అమెరికాకు కొత్త అధ్యక్షుడు వచ్చిన ప్రతిసారి మన దేశంలో జరిగే మొదటి చర్చ… భారత్‌కు ఎలాంటి ప్రయోజనాలు దక్కుతాయనే? జో బైడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవడంతో వాణిజ్యం, వీసాల వ్యవహారంలో మన దేశంతో ఎలా వ్యవహరిస్తారనే ప్రశ్నలు తలెత్తడం సహజం. అమెరికాతో ధైపాక్షిక సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి, బైడెన్ ప్రభుత్వం భారత్‌తో ఎలా వ్యవహరించబోతోంది అనేది కూడా ఆసక్తికరమే. అయితే నాలుగేళ్ల కిందట మన ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించినప్పుడు జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అంటే ఇద్దరికీ పరిచయం ఉందన్నమాట.
వీసా కల నెరవేరుతుందా?
అమెరికా అధ్యక్షుడు మారగానే భారత్‌కు హెచ్ వన్ బీ వీసాలు పెంచుతారా అని అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందరో భారతీయ విద్యార్థులకు, ఉద్యోగార్థులకు అమెరికాలో చదువుకోవడం, ఉద్యోగం చేయడం ఓ కల. ఆ కల నెరవేరాలంటే ఆదేశం భారతీయులకు ఉదారంగా వీసాలు మంజూరు చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికిప్పుడు భారత్‌కు హెచ్ వన్ బీ వీసాలు పెంచుతారనుకోవడం అత్యాసే అవుతుంది.
రిలేషన్స్ ఎలా ఉంటాయి?
మన దేశంతో అమెరికా సంబంధాలు వ్యవస్థీకృతం అయ్యాయి. వీటిని అంత తొందరగా బలహీనపర్చటం కూడా అంత సులభం కాదు. చాలా అంశాల్లో భారత్ అండలేకుండా అమెరికా ప్రపంచ పెద్దన్న పాత్ర పోషించడం వీలు కాదనే చెప్పాలి. బైడెన్ కూడా ఎన్నికల ప్రచారంలో భారత అమెరికన్లకు బాగా దగ్గరయ్యారు. తప్పని సరిగా భారత్‌తో అమెరికా స్నేహ సంబంధాలకు పెద్దపీట వేయాల్సిందే…
కమలానికి కమలా సహకరిస్తుందా?
కమలా హారిస్ అమెరికా ఎన్నికల్లో విజయం సాధించి ఉపాధ్యక్ష పదవి చేపట్టబోతున్న భారత సంతతి మహిళ. వయసు రీత్యా జో బైడెన్ ఈ ఒక్కసారికి మాత్రమేనని ఎన్నికల్లో ప్రకటించారు. అంటే రాబోయే నాలుగు సంవత్సరాల తరవాత కమలా హారిస్ అమెరికా అధ్యక్షురాలు అయ్యే అవకాశం కూడా భారత, అమెరికా సంబంధాలపై ప్రభావం చూపుతుంది.
పెద్ద మార్పులు ఉండకపోవచ్చు
రక్షణ, వ్యూహాత్మక వ్యవహారాల్లో భారత్, అమెరికాల మధ్య పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. ఇప్పటి వరకూ భారత్‌కు అమెరికా అందించిన రక్షణ సాయం కొనసాగుతుంది. అయితే ఇండో పసిఫిక్ వ్యూహంపై బైడెన్ వర్గం ఇంకా తమ అభిప్రాయాన్ని వెల్లడించాల్సి ఉంది. ఇప్పుడు చైనాతో అమెరికా ఎలా వ్యవహరిస్తుందనే దానిపై కూడా భారత్‌తో సంబంధాలు ఆధారపడి ఉంటాయి. చైనాతో ట్రంప్ తరచూ వివాదాలు పెట్టుకునే వారు. వాణిజ్య యుద్ధం కొనసాగించారు. అయితే బైడెన్ విషయంలో అలా జరగకపోవచ్చు. చైనా ఎప్పటికైనా అమెరికాకు అన్ని విధాలా అంటే వాణిజ్యంలో, రక్షణ వ్యూహాల్లో గట్టి పోటీ ఇస్తోంది. చైనాను నిలువరించాలంటే అమెరికాకు భారత్ సాయం తప్పని సరి. మానవ హక్కుల విషయంలో అమెరికా గట్టిగా వ్యవహరిస్తోంది. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దును కమలా హారిస్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంలో మాత్రం ప్రధాని మోడీ కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావచ్చని అంచనా.











