రాష్ట్రంలో చిట్టచివరిన ఉండి వెనుకబడిన జిల్లాగా ముద్రపడిన శ్రీకాకుళం జిల్లా క్రికెటర్లకు ఎట్టకేలకు సువర్ణావకాశం లభించింది. ఈ జిల్లాలో క్రికెట్ మైదానం ఏర్పాటుకు ఏసీఏకు 7.66 ఎకరాలు లీజుకు ఇస్తూ మంత్రి మండలి ఆమోదించింది.
ఎట్టకేలకు ..
శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులకు క్రికెట్ మైదానం ఎట్టకేలకు అందుబాటులోకి రానుంది. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఆమదాలవలస మండలం జగ్గుశాస్త్రులపేట మైదానం అభివృద్ధికి మార్గం సుగమమైంది. అందులో భాగంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)కు 7.66 ఎకరాలను 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇందుకుగాను ఏసీఏ రూ.2 లక్షలు చెల్లించనుంది. ఏటా రూ.12.5 శాతం లీజు రేటు పెంచేలా అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. జిల్లాలో క్రికెట్ అకాడమీ నిర్మించేందుకు స్థలం మంజూరు చేయాలని ఆంధ్రా క్రికెట్ అసోసియేన్ కొన్నేళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతోంది. గార మండలం అంపోలులో సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో అకాడమీ నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆ ప్రాంతంలో డీ పట్టాలు పొందిన రైతులు అడ్డుకోవడంతో ప్రక్రియలో జాప్యం జరిగింది. దీంతో గత మార్చిలో జగ్గుశాస్త్రులపేట మైదానం లీజుకు ఇవ్వాలని ఏసీఏ అధికారులు ప్రభుత్వాన్ని కోరగా ఈ మేరకు ఆమోదముద్ర వేసింది.
పక్క జిల్లాలకు పరుగులు ..
జిల్లాలో క్రికెట్ క్రీడాకారులు సరైన మైదానాలు లేక అవస్థలు పడుతున్నారు. మ్యాట్‌లపై సాధనం చేయడంతో టర్ఫ్ వికెట్‌పై రాణించలేకపోతున్నామని వాపోతున్నారు. రాష్ట్ర స్థాయి మ్యాచ్‌లు జరిగే ముందు టర్ఫ్ వికెట్‌పై సాధనకు విజయనగరం, విశాఖ అకాడమీలకు వెళ్లేవారు. జగ్గుశాస్త్రులపేట మైదానం అందుబాటులోకి వస్తే జిల్లా క్రీడాకారులు మెరుగైన ప్రతిభ చూపే అవకాశం ఉంటుంది.
అభివృద్ధిలో వెనుకబడినా క్రీడారంగంలో విశిష్ట ప్రతిభ చూపుతున్న శ్రీకాకుళంలో క్రికెట్ స్టేడియం నిర్మాణం త్వరితగతిన పూర్తయితే క్రీడాకారులకు మేలు చేకూరుతుంది.











