బుల్లితెరపై సుధీర్ – రష్మీ జోడీకి విపరీతమైన క్రేజ్ ఉంది. ‘జబర్దస్త్’ కామెడీ షోకి కొన్నేళ్లుగా రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తూ వస్తోంది. సుధీర్ తన టీమ్ తో కలిసి స్కిట్స్ చేస్తూ వస్తున్నాడు. ఈ కామెడీ షోలో సుధీర్ – రష్మీ కాస్త చనువుగా ఉండటం వలన, ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం జోరుగా సాగుతూ వచ్చింది. మరో భారీ షోను కూడా ఇద్దరూ కలిసి నడిపిస్తుండటంతో ఈ ప్రచారం మరింత బలాన్ని పుంజుకుంది. తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అని ఈ ఇద్దరూ చెబుతున్నప్పటికీ, ఈ ప్రచారానికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు.

ఒక వైపున రష్మీ యాంకర్ గా తన జోరును కొనసాగిస్తూనే, మరో వైపున సినిమాల్లోను నటిస్తోంది. రొమాంటిక్ పాళ్లు ఎక్కువగా ఉండే చిత్రాల్లోను .. హారర్ కామెడీ సినిమాల్లోను ఆమె సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సుధీర్ కి కూడా హీరోగా ఒక అవకాశం వచ్చింది. ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ టైటిల్ తో వచ్చిన ఈ సినిమా, ఇలా థియేటర్స్ కి వచ్చి అలా వెళ్లిపోయింది. అయితే సుధీర్ మార్క్ కామెడీకి .. డాన్సులకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో సుధీర్ జోడిగా రష్మీ చేసి ఉంటే బాగుండేదనే టాక్ బలంగా వినిపించింది.
సుధీర్ – రష్మీ జంటగా తెరపై కనిపించడానికి ఇక ఎంతో సమయం పట్టదు. తాజా ఇంటర్వ్యూలో నిర్మాత శేఖర్ రాజు మాట్లాడుతూ, ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ సినిమాను నిర్మించినది ఈయనే. ఆయన మాట్లాడుతూ .. ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ సినిమా వలన మేము నష్టపోయామనే వార్తలో నిజం లేదు. ఈ సినిమా సమయంలో నాకూ .. సుధీర్ కి మధ్య మనస్పర్థలు తలెత్తాయనేది పుకారు మాత్రమే. ఈ సినిమాలో సుధీర్ జోడీగా రష్మీని తీసుకుందామనే అనుకున్నాం. కానీ ఆమె డేట్స్ సర్దుబాటు కాలేదు అందువలన చేయలేకపోయింది. సుధీర్ – రష్మీ జోడిగా త్వరలోనే ఒక సినిమా ఉంటుంది” అని ఆయన చెప్పుకొచ్చారు. సుధీర్ – రష్మీ జోడీని తెరపై చూడాలనుకునేవారి ముచ్చట త్వరలోనే తీరనుందన్న మాట.











