అయితే ఈ క్వారీ అసలు యజమానికి వదిలేసిన జగన్ సర్కారు.. సబ్ లీజు దారుడిని అరెస్ట్ చేసి తనదైన శైలి చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ వ్యూహం వెనుక వైసీపీ కీలక నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి సి.రామచంద్రయ్యను రక్షించడమనే లక్ష్యం దాగుందన్న వాదనలు వినిపిస్తున్నాయి గుట్టుగా ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్న జగన్ రెడ్డి సర్కారు దమననీతిని టీడీపీ యువనేత, ఎమ్మెల్సీ బీటెక్ రవి బద్దలు కొట్టేశారు. వెరసి జగన్ రెడ్డి మరోమారు అడ్డంగా బుక్కైపోవడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అసలు మామిళ్లపల్లి క్వారీ పేలుడు, దాని తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను ఓ సారి పరిశీలిస్తే… కడప నగరానికి చెందిన సి.రామచంద్రయ్య సతీమణి కస్తూరిబాయి పేరిట 2001లో కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లి పరిధిలో ముగ్గురాళ్ల గని లీజు మంజూరైంది. ప్రస్తుతం ఈ క్వారీ మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠానికి చెందిన వైసీపీ నేత నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నడుస్తోంది. రామచంద్రయ్య కుటుంబం జీపీఏ తీసుకుని నాగేశ్వరరెడ్డి ఈ క్వారీని నడుపుతున్నారు. ఈ క్వారీ నిర్వహణ కోసం కావాల్సిన పేలుడు పదార్థాలను జగన్ కు అత్యంత సమీప బంధువు, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పెదనాన్న ప్రతాప్ రెడ్డి వద్ద నుంచి సేకరిస్తున్న రఘునాథరెడ్డి అనే సబ్ డీలర్ నుంచి సరఫరా అవుతున్నాయి. అంటే… గని లీజులో ప్రధాన లీజుదారుడు, సబ్ లీజుదారుడు ఉన్నట్లుగానే… పేలుడు పదార్థాల సరఫరాలోనూ ప్రధాన డీలర్, సబ్ డీలర్ కూడా ఉన్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే… ప్రధాన లీజుదారురాలు కస్తూరిబాయిని విస్మరించేసిన పోలీసులు సబ్ లీజుదారుడు నాగేశ్వరరెడ్డిని అరెస్ట్ చేశారు. అదే మాదిరిగా పేలుడు పదార్థాల సరఫరాకు సంబంధించి సబ్ డీలర్ గా ఉన్న రఘునాథరెడ్డిని అరెస్ట్ చేశారు. ప్రధాన డీలర్‌గా ఉన్న వైఎస్ ప్రతాప్ రెడ్డిని విస్మరించారు. అయితే ఈ తరహా అరెస్ట్ లపై విపక్షం గళమెత్తగా… వైఎస్ ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు… సి.రామచంద్రయ్య జోలికి వెళ్లలేదు. ఈ నేపథ్యంలో బుధవారం మీడియా ముందుకు వచ్చిన బీటెక్ రవి… అసలు కేసు దర్యాప్తు ఎలా సాగుతోంది? దాని వెనుక ఉన్న లక్ష్యమేంటి? అన్న వివరాలను వెల్లడించారు. మామిళ్లపల్లి ఘటనలో వాస్తవాలు బయటకు రావట్లేదని.. అసలు దోషులను వదిలేయాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు. గనుల అసలు లీజుదారుగా సి.రామచంద్రయ్య సతీమణి కస్తూరిబాయి పేరు ఉంటే.. సబ్ లీజుదారుగా ఉన్న నాగేశ్వరరెడ్డిని అరెస్ట్ చేయడమేమిటని ప్రశ్నించారు.
ఇదే ