ ప్రధాన్యం కేటాయిస్తారు. రాయగఢ డివిజన్ చేరాలనుకుంటే.. వాల్తేరు డివిజన్ ఉద్యోగులకు ప్రథమ ప్రాధాన్యం లభిస్తుంది. తూర్పు కోస్తా జోన్ ఎంప్లాయీస్‌కి సెకెండ్ ప్రయారిటీ.. ఇతర రైల్వే ఉద్యోగులకు థర్డ్ ప్రయారిటీ ఇస్తారు. 15 రోజుల్లో ఉద్యోగుల ఆప్షన్స్‌ను రైల్వే బోర్డుకు పంపుతారు. ఢిల్లీ నుంచి ఉద్యోగుల ఎంపిక ఫైనల్ అయిన తర్వాత.. అధికారికంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అమల్లోకి వస్తుంది











