వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల విచారణలు ఇకపై వాయిదాల మీద వాయిదాలు పడే అవకాశాలే కనిపించడం లేదు. ఇప్పటికే అటు సీబీఐ, ఇటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన కేసులకు సంబంధించి కోర్టులో చార్జిషీట్లు కూడా దాఖలైపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో ముందుగా ఈడీ కేసుల విచారణకు రంగం సిద్ధంగా కాగా.. ఈడీ కేసుల కంటే ముందుగా సీబీఐ కేసుల విచారణ జరగాలంటూ ఇటు జగన్, అటు ఈ కేసులన్నింటిలో రెండో ముద్దాయిగా ఉన్న వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ కేసుల విచారణ వాయిదా పడేలా వ్యూహం అమలు చేస్తున్నారు. అయితే మొన్నటిదాకా ఈ ఇద్దరి బెయిళ్లను రద్దు చేయాలంటూ వారి సొంత పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేసి వైసీపీలో హై టెన్షన్ రేపితే.. తాజాగా రఘురామనే స్వయంగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఈ కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేసేలా ఓ సంచలన పిటిషన్ దాఖలు చేశారు.
సుప్రీంలో పిటిషన్‌తో ఇబ్బందే
సాధారణంగా ఏ కేసులో అయినా తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తే.. పై కోర్టుకు వెళతారు. అక్కడ కూడా వ్యతిరేకంగా తీర్పు వస్తే.. దానికంటే పై కోర్టుకు వెళతారు. మరి దేశ సర్వోన్నత న్యాయస్థానంలో తుది తీర్పు వస్తే.. ఇంకెక్కడికీ వెళ్లడానికి లేదు కదా. ఇప్పుడు రఘురామరాజు కూడా అదే చేశారు. సీబీఐ కోర్టులో తీర్పు వస్తే.. జగన్ అండ్ కో హైకోర్టులో ఆ తీర్పును సవాల్ చేస్తున్నారు. హైకోర్టులో వచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు వారికి ఆ అవకాశం లేకుండా రఘురామరాజు నేరుగా సుప్రీంకోర్టునే ఆశ్రయించారు. జగన్ అక్రమాస్తుల కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ శుక్రవారం నాడే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లుగా రఘురామ శనివారం నాటి మీడియా సమావేశంలో పేర్కొన్నారు. చార్జిషీట్లు నమోదైన కేసుల్లో సంవత్సరం లోగా విచారణ ముగించాలని సుప్రీంకోర్టు గతంలోనే చెప్పిందన్నకీలక విషయాన్ని కూడా రఘురామ తన పిటిషన్‌లో ప్రస్తావించడం గమనార్హం. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తే.. కింది కోర్టులో ఆ ఆదేశాల మేరకు తప్పనిసరిగా చర్యలు చేపట్టాల్సిందే కదా. అందుకే.. ఇకపై జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలు ఇకపై వాయిదా పడే అవకాశమే లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
రఘురామ వ్యంగ్యం చూశారా?
జగన్ అక్రమాస్తుల కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని వెల్లడించిన సందర్భంగా రఘురామ తనదైన శైలి వ్యంగ్యాస్త్రాలను జగన్‌పైకి సంధించారు. ఈ దిశగా రఘురామరాజు ఏమంటారంటే.. ఈ కేసుల విచారణ త్వరగా జరిగితే జగన్ కూడా కడిగిన ముత్యంలా బయటపడతాడు కదా అని రఘురామ వ్యాఖ్యానించారు. జగన్ కేసుల విచారణ త్వరగా పూర్తయితే ఇక ఆయనను ఎవరూ వేలెత్తి చూపేందుకు వీలుండదని రఘురామ అన్నారు. కిందికోర్టుల్లో కొట్టేసినట్టు తన పిటిషన్ ను సుప్రీంకోర్టులో కొట్టివేయరని భావిస్తున్నట్టు తెలిపారు. గతంలో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్లతో తాజా పిటిషన్ కు సంబంధం లేదని స్పష్టం చేశారు. అప్పట్లో కూడా తాను జగన్ బెయిల్ రద్దయి విచారణ వేగంగా జరిగితే ఆయన నీలాపనిందలు లేకుండా బయటపడతాడన్న ఉద్దేశంతోనే బెయిల్ రద్దు పిటిషన్ వేశానని రఘురామ సెటైర్లు సంధించారు.