తెలంగాణ కాంగ్రెస్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి ఏదీ కలిసి రావడం లేదు. ఎన్నికల్లో దారుణ ఓటములు.. నేతల జంపింగ్ లతో కునారిల్లుతున్న పార్టీని సంక్షోభం నుండి ఎలా గట్టెక్కించాలో కూడా అర్థం కావడం లేదంటూ ఆ పార్టీ అదిష్టానం తలలు పట్టుకుంటోంది. మొదట టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌ను కోలుకోలేకుండా చేస్తే ఇప్పుడు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో చావుదెబ్బ తీస్తోంది. ఎప్పుడు ఏ నేత ఆ పార్టీని వీడుతారో తెలియక సతమతం అవుతోంది. ఏనేత అయినా సరే.. పార్టీని వీడుతున్నట్టు తెలిస్తే ఆయా నేతల ఇళ్లకు వెళ్ళి మంతనాలు జరుపుతున్నారు. ఒకసారి డిసైడైన తర్వాత.. రాష్ట్ర పార్టీ నాయకులు బుజ్జగింపులకు ఎవ్వరూ లొంగడం లేదు. వారి నిర్ణయాల్లో మార్పు రావడం లేదు. దీంతో పార్టీని గట్టెక్కించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం.
ఆందోళన కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయం..
కాంగ్రెస్ పార్టీని బతికించాలనుకుంటే ప్రజల్లోకి వెళ్ళడం ఒక్కటే మార్గం అంటున్నారు రాజకీయ నిపుణులు. రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై పోరు చేయాలని నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం రాష్ట్రంలో, దేశంలో రైతులు రోడ్లపైకి వస్తున్నారు . ఢిల్లీ వేదికగా రైతులు గత నలభై రోజులకు పైబడి ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వారికి సంఘీభావంగా ఆందోళన చేయాలని నిర్ణయించింది. వ్యవసాయ చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేయాలని ప్రజలతో కలిసి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నట్టు సమాచారం.
ఢిల్లీలో పార్టీ కేంద్ర నాయకత్వమే రైతులకు అనుకూలంగా ఇప్పటిదాకా పటిష్టమైన పోరు ప్రణాళికతో అడుగులు వేయలేకపోతుండగా.. ఇక రాష్ట్రంలో కేసీఆర్ యూటర్న్ మీద ఇక్కడి నాయకులు ఎలా పోరాటాలు నడుపుతారో చూడాలి.
ఆందోళన కార్యక్రమాలపై తలో మాట..
కాంగ్రెస్ పార్టీలో నేతలు ఒకే మాటపై ఉండటం చాలా అరుదుగా కనిపిస్తుందంటారు రాజకీయ విశ్లేషకులు. ఈ మధ్య జరిగిన రైతు దీక్ష లో ఈ విషయం మరోసారి బయట పడింది. రైతు దీక్ష తో ఆందోళన విరమించ కుండా ఢిల్లీలో రైతులతో కదం తొక్కిద్దామని.. అందుకు ఓ రైలును బుక్ చేస్తే .. అయ్యే ఖర్చును మల్కాజ్ గిరి కాంగ్రెస్ నేతలు భరిస్తారని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
అయితే ఆ వెంటనే మాట్లాడిన సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్తే అనవసర వివాదాలు రేగుతాయని .. గ్రామగ్రామలకు వెళ్ళి ప్రజలకు వాస్తవాలు వివరిద్దామని రేవంత్ ప్రతిపాదనను తోసి పుచ్చారు. ఇద్దరు కీలక నేతల మధ్య ఇలా బహిరంగంగానే భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంపై పార్టీలో తీవ్ర చర్చ సాగుతోంది. ఏదైనా ఉంటే పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవాలి కాని ఇలా బజారున పడి ఒకరి ప్రతిపాదనను మరొకరు వ్యతిరేకించడం సమజసం కాదన్న వాదన వినిపిస్తోంది.
కొన్ని రోజుల క్రింత ఎల్బీనగర్ లో జరిగిన కార్యక్రమంలో ప్రోటోకాల్ విషయంలో రేవంత్ రెడ్డికి అవమానం జరిగినా .. ఆయన ఆందోళన చేసినా పార్టీ నుండి ఎలాంటి సపోర్ట్ రాలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ కి పూర్వవైభవం తీసుకు రావాలని భావిస్తున్న నేతలు కార్యకర్తలకు మనస్తాపం కలుగుతోంది. ఇలాంటి విభేదాలు పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెడుతాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కొన్ని రోజుల పాటు వివాదాలు పక్కన బెట్టి పార్టీ ఎదుగుదలకు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందంటున్నారు.