ఇందుకు నిదర్శనంగా ప్రత్యేకించి ఏపీలో ఆక్సిజన్ అందక చనిపోతున్న వారు పదుల సంఖ్యలో ఉంటున్న వైనం కలకలం రేపుతోంది. అయితే ఈ విషయంలోనూ జగన్ సర్కారు… తనదైన శైలి దాపరికాన్ని అవలంబిస్తోంది. అంతేకాకుండా ఆక్సిజన్ అందక తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో దాదాపుగా 30 మంది చనిపోతే… అక్కడ చనిపోయింది కేవలం 11 మందేనంటూ ప్రకటించింది. మృతుల సంఖ్యను ప్రకటిస్తే… వారి పేర్లను కూడా వెల్లడిస్తారు కదా. అయితే… రుయా ఘటనలో మాత్రం సంఖ్యను మాత్రం చెప్పిన జగన్ సర్కారు.. మృతుల పేర్లను వెల్లడించేందుకు నానా తంటాలు పడుతోంది. దీని వెనుక పెద్ద మతలబు దాగుందంటూ ఇటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు అటు విపక్షాలు బీజేపీ, వామపక్షాలు వాదిస్తున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో అసలు సోమవారం రాత్రి రుయాలో ఏం జరిగింది? ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు ఏమిటి? తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు జగన్ సర్కారు ఏ మేర తంటాలు పడుతోంది? అటు అధికార పార్టీ, ఇటు విపక్షాల మధ్య వాస్తవాలేమిటో చెప్పలేక అధికారులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? అసలు వాస్తవాలేమిటి? అన్న వివరాలు తెలియాలంటే… ఆయా పార్టీలకు చెందిన నేతలు చెబుతున్న వాదనలు… అందులో టీడీఎల్పీ ఉప నేత నిమ్మల రామానాయుడు వెల్లడించిన సందేహాలను ఓ సారి పరిశీలిద్దాం పదండి.
గత సోమవారం అంటే.. ఈ నెల 10వ తేదీన సాయంత్రం 5 గంటల సమయంలో రుయాలో ఆక్సిజన్ నిల్వలు అంతకంతకూ కరిగిపోతున్న విషయాన్ని ఆస్పతి సిబ్బంది గుర్తించారు. ఇదే విషయాన్ని వారు అధికారులకు తెలియజేశారు. అయితే వెనువెంటనే స్పందించిన అధికారులు కూడా చెన్నైలోని ఆక్సిజన్ సప్లయర్స్ కు సమాచారం చేరవేయగా… ఆక్సిజన్ ట్యాంకర్ కూడా వెంటనే బయలుదేరింది. అయితే గంటకు 40 కిలో మీటర్ల కంటే అధిక వేగంతో ఆక్సిజన్ ట్యాంకర్ ప్రయాణించే అవకాశం లేదు. దీంతో రాత్రి 7 గంటలు-7.30 గంటలకు గానీ ట్యాంకర్ తిరుపతి చేరుకునే అవకాశం లేదు. ఈ విషయాన్ని అంతగా పట్టించుకోని అధికారులు… ఆక్సిజన్ సప్లయర్స్ కు సమాచారం చేరవేశాం, ట్యాంకర్ బయలుదేరింది కదా… అన్న భావనతో పరిస్థితిని ముందుగా అంచనా వేయలేకపోయారు.
అయితే సరిగ్గా 7 గంటలకంతా ఆసుపత్రిలోని ఆక్సిజన్ నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీంతో ఆసుపత్రిలో ఆక్సిజన్ బెడ్లపై ఉన్న వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా మారిపోయింది. అప్పుడు గానీ తేరుకోని అధికారులు… అందుబాటులో ఉన్న ఆక్సిజన్ సిలిండర్లతో పరిస్థితిని చక్కదిద్దేయత్నం చేశారు. అయితే ఆ యత్నాలు ఫలించలేదు. అయితే అధికారులు ఈ యత్నాలు చేస్తుండగా 7.45 గంటలకు ట్యాంకర్ ఆసుపత్రికి చేరుకుంది. దీంతో ఆక్సిజన్ సరఫరా పునరుద్ధరణ జరిగింది. అయితే ఈ 45 నిమిషాల స్వల్ప వ్యవధిలోనే ఘోరం జరిగిపోయింది. ఆక్సిజన్ అందని కారణంగా ఏకంగా 30 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితిని కళ్లారా చూసిన రోగుల బంధువులు వైద్యులు, అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. దీంతో వైద్యులు, అధికారులు అక్కడి నుంచి పరుగులు తీశారు.
