ప్రజాగాయకుడు గద్దర్ అజ్ఞాతవాసం నుంచి జనజీవనం లోకి వచ్చారు. నిజాం కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ. లక్షలాది మంది ఆ సభకు హాజరయ్యారు. అంత పెద్ద సభకు ముఖ్య అతిధి ఓ సన్యాసి. ఆయనను వేదిక మీద చూడగానే సభకు వచ్చిన వారంతా ఆశ్చర్యపోయారు.
(లియోన్యూస్ ప్రత్యేక ప్రతినిధి)
కాషాయ వస్త్రాలు ధరించి ఓ హిందూ సంస్థకు ప్రతినిధిలా ఉన్న ఆయన్ని చూసి అప్పటి పీపుల్స్ వార్ ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. “ ఈయన ఎవరు మన సమావేశానికి హిందూ సన్యాసిని తీసుకువచ్చారేమిటి “.. అని వింతపడ్డారు. అలా వేదిక మీదకు వచ్చిన ఆయనే స్వామి అగ్నివేశ్. మైకు అందుకుని ఆయన మాట్లాడే వరకూ వేదిక క్రింద ఉన్న పీపుల్స్ వార్ కార్యకర్తలందరికి ఓ మానసిక ఆందోళన. స్వామి అగ్నివేశ్ మాట్లాడడం ప్రారంభించాక… ప్రభుత్వం పై తన నిరసనను మాటల తూటలను పేల్చడం ప్రారంభించిన తర్వాత వేదిక పైన ఉన్న మహారచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రితో పాటు వేదిక క్రింద ఉన్న లక్షల మందికి నోట మాట రాలేదు. ఈయన సన్యసం తీసుకున్న మావో అని… కాషాయం తొడుకున్న కారల్ మార్క్స్ అని అనుకున్నారు. బహుశా అప్పటి వరకు హరియాణా ప్రజలకు తప్ప అగ్నివేశ్ అంటే తెలుగు ప్రజలకు తెలీదు. ఆ సమావేశంతో అగ్నివేశ్ తెలుగు వారికి… ముఖ్యంగా వామపక్ష వాదులకు అత్యంత చేరువయ్యారు.
పుట్టింది శ్రీకాకుళంలో…
స్వామి అగ్నివేశ్ అక్షరాల తెలుగు వారు. శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. ఆంధ్ర – ఒరిస్సా బోర్డర్ లో గంజాం జిల్లాలోని సనాతన బ్రహ్మణ కుటుంబంలో జన్మించారు. అయిదేళ్ల వయస్సులో తండ్రి చనిపోవడంతో ఛత్తీస్ ఘడ్ లోని తాతగారింటికి వెళ్లిపోయారు. స్వామి అగ్నివేశ్ అసలు పేరు వేప శ్యామ్ రావు. ఛత్తీస్ ఘడ్ లోనే చదువు పూర్తి చేసిన ఆయన హరియాణా వెళ్లిపోయారు. చదువుకునే రోజులలోనే ఆర్యసమాజ్ వైపు ఆకర్షితులైన స్వామి అగ్నివేశ్ జీవితాన్ని మార్చింది లాయర్ ఇంద్రవేశ్. లా పూర్తి చేసిన అగ్నివేశ్ సీనియర్ లాయర్ అయిన ఇంద్రవేశ్ దగ్గర జూనియర్ గా పనిచేసారు. ఇంద్రవేశ్ మానవ హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ప్రభావంతోను, ఆర్య సమాజ్ సిద్దాంతాలతోను ఆకర్షితులైన వేప శ్యామ్ రావు అగ్నివేశ్ గా మారారు. తన గురువు ఇంధ్రవేశ్ శాంతి స్వభావుడని, అందుకే ఇంద్రవేశ్ గా అయ్యారని, తాను మాత్రం హక్కుల కోసం నిప్పులు కురిపించే మనిషినని, అందుకే తన పేరును గరువు పేరుతో కలిపి అగ్నివేశ్ గా మార్చుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆనాటి నుంచి కాషాయం కట్టుకున్న హక్కుల కార్యకర్తగా చివరి వరకూ పోరాడారు.
ఎన్టీఆర్ కు స్ఫూర్తి
మహానటుడు ఎన్.టీ. రామారావు తన రాజకీయ జీవితంలో కొన్నాళ్లు సన్యాసం తీసుకున్నారు. దానికి కారణం స్వామి అగ్నివేశే అంటారు. ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్.టీ. రామారావును కలుసుకున్న స్వామి అగ్నివేశ్ ఆయనను కూడా సన్యాసం తీసుకోమని సూచించారు. “సన్యాసం తీసుకుంటే స్వార్ధం ఉండదు. ప్రజల కోసమే నిరంతరం ఆలోచిస్తాం ” అని అగ్నివేశ్ ముఖ్యమంత్రి ఎన్.టీ.ఆర్ తో అన్నారట. దాని ప్రభావమో, మరే కారణమో కాని ఎన్టీఆర్ సన్యాసం తీసుకున్నారు.
తెలుగులో సంతకం
స్వామి అగ్నివేశ్ కు తెలుగును అర్దం చేసుకోవడం, చిన్న చిన్న పదాలతో మాట్లాడడం వచ్చు. రాయడం మాత్రం రాదు. హైదరాబాద్ వచ్చినప్పుడు స్వామి అగ్నివేశ్ ను విలేకరులు పలు ప్రశ్నలతో విసిగించారు. ఆ సమయంలో శాంతంగా సమాధానాలు చెప్పిన అగ్నివేశ్ “నన్ను ఇంత ఇబ్బంది పెట్టారు కదా. నాకో సాయం చేసి పడతారా.. తెలుగులో నా పేరు రాయడం నేర్పుతారా ” అని అడిగారు. ఆ సమయంలో విలేకరులు స్వామి అగ్నివేశ్ కు ఆయన పేరు తెలుగులో ఎలా రాయాలో నేర్పారు. పది నిమిషాల సమయంలోపు నేర్చుకుని తెలుగులో సంతకం పెట్టారు. స్వామి అగ్నివేశ్ మృతికి లియో న్యూస్ సంతాపం తెలియజేస్తూ…. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటోంది….











