అనుపమ పరమేశ్వరన్ పేరు వినగానే చేపపిల్లలాంటి ఆమె కళ్లు గుర్తొస్తాయి .. అవి చెప్పే కొంటె కబుర్లు వినిపిస్తాయి. ‘అ ఆ’ సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైన ఈ అమ్మాయి, తొలి ప్రయత్నంలోనే శభాష్ అనిపించుకుంది. ‘పిట్టకొంచెం కూత ఘనం’ అన్నట్టుగా అమ్మాయి బాగా చేసిందని అనిపించుకుంది. ఆ తరువాత అనుపమ చేసిన ‘ప్రేమమ్‘ ఆమెను యూత్ హృదయాలకు మరింత దగ్గరగా తీసుకెళ్లింది. యువ కథానాయకులకు మంచి జోడీ దొరికిందనే టాక్ ఇండస్ట్రీలోనూ వినిపించింది. దాంతో అనుపమకు వరుసగా అవకాశాలు వచ్చాయిగానీ, ఆమె తనకి నచ్చిన పాత్రలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెళ్లింది.
అనుపమ అదృష్టం కొద్దీ కుర్ర హీరోల జోడీగా ఆమెకి మంచి పాత్రలు పడ్డాయి. హీరోతో ఆడిపాడటమే కాదు .. నటనకు అవకాశం ఉన్న పాత్రలు అవి. అందువలన ఆ పాత్రలు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అలా ఆమె చేసిన సినిమాల జాబితాలో, ‘శతమానం భవతి’ .. ‘ఉన్నది ఒకటే జిందగీ‘ .. ‘కృష్ణార్జున యుద్ధం’ .. ‘హలో గురు ప్రేమకోసమే’ కనిపిస్తాయి. ఈ సినిమాలన్నీ కూడా వేటికవే వైవిధ్యభరితమైనవిగా కనిపిస్తాయి. అల్లరి పిల్లగానే కాదు, బరువైన పాత్రలను కూడా ఈ అమ్మాయి చేయగలదని ప్రశంసలు అందుకుంది.
క్రితం ఏడాది బెల్లంకొండ శ్రీనివాస్ ‘రాక్షసుడు’ సినిమా ద్వారా అనుపమ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా విజయవంతమైంది .. కాకపోతే అనుపమ పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం వలన ఆ హిట్ ఆమె ఖాతాలోకి వెళ్లలేకపోయింది. ఆ తరువాత ఆమె నిఖిల్ హీరోగా ’18 పేజీస్’ సినిమా చేయనుందనే టాక్ వినిపించింది. కానీ తరువాత ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో అభిమానులు అయోమయానికి లోనయ్యారు. మరే ప్రాజెక్టుకి సంబంధించి ఆమె పేరు వినిపించకపోయేసరికి నిరాశ చెందారు.
గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అనుపమ ’18 పేజీస్’ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు మరో రెండు సినిమాలను కూడా ఆమె లైన్లో పెట్టేసింది. ‘దిల్’ రాజు ఫ్యామిలీ నుంచి హీరోగా వస్తున్న ఆశిష్ రెడ్డి జోడీగా ఆమె ‘రౌడీ బాయ్స్’ చేయనుంది. ‘హుషారు’ దర్శకుడు శ్రీహర్ష ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. మలయాళం నుంచి రానున్న ఒక తెలుగు రీమేక్ లోను ఆమె నటించనుంది. ఇలా మూడు ప్రాజెక్టులతో కొత్త ఏడాదిలో అనుపమ పరమేశ్వరన్ జోరు కొనసాగనుందనే తెలుస్తోంది.
Must Read ;- క్రేజీ అనుపమ.. ఐ లవ్ యూ అనుపమ అంటున్నారు!