ఇదిలా ఉంటే… ఈ ఘటనపై మీడియాలో స్క్రోలింగ్ లు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా పెను కలకలం రేగింది. మృతుల సంఖ్యపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా వార్తలు ప్రసారం చేశారు. దీంతో అప్పటికప్పుడు రంగంలోకి దిగిన జిల్లా కలెక్టర్.. ఈ ఘటనలో 11 మంది మాత్రమే చనిపోయారని ప్రకటించారు. మృతుల సంఖ్యను మాత్రమే ప్రకటించిన ఆయన మృతుల పేర్లను గానీ, జాబితాను గానీ విడుదల చేయకపోవడం గమనార్హం. ఎక్కడైనా చనిపోయిన వారి మృతదేహాలను పరిశీలించి, వారి గుర్తింపును పూర్తి చేసిన తర్వాత మృతుల సంఖ్యను నిర్ధారిస్తారు. అందులోనూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు చనిపోతే… వారి గుర్తింపునకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. అయితే కలెక్టర్ మాత్రం ఇదేమీ పట్టించుకోకుండానే… కేవలం 11 మంది చనిపోయారని చెప్పేసి జాబితాను వెల్లడించకుండానే నిష్క్రమించారు. దీంతో ఇక్క ఏదో మతలబు ఉందని విపక్షాలకు అనుమానం వచ్చింది. వెనువెంటనే టీడీపీతో పాటు బీజేపీ, సీపీఐలు నేరుగానే రంగంలోకి దిగాయి. అసలు వాస్తవాలేమిటో చెప్పాలని డిమాండ్ చేయడంతో పాటుగా మృతుల జాబితా ఎక్కడంటూ నిలదీశాయి. మొత్తంగా రుయాలో జరిగిన ఘోరంపై ప్రభుత్వం దాగుడుమూతలు ఆడుతోందని గ్రహించిన టీడీపీ… ఘటనపై సిట్టింగ్ జడ్జీతో న్యాయ విచారణకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేసింది.
ఈ సందర్భంగా ఘటన జరిగి ఇప్పటికి మూడు రోజులు గడుస్తున్నా… వాస్తవాలు ఎక్కడంటూ టీడీఎల్పీ ఉప నేత నిమ్మల రామానాయుడు జగన్ సర్కారుపై విరుచుకుపడ్డారు. రుయా ఘటనలో మొత్తం 29 మంది చనిపోయారని ప్రకటించిన ఆయన… ఆ మృతులకు సంబంధించిన జాబితా కూడా తన వద్ద ఉందని సంచలన ప్రకటన చేశారు. ఆక్సిజన్ అందక చనిపోయిన వారు 29 మంది అని, ఆ సంఖ్య కంటే కూడా మరో 10 నుంచి 15 మంది కూడా చనిపోయి ఉండే అవకాశాలున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఎక్కడైనా మృతుల జాబితాను విడుదల చేస్తే… ఇక్కడేమో కేవలం మృతుల సంఖ్యను మాత్రమే వెల్లడించడం చూస్తుంటేనే ప్రభుత్వం తప్పుడు వైఖరి బయటపడుతోందని ఆయన ధ్వజమెత్తారు. ఈ ఘటనలో అసలు వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సిట్టింగ్ జడ్జీతో న్యాయ విచారణకు ఆదేశాలు జారీ చేయాలని నిమ్మల డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే… ఈ ఘటనపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా ప్రభుత్వ తీరుపై ఓ రేంజిలో ఫైరైపోయారు. తనకు అందిన సమాచారం మేరకు రుయా ఘటనలో మొత్తం 23 మంది చనిపోయారని, ఆ మృతులకు సంబంధించిన సమాచారం తన వద్ద ఉందని కూడా నారాయణ సంచలన ప్రకటన చేశారు. అంతేకాకుండా సదరు మృతుల జాబితాను కూడా నారాయణ మీడియాకు విడుదల చేశారు. ఇక ఇదే అంశపై జగన్ సర్కారు వైఖరిని తూర్పారబట్టిన బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి… మరో ఆసక్తికర వాదనను వినిపించారు. రుయా ఘటనలో తమ పార్టీకి చెందిన రామారావు కూడా మరణించారని, అయితే ఆయన పేరు ప్రభుత్వం ప్రకటించిన 11 మంది మృతుల జాబితాలో లేదని ఏకంగా తిరుపతి ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. మృతుల జాబితా విడుదల చేయకుండా… కొందరు అధికారుల ద్వారా జాబితా ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ జాబితాను సర్క్యూలేట్ చేయిస్తోందని కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా రుయా ఘటనలో వాస్తవాలను దాచేసే దిశగా వ్యవహరిస్తున్న జగన్ సర్కారు… అడ్డంగా బుక్కయ్యే ప్రమాదం లేదకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.











