తమిళనాట అమ్మ అంటే.. అందరికీ తెలుసు.. తమిళనాడు రాజకీయాలపై అవగాహన ఉన్నవారికీ తెలుసు.. ఆమెకే ఓ వ్యక్తి స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించారంటే.. ఆ వ్యక్తి స్థాయి అప్పట్లో ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆ అవకాశం కూడా గొప్పదే. ఆ అవకాశం దక్కించుకున్న తరువాత పార్టీనుంచి బయటకి వచ్చి..దాదాపు 20ఏళ్ల తరువాత మళ్లీ అదే పార్టీకి వెళ్లనున్నారు.. ఇదంతా ఎవరి గురించి అంటే.. లేడీ సూపర్ స్టార్ , ఫైర్ బ్రాండ్ విజయశాంతి గురించే. ఇటీవలి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న విజయశాంతి త్వరలో బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలోనూ ఇలాంటి ప్రచారం జరిగినా..ఆమె ఖండించారు. ఈ సారి మాత్రం ఆ ఖండనలు రాలేదు. దీంతో విజయశాంతి కాంగ్రెస్ ను వీడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నా.. తమకు ఏమాత్రం నష్టం లేదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఇక విజయశాంతి రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే..
ఎక్కడమొదలయ్యారో..అక్కడికే..
విజయశాంతి ఒకవేళ పార్టీ మారితే.. ఆమె తన రాజకీయ జీవితాన్ని ఎక్కడినుంచి ప్రారంభించారు..మళ్లీ అక్కడికే వెళ్లినట్టు భావించవచ్చు. సినిమాలు చేస్తున్న సమయంలోనే విజయశాంతి 1998లో బీజేపీలో చేరారు. అప్పట్లో భారతీయ మహిళా మోర్చా కార్యదర్శిగా నియమితుయ్యారు. నెల్లూరులో ఆమె చేసిన ప్రసంగం అప్పట్లో సంచలనం రేపింది. ఆ తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమె కడపనుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఇందుకు కారణం కూడా ఉంది. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ కడప నుంచి ఎంపీగా పోటీచేస్తారన్న ప్రచారం జరిగింది. దీంతో బీజేపీ అలర్ట్ అయింది. ఒక వేళ సోనియాగాంధీ కడపనుంచి పోటీ చేస్తే.. బీజేపీ తరఫున విజయశాంతిని ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమైంది. అయితే కర్ణాటకలో జరిగిన పరిణామాల నేపథ్యంలో సోనియాగాంధీ బళ్లారినుంచి పోటీ చేశారు. ఇక్కడే మరో విషయం కూడా ఉంది.
జయలలితకే స్టార్ క్యాంపెయినర్
విజయశాంతి ప్రత్యక్ష రాజకీయాల్లోకి 1998లో వచ్చినా.. పరోక్షంగా 1996లోనే రాజకీయాల్లోకి వచ్చారు. 1996లో AIADMK చీఫ్ జయలలితకు స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం చేశారు. అప్పటికే విజయశాంతి బీజేపీకి సానుభూతిపరురాలిగా ఉండేవారు. ఆ ఎన్నికల్లో తమిళనాడులో క్రికెటర్ శ్రీకాంత్ తో కలసి స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించారు. ఆ ఎన్నికల్లో జయలలిత ఓటమి చవిచూడాల్సి వచ్చింది. తరువాతి కాలంలో విజయశాంతి బీజేపీలోనే కొనసాగారు. తెలంగాణ ఉద్యమంలోనూ పాల్గొన్నారు. బీజేపీనుంచి బయటకు వచ్చారు. తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటుచేశారు. 2009లో తన పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. 2009లో మెదక్ నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఎంపీగా గెలిచారు. ఆ తరువాతే కేసీఆర్ తో విభేదాలు మొదలైనట్లు ప్రచారం జరిగింది.
మెదక్ సీటు విషయంలో..
