నిజాం హయాంలో ఆయన ఇచ్చిన భూములు అవి.. విక్రయించేందుకు హక్కుల్లేకుండా..కేవలం అనుభవించేందుకు ఇచ్చిన భూములు.. అయితే కాలక్రమంలో ఆ భూములపై పెద్దల కన్ను పడింది. వేల కోట్ల విలువైన భూములు కావడంతో.. హత్యలు..కబ్జాలు చాలానే జరిగాయి. బయటకు తెలిసినవి కొన్నే.. తెలియనివి ఎన్నో ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ భూముల వ్యవహారంలోనే..బోయినపల్లి కిడ్నాప్ జరిగింది. ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియపైనా కేసు నమోదైంది. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఇక ఈ భూముల విషయానికి వస్తే.. ఇప్పుడు అఖిల ప్రియ పేరు బయటకు వచ్చింది. అయితే గతంలో ఈ ప్రాంతంలోని భూముల కోసం ఎన్నో దారుణాలు జరిగాయిని తెలుస్తోంది. మొత్తం మీద గతంలో బడాబాబులు.. మాఫియాకు చెందినవారి సాయంలో 12హత్యలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. కోర్టుల పరిధిలో ఉండగానే.. బయట జరిగే దందా కొనసాగుతూనే ఉంది.
ఇక చరిత్రలోకి వెళితే..
నిజాం హయాంలో రాష్ట్ర రైల్వే లైన్ల నిర్మాణంలో భాగంగా హైదరాబాద్ శివారు (అప్పట్లో) ఇబ్రహీంపట్నం, పటాన్‌చెరు ప్రాంతాల్లో ఖుర్షీద్ జాహీ పాయ్‌గా, చావూస్, నవాబ్ వంశీయులకు చెందిన భూములను సేకరించింది. అందుకు బదులుగా అప్పట్లో నగరానికి దూరంగా ఉండే హఫీజ్‌పేట, హైదర్‌నగర్ తదితర ప్రాంతాల్లో భూములను కేటాయిస్తూ అప్పటి ఏడవ నిజాం నిర్ణయం తీసుకున్నారు. భూ సంస్కరణలు, జాగీర్దార్ల వ్యవస్థ రద్దు, ఇలా కాల క్రమంలో ఆ భూములు ప్రభుత్వానికి దఖలుపడ్డాయి. న్యాయపోరాటం కూడా జరిగింది. ఓవైపు ఈ భూములు పొందినవారి వారసులు, పాయ్‌గా వారసులు.. గోల్కొండలోని కొందరు న్యాయపోరాటం మొదలు పెట్టారు. 1958లో ఈ కేసు మొదలు కాగా పదేళ్లకు మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయి. అయితే, పిటిషన్ దారులు సకాలంలో స్పందించకపోవడంతో అవి కూడా అమలు కాలేదు. అప్పట్లో కొండలు, గుట్టలుగా ఉండే ఈ భూమిపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదని చెబుతుంటారు. ఈ క్రమంలో ఆ భూములు ప్రభుత్వ పరమయ్యాయి.
తరువాతి కాలంలో..
తరువాతి కాలంలో జాతీయ రహదారులు ఏర్పాటు కావడం, కాలనీలు ఏర్పాటు కావడం, ఇళ్ల నిర్మాణాలు, అక్రమంగా క్రయవిక్రయాలు మొదలయ్యాయి. అప్పట్లో గజం రూ.15చొప్పున విక్రయాలు జరిగాయని అప్పటి పరిస్థితిపై అవగాహన ఉన్నవారు చెబుతుంటారు. ఈ భూముల వ్యవహారంలోనే సాబేర్ అనే వ్యాపారి హత్యకు గురికావడం, ఆయన తండ్రి ప్రత్యర్థులపై బేగంబజార్‌లో బాంబులతో దాడి చేయించడం 1989-90మధ్య కాలంలో జరిగింది. ఇక శిల్పారామం ఏర్పాటు, కొండాపూర్‌లో నిర్మాణాలు కంపెనీలు రావడం, హైటెక్ సిటీ, హైదరాబాద్ నగర విస్తరణల కారణంగా భూములకు డిమాండ్ ఏర్పడింది. పలు ఘటనలూ చోటుచేసుకున్నాయి. తరువాత హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారి హరిబాబు హత్య, మాదాపూర్‌లో నడిరోడ్డుపై అబీబ్ హత్యలు జరిగాయి. ఈ హత్యలకు బ్యాక్ గ్రౌండ్‌లో హఫీజ్‌పేట్, హైదర్‌నగర్ భూముల వివాదాలే కారణాలని చెబుతుంటారు. ఇక తాజాగా వెలుగులోకి వచ్చిన సర్వే నెంబరు 80 భూమి వివాదంలో 2005 ప్రాంతంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన స్థిరాస్థి వ్యాపారి శేఖర్‌ని అదే ప్రాంతానికి చెందిన ప్రభాకర్ హత్య చేయించినట్టు తేలింది. తరువాత అదే ప్రభాకర్ నాయకుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే దారుణ హత్యకు గురైన ఘటన నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. తరువాత కూడా కొన్ని ఘటనలు జరిగాయని చెబుతున్నా..విషయం బయటకు రాలేదని అంటున్నారు.
పెద్దల కన్ను..
ఇక తాజాగా అఖిలప్రియ పేరు బయటకు రావడంతో అసలు ఈ భూముల వ్యవహారం ఏంటనే అంశం తెరపైకి వచ్చింది. మొన్నటికి మొన్న.. అఖిలప్రియ తమ్ముడు జగత్ విఖ్యాత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వంలోని ఓ మంత్రి, ఎంపీ పాత్ర కూడా ఇందులో ఉందని ఆరోపణ చేయడం సంచలనం రేపింది. మరోవైపు తెలంగాణ ఉద్యమకారులు సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, మాజీ మావోయిస్టు లీడర్, గాదె ఇన్నారెడ్డి లాంటివారు నేరుగా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. మెదక్, మహబూబ్‌నగర్ , రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు చెందిన 30 మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు.. ఈ భూములపై కన్నేశారని ఆరోపించారు. మొత్తం మీద హఫీజ్ పేట భూముల వ్యవహారం ఇప్పట్లో తేలే పరిస్థితి కనిపించడం లేదు.