జగన్మోహన్ రెడ్డి దూకుడు- కట్టు తప్పిన ప్రతిసారీ బ్రేకు పడుతూనే ఉంది. న్యాయపరమైన ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా అమరావతిలో ఇతర ప్రాంతాల పేదలకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే నిర్ణయం, ఆర్ 5 జోన్ వ్యవహారంపై ప్రభుత్వం వినతికి సుప్రీం అంగీకరించలేదు. ఈ ఉత్తర్వుల విషయంలో ఇదివరకే హైకోర్టు ఇచ్చిన స్టేను వెకేట్ చేయాల్సిందిగా ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ వేయగా.. అందుకు సుప్రీం తిరస్కరించింది.
అమరావతి ప్రాంతంలో రైతులనుంచి సేకరించిన స్థలాల్లో కొంత భాగం పేదలకు కేటాయించేందుకు సీఆర్డీయే చట్టంలో వెసులుబాటు ఉంది. అయితే.. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని అనేక ఇతర ప్రాంతాలకు చెందిన పేదలకు కూడా అమరావతి భూముల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేలా జగన్ సర్కారు సీఆర్డీయే చట్టాన్ని సవరించింది. అమరావతిలో రెసిడెన్షియల్ ప్రాంతానికి సంబంధించి ఆర్5 జోన్ ను ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ 355 తెచ్చింది. దానిపై అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ స్టే ఇచ్చింది. విచారణ పూర్తయ్యే వరకు ఆ ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది.
జగన్ సర్కారు ఈ స్టే ఉత్తర్వులను వెకేట్ చేయాల్సిందిగా కోరుతూ సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేసింది. సోమవారం విచారణలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన 5 పిటిషన్లు సుప్రీంకోర్టు కొట్టివేసింది. అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ, ఆర్ 5 జోన్ విషయంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టులో ప్రాథమిక విచారణ జరిగిన తీరు, మధ్యంతర ఉత్తర్వులపై సీజేఐ బొబ్డే సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. జీ కేసు విచారణ త్వరగా ముగించాలని హైకోర్టుకు కూడా సుప్రీంకోర్టు సూచన చేసింది. దీంతో ఇళ్లస్థలాల విషయంలో జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టు మీద పెట్టుకున్న ఆశలు కూడా నీరుగారిపోయినట్టే. హైకోర్టు తేల్చే వరకు వేచిచూడాల్సిందే.
నిందలు వేసే ధోరణి మారాలి…
జగన్ సర్కారుకు న్యాయపరంగా ఎదురుదెబ్బలు తగలడం ఇవాళ కొత్త కాదు. అయితే కోర్టులో ఎదురుదెబ్బలు తగిలిన ప్రతిసారీ తెలుగుదేశాన్ని నిందించడం వైఎస్సార్సీపీ నాయకులకు అలవాటుగా మారింది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జగన్ సంకల్పిస్తే.. చంద్రబాబునాయుడు కోర్టు కేసుల ద్వారా అడ్డుకుంటున్నారంటూ.. వారు పలుమార్లు ఆరోపించారు. ఇళ్ల స్థలాల విషయంలో చంద్రబాబు మీద ఆరోపించగలరు గానీ.. వాస్తవంలో ప్రభుత్వం తీసుకునే అనేక నిర్ణయాల్లో కోర్టు అక్షింతలు పడుతూనే ఉన్నాయి. పల్లెల్లో ప్రభుత్వాఫీసులకు రంగుల వ్యవహారంలో- జగన్ సర్కారు చాలా పట్టుదలగా సుప్రీం కోర్టు వరకు వెళ్లినప్పటికీ.. చివరికి హైకోర్టు ఉత్తర్వులనే అనుసరించాల్సి వచ్చింది. ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలో కూడా.. సుప్రీం కోర్టుకు వెళ్లినా.. చివరకు జగన్ వెనక్కు తగ్గక తప్పలేదు. ఆ విషయంలో కూడా కమ్మకులం ముసుగులో చంద్రబాబునాయుడుకు ముడిపెట్టడానికి ప్రయత్నించారు. రాజ్యాంగబద్ధ పదవుల విషయంలో కూడా.. ఇలా.. కులాల రంగు పులమడం తటస్థులనుంచి కూడా విమర్శలకు గురైంది. ఇప్పుడు ఇలా అమరావతికి సంబంధించి ఆర్ 5 జోన్ విషయంలో మళ్లీ సుప్రీం కోర్టులో జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది.
జగన్ తొందరపాటు ఫలితమిది
తాజా పిటిషన్ల విషయంలో జగన్మోహనరెడ్డి ప్రదర్శించిన దూకుడు ఫలితమే ఈ ఎదురుదెబ్బ అని న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పిటిషన్లు హైకోర్టులో విచారణ దశలోనే ఉన్నాయి. హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చిందే తప్ప- తుది తీర్పు రాలేదు. అమరావతి పరిధిలో ఇతర ప్రాంతాల వారికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి సంబంధించి వివాదం ఉంది. హైకోర్టు ఆ ఉత్తర్వులపై స్టే ఇచ్చింది అంతే. తుది ఉత్తర్వులు వచ్చేవరకు జగన్ ఆగి ఉండొచ్చు. కానీ.. ఆయన కోణంలోంచి చూసినప్పుడు.. ప్రజలకు ఇళ్ల పట్టాల హామీ ఇచ్చి నెలలు గడచిపోతున్నాయి. గడువుతేదీలు కూడా పలుమార్లు మారాయి. అందుకని హైకోర్టు స్టే ఇవ్వగానే.. జగన్ ఇక ఆగలేక సుప్రీంను ఆశ్రయించారు. ఏకంగా అయిదు పిటిషన్లు వేశారు. సుప్రీం వాటిని కొట్టేసింది. హైకోర్టులోనే తేల్చుకోమని చెప్పింది. తుది తీర్పు వచ్చిన తర్వాత, ఒకవేళ అది ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉంటే గనుక.. అప్పుడు జగన్ సుప్రీంను ఆశ్రయించి ఉంటే బాగుండేదని.. ఇప్పుడు తొందరపడ్డట్టు కనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.