2009లో విజయశాంతి గెలిచిన టైంలోనే.. కేసీఆర్ మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా గెలిచారు. అయితే కేసీఆర్ మెదక్ పార్లమెంటుపై ఎక్కువ దృష్టి సారించడంతో విభేదాలు తలెత్తినట్టు ప్రచారం జరిగింది. అందులో భాగంగానే ఆయన అప్పటి ఉమ్మడి మెదక్ జిల్లా లోని జగదేవ్ పూర్ మండల పరిధిలో ఉన్న ఎర్రవెల్లి తన వ్యవసాయక్షేత్రంలో ఉండడం, జిల్లా రాజకీయాపై దృష్టి పెట్టడం జరిగేది. ఇది నచ్చని విజయశాంతి పలు మార్లు పార్టీనాయకుల వద్ద అభ్యంతరం తెలిపినట్లు ప్రచారం జరిగింది. ఇందుకు టీఆర్ఎస్ నాయకులు అప్పట్లో మరో వాదన తెరపైకి తెచ్చారు. ఆ జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో సిద్ధిపేటలో హరీష్ రావు మినహా.. మిగతా స్థానాల్లో పార్టీని మరింత పటిష్టం చేయాల్సి ఉందనే ఉద్దేశంతో కేసీఆర్ దృష్టి పెట్టారని చెప్పారు. ఇక కారణాలు ఏవైనా 2011లో ఎంపీగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించినా.. నిర్ణీత ఫార్మాట్ లో లేదనే కారణంతో ఆ రాజీనామా ఆమోదం పొందలేదు. 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీచేసిన విజయశాంతి.. టీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2019ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీకి కూడా దూరంగా ఉండడం ప్రారంభించారు. తాజాగా బీజేపీలో చేరతారన్న ప్రచారం జరిగింది.
స్టార్ డమ్ పైనే ఆశ..
సినీ ఇండస్ట్రీలో లేడీ బాస్ గా పేరున్న విజయశాంతి రాజకీయాల్లో చాలా ఒడిదొడుకులు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఆమెకు ఉన్న స్టార్ డమ్ రాజకీయాల్లో ఓటర్లను ఆకర్షించడంలో పెద్ద ఉపయోగపడలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 2009లో ఆమె గెలిచిన మెదక్ లో ఉద్యమ సెంటిమెంట్ బాగా ఉందని పార్టీలో అప్పట్లో చర్చ నడిచింది. ఆ ఎన్నికల్లో పార్టీ కేవలం రెండు సీట్లే గెలిచింది. మహబూబ్ నగర్ లో కేసీఆర్, మెదక్ లో విజయశాంతి గెలిచారు. విజయశాంతి దాదాపు 6వేల ఓట్ల మెజార్టీ సాధించారు. ఇక విజయశాంతి పార్టీని వీడిన తరువాత.. 2014లో కేసీఆర్ అటు గజ్వేల్ లో ఎమ్మెల్యేగా, మెదక్ నుంచి ఎంపీగా పోటీచేశారు. కేసీఆర్ 3,97,029 ఓట్ల మెజార్టీతో ఎంపీగా గెలిచారు. ఇక 2014లోనే కేసీఆర్ ఎంపీ పదవికి రాజీనామా (గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచారు..సీఎం అయ్యారు) చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో కొత్త ప్రభాకర్ రెడ్డి 3,61, 286 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ఓట్లు టీఆర్ఎస్ వి మాత్రమేనని, విజయశాంతి సొంత కేడర్ ని నిర్మించుకోలేక పోయారని టీఆర్ఎస్ నాయకులు అప్పట్లో వ్యాఖ్యానించినట్టు ప్రచారం జరిగింది. ఇక 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన విజయశాంతి 50,054 ఓట్లు సాధించారు. రెండో స్థానంలో నిలిచారు.
కారణాలు ఏవైనా.. స్టార్ ఇమేజ్ ఉన్న విజయశాంతి.. కాంగ్రెస్ వీడడం దాదాపు ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో బీజేపీలో ఆమెకు ఎలాంటి ప్రాధాన్యం దక్కుతుంది అనేది తేలాల్సి ఉంది.