భారత మూలాలున్నకమల హారిస్ డెమొక్రాటిక్ పార్టీ తరుపున వైస్ ప్రెసిడెంట్ గా చేయనున్నారు. ఈ మేరకు ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న జో బిడెన్ ప్రకటించారు. వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న ఆఫ్రికన్ అమెరికన్ మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. అమెరికా రాజ్యాంగం 100 వ వార్షికోత్సవం సందర్భంగా ఆమోదం పొందిన 19 వ సవరణలో మహిళలకు ఓటు హక్కును కల్పించిన సంగతి తెలిసిందే. డెమోక్రాటిక్ పార్టీ తరుపున ఎన్నికలలో వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న కమల హారిస్ ప్రధాన పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపికైన మూడవ మహిళగా నిలిచారు. 1984 లో జెరాల్డిన్ ఫెరారో, 2008 లో సారా పాలిన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేశారు. అమెరికా ఎన్నికలకు 90 రోజుల కన్నా తక్కువ సమయం ఉంది. ఈ సందర్భంలో జో బిడెన్ తీసుకున్న ఈ నిర్ణయం తమ పార్టీ ఓటర్లను ఉత్తేజపరిచనుంది. రిపబ్లిక్ పార్టీకి చెందిన డోనాల్డ్ ట్రంప్ వర్గం డెమోక్రాటిక్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయంపై సునిశితంగా పరిశీలిస్తోంది. డెమోక్రాటిక్ పార్టీ ప్రచారాన్ని ఆమె ఏ మేరకు ప్రభావితం చేయనుందోనని ఆసక్తి నెలకొంది.
భారత్‌కు చెందిన తల్లి, జమైకాకు చెందిన తండ్రికి కమలా హారిస్ 1964 అక్టోబర్ 20న కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లో జన్మించింది. ఆమె కాలిఫోర్నియాలోని బర్కిలీతో బాటు కెనడాలోని మాంట్రియల్‌లో పెరిగారు. డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ ప్రాధమిక చర్చల సందర్భంగా తాను బాల్యం నుంచే పౌర హక్కుల కోసం పోరాడినట్లు తెలిపారు. ఆఫ్రికన్ అమెరికన్ పిల్లలు దూరం వెళ్లి చదువుకునే పద్దతిని తాను చిన్ననాడే వ్యతిరేకించినట్లు ఆమె వెల్లడించారు. హారిస్ 2003 లో శాన్ ఫ్రాన్సిస్కో జిల్లా న్యాయవాదిగా ఎన్నికయ్యారు. నేరాలపై ఆమె తీసుకున్న నిర్ణయాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. దీంతో ఆమె తిరిగి మరోమారు న్యాయవాదిగా ఎంపికయ్యారు.
2010 లో కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా హారిస్ మొదటిసారి ఎన్నికల్లో గెలిచారు. 2014 లో తిరిగి ఎన్నికైన తరువాత ఆమె 2016 లో యుఎస్ సెనేట్‌కు జరిగిన ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిచారు. హారిస్ న్యాయవాది డగ్లస్ ఎమ్హాఫ్‌ను వివాహం చేసుకున్నారు. డగ్లస్ ఎమ్హాఫ్ మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న తరువాత హారిస్ ను వివాహమాడారు. డగ్లస్ ఎమ్హాఫ్ ఇద్దరి పిల్లల బాధ్యతను ఆమె తీసుకున్నారు. ఆఫ్రికా అమెరికన్ ప్రతినిధిగా, ఆ సంతతికి చెందిన మహిళగా కమల హారిస్ కు ఎన్నికలలో అదనపు బలమని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. విద్యలో జాతి అసమానతలను పరిష్కరించే లక్ష్యంతో ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా పని చేసిన అనుభవం ఆమెకు ఉంది.
ఆమెను దాదాపు అందరూ “లా అండ్ ఆర్డర్” ఉమన్ అని పిలుస్తారు. న్యాయస్థానంతో బాటు సెనేట్ లో పని చేసిన అనుభవంతో ఆమె అద్భుతమైన స్పీకర్ గా తయారయ్యారు. కమలాహారిస్‌ను ఎంపిక చేయడంతో డెమోక్రాటిక్ పార్టీకి విరాళాలు భారీగా వచ్చిపడుతున్నాయి. 24 గంటల్లోనే 2.6 కోట్ల డాలర్లు (రూ.194.5 కోట్లు) విరాళాలు రావడం విశేషం. ఓ ప్రముఖ సంస్థ జరిపిన సర్వే ప్రకారం 2016లో జరిగిన ఎన్నికలలో అప్పటి ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన హిల్లరీ క్లింటన్ కు 54% శాతం మంది మహిళలు ఓట్లు వేయగా ట్రంప్ కు కేవలం 38% శాతం మాత్రమే ఓటు వేశారు. 98% నల్లజాతి మహిళలు 81% శాతం నల్లజాతి ఓటర్లు హిల్లరీ క్లింటన్ కు వేసినట్లు ఆ సర్వే తేల్చింది. ఈ నేపథ్యంలోనే ఆమెను వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎంపిక చేసారని అర్ధమవుతోంది.
భారత ఓటర్లు, నల్లజాతీయులు ఓటర్లు హారిస్ రూపంలో డెమోక్రాటిక్ పార్టీకి వెళ్తున్నాయనే ఉద్దేశంతో రిపబ్లిక్ పార్టీకి చెందిన ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆమెకు ఎన్నికలలో పోటీ చేసే అర్హత లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో సహజ పౌరుడికి పుట్టిన వారికి మాత్రమే అధ్యక్ష ఆఫీసుకు ఎన్నికయ్యే అర్హత ఉంటుందని వలస వచ్చిన వారికి అర్హత లేదని ట్రంప్ చెబుతున్నారు. వలసవచ్చిన వారికి కమలా హారిస్ జన్మించిందని ట్రంప్ వాదిస్తున్నారు. కానీ న్యాయనిపుణులు మాత్రం అమెరికాలో పుట్టిన ప్రతి ఒకరు పౌరులే అవుతారని దీంతో ఆమెకు ఎన్నికలలో పోటీ చేయడాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెబుతున్నారు. మొత్తం మీద చూస్తే హారిస్ ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తుండటంతో డెమొక్రాటిక్ పార్టీ విజయావకాశాలు మెరుగయ్యాయనే చర్చ జరుగుతోంది.