నిజమే.. జగన్ జమానాలో ఫలానా నేతను అరెస్ట్ చేయాలన్న ఆదేశాలు రాగానే.. పోలీసులు రంగంలోకి దిగిపోతారు. ఓ పద్ధతి లేదు, పాడూ లేదు. అరెస్ట్ చేసేయడమే. ఆయా నేతలు, వ్యక్తుల అరెస్ట్‌కు ముందు చట్టానికి అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలను అసలు పట్టించుకోరు. పోలీస్ వ్యవస్థలో అమలు అవుతున్న ప్రోసీజర్‌ను అసలే పట్టించుకోరు. ఏ సెక్షన్ల కింద కేసులు పెడుతున్నాం?.. అరెస్ట్ ఎలా చేయాలి? అన్న విషయాలను అసలే పట్టించుకోరు. అంతిమంగా నిందితుల మాదిరిగా కోర్టు ముందు చేతులు కట్టుకుని నిలబడతారు. కోర్టుల నుంచి చీవాట్లూ తింటారు. అలా చీవాట్లు తిన్న పోలీసులకు జగన్ జమానాలో మరింత మేర ప్రాధాన్యం కలిగిన పోస్టులు దక్కిపోతాయి. కొందరు పోలీసులు అయితే.. ఈ పోస్టుల కోసమే జగన్ సర్కారు చెప్పినట్టల్లా కళ్లు మూసుకుని చేసుకుపోతారు. ఇదేదో జగన్ సర్కారు అంటే గిట్టని వారు అంటున్న మాటలు కాదు. స్వయంగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టులో శనివారం జరిగిన విచారణను పరిశీలించిన వారు చెప్పే మాటలివి. వీటిలో చాలా కీలమైన వ్యాఖ్యలను స్వయంగా హైకోర్టు న్యాయమూర్తే చేశారు.
హైకోర్టు ఏమన్నదంటే..?
పట్టాభిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేస్తే.. ఆయనకు బెయిల్ కోసం టీడీపీ అధిష్ఠానం ఆఘమేగాల మీద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై శనివారం నాడు హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా పట్టాభి తరఫు న్యాయవాది, ప్రభుత్వ తరఫు న్యాయవాది తమదైన శైలి వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలను విన్న న్యాయమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పట్టాభి అరెస్ట్ సందర్భంగా పోలీసులు ప్రోసీజర్‌నే పాటించలేదని ఆక్షేపించారు. అంతేకాకుండా ఈ తరహా వ్యవహార సరళికి కారణమేమిటో తెలపాలంటూ జగన్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పట్టాభి అరెస్ట్ సందర్భంగా పోలీసులు 41ఏ నోటీసులను ఎందుకు అమలు చేయలేదని కూడా కోర్టు ప్రశ్నించింది. అంతేకాకుండా పట్టాభి రిమాండ్ కు థర్డ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఎలా ఆదేశాలు జారీ చేస్తుందని కూడా హైకోర్టు ప్రశ్నించింది. 41 ఏ నోటీసులు జారీ చేస్తే.. నిందితుడి నుంచి వివరణ తీసుకుని వదిలేయాలి గానీ.. రిమాండ్ కు ఎలా తరలిస్తారని కూడా నిలదీసింది. సీఎంను దూషించారన్న ఆరోపణలతో నిందితుడికి 41 ఏ సెక్షన్ కింద నోటీసులు జారీ చేసిన తర్వాత వివరణ ఇవ్వడానికి నిందితుడికి సమయం ఇవ్వాల్సి ఉన్నా.. ఆ నిబంధనను పోలీసులు పాటించలేదని కూడా హైకోర్టు ఆక్షేపించింది. మొత్తంగా పట్టాభి అరెస్ట్ సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని, ప్రోసీజర్‌ను అసలే పాటించలేదని కూడా హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ తేల్చి పారేసింది.
పోలీసులు ఏం చేశారంటే..?
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను బుధవారం రాత్రి పోలీసులు తమదైన శైలిలో ఇంటి తలుపులు బద్ధలు కొట్టి మరీ అరెస్ట్ చేశారు కదా. పట్టాభిని అరెస్ట్ చేసిన పోలీసులు రాత్రంతా తమ ఆధీనంలోనే ఉంచుకుని మరునాడు మధ్యాహ్నం విజయవాడలోని కోర్టులో హాజరుపరచిన సంగతి తెలిసిందే. థర్డ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో పట్టాభిని హాజరు పరచిన పోలీసులు.. పట్టాభి రిమాండ్‌కు ఆదేశాలు సంపాదించారు. ఆ వెంటనే పట్టాభిని కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని జైలుకు తరలించారు. ఆ తర్వాత ఏమనుకున్నారో, ఏమో తెలియదు గానీ.. మచిలీపట్నానికి చాలా దూరంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా పట్టాభిని ఈడ్చుకుంటూ, పరుగులు పెట్టిస్తూ తీసుకెళ్లిన దృశ్యాలు మీడియాలో వైరల్‌గా మారాయి. అదేదో తప్పించుకుని పారిపోతున్న కరడుగట్టిన నేరస్తుడికి మల్లే పట్టాభిని ఈడ్చుకుంటూ వెళ్లడం ఏపీ పోలీసులకు మాత్రమే సాధ్యమైందన్న సెటైర్లూ పడిపోయాయి.