ఏపీ సీఎం జగన్‌ను దుర్భాషలాడారంటూ పోలీసులు అరెస్ట్ చేసిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు రెండు రోజులు గడవకుండానే బెయిల్ మంజూరైపోయింది. ఈ మేరకు శనివారం సాయంత్రం ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో పట్టాభిని బుధవారం రాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు గురువారం మధ్యాహ్నం విజయవాడ కోర్టులో హాజరుపరచిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలతో పట్టాభిని తొలుత మచిలీపట్నం జైలుకు తరలించిన పోలీసులు.. ఆ తర్వాత రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పట్టాభి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. హైకోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు.
అరెస్ట్ ఎందుకంటే..?
ఏపీలో డ్రగ్స్ దందా సాగుతోందని, దానిపై విచారణ చేపట్టి డ్రగ్స్‌ను కూకటి వేళ్లతో పెకలించి వేయాలని కోరిన టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు డిమాండ్ చేస్తే.. ఆయన డిమాండ్ మేరకు చర్యలు చేపట్టాల్సిన పోలీసులు వివరాలు సమర్పించాలంటూ రివర్స్‌లో ఆనందబాబుకే నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి హోదాలో ఉన్న కొమ్మారెడ్డి.. మంగళవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వేదికగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి జగన్ సర్కారు తీరును ఎండగట్టారు. ఈ క్రమంలో పట్టాభిరామ్ కొంతమేర ఆవేశపూరితంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు విన్నంతనే.. వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయాలపై విరుచుకుపడ్డాయి. ఆ సమయంలో కార్యాలయంలోనే పట్టాభి కూడా ఉన్నారు. అయితే ఆయన పై అంతస్తులో ఉండగా.. వైసీపీ శ్రేణులు కింది అంతస్తులోనే బీభత్సం సృష్టించాయి. ఆ ఘటనకు కాసేపటి ముందుగానే విజయవాడలోని పట్టాభి నివాసంపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయి. ఈ ఘటనలు ఏపీని కుదిపేశాయి. పట్టాభి వ్యాఖ్యలతోనే వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయన్న వాదనతో పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అలా అరెస్ట్.. ఇలా బెయిల్
వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని ఏపీ పోలీసులు అరెస్ట్‌ల పర్వాన్ని సాగిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడితో మొదలుపెట్టి.. తాజాగా పట్టాభి దాకా చాలా మంది టీడీపీ కీలక నేతలను వైసీపీ సర్కారు అరెస్ట్ చేయించింది. అయితే అరెస్టైన రోజుల వ్యవధిలోనే టీడీపీ నేతలకు బెయిళ్లు మంజూరయ్యాయి. తాజాగా పట్టాభి వ్యవహారంలోనూ ఇదే రిపీటైంది. విజయవాడ కోర్టులో తనను హాజరుపరిచిన సమయంలోనే పట్టాభి తన వాదనను వినిపించారు. పోలీసులతో తనకు ప్రాణ హానీ ఉందని, అసలు తానేమీ తప్పు చేయలేదని కొమ్మారెడ్గి న్యాయమూర్తికి తెలిపారు. అయితే కొమ్మారెడ్డి వ్యాఖ్యల కారణంగానే రచ్చ జరిగిందంటూ పోలీసులు చెప్పడంతో కొమ్మారెడ్డిని రిమాండ్‌కు తరలిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. పట్టాభిని రిమాండ్‌కు తరలించిన మరుక్షణమే టీడీపీ అధిష్ఠానం ఆయన బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి బెంచ్ శనివారం నాడు కొమ్మారెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది.