వైసీపీ హయాంలో జరిగిన AP లిక్కర్ రవాణా స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ ప్రధాన లబ్ధిదారులని ED తేల్చింది. రాజకీయ పలుకుబడితో కాంట్రాక్టులను గుప్పిట్లో పెట్టుకుని భారీగా అక్రమార్జనకు పాల్పడ్డారని రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసింది. ఈ కేసులో భాగంగానే నాగేశ్వరరావును హైదరాబాద్‌లో అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.
జిల్లా స్థాయిలో వికేంద్రీకృత విధానంలో ఉన్న మద్యం రవాణా కాంట్రాక్టును కేంద్రీకృతం చేసి APSBCL ద్వారా సిగ్మా సంస్థకు కట్టబెట్టారు. అప్పటివరకు కిలోమీటరుకు రూ.19.68 రవాణా ఛార్జీ ఉంటే, దాన్ని ఏకంగా రూ.32.53కు పెంచేసి ప్రతి మద్యం కేసుపై కిలోమీటరుకు రూ.13 చొప్పున అదనంగా దోచుకున్నారు. ఆ తర్వాత సిగ్మా నుంచి సుదర్శన్ కన్‌స్ట్రక్షన్స్ అనే ముసుగు సంస్థ పేరుతో సబ్‌కాంట్రాక్ట్ తీసుకుని, వచ్చిన లాభాల్లో 85 శాతం కారుమూరి కుటుంబానికే వెళ్లేలా ఒప్పందం చేసుకున్నారు.
ఇలా కొల్లగొట్టిన సొత్తులో దాదాపు రూ.18.09 కోట్లు మనీ లాండరింగ్ జరిగినట్లు ED గుర్తించింది. ఈ అక్రమ సొత్తుతో ఖరీదైన వాహనాలు, వాచీలు కొనడం, పుట్టినరోజు వేడుకలు, అప్పులు తీర్చడం, రాజకీయ ఫండింగ్ కోసం విచ్చలవిడిగా ఖర్చు చేశారు. ఈ కుంభకోణంలో ఎవరి ఖాతాల్లోకి ఎంతెంత వెళ్లాయనే వివరాలను సైతం బయటపెట్టింది. ED ప్రాథమిక అంచనా ప్రకారం వల్లూరు కీర్తి ఖాతాలోకి అత్యధికంగా రూ.6.15 కోట్లు, కారుమూరి సునీల్‌కు రూ.3.73 కోట్లు, వల్లూరు ప్రతాప్ రెడ్డికి రూ.0.93 కోట్లు, కారుమూరి లక్ష్మీ కిరణ్‌కు రూ.0.80 కోట్లు, అచ్చప్ప రామ్మూర్తికి రూ.0.24 కోట్లు, కారుమూరి దీపికకు రూ.0.09 కోట్లు బదిలీ అయ్యాయి.
విచారణకు హాజరుకావాలని ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు దాదాపు 10 సార్లు నోటీసులు ఇచ్చినా కారుమూరి లెక్కచేయలేదు. ఉద్దేశపూర్వకంగానే విచారణకు డుమ్మా కొడుతూ వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నం చేశారని, మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు ఉండటంతోనే ఆయన్ని అరెస్టు చేశామని అధికారులు వెల్లడించారు. ఈ కేసులో APSBCL అప్పటి MD వాసుదేవరెడ్డి, రాజ్ కెసిరెడ్డిల ప్రమేయంపైనా ఈడీ ఇప్పటికే ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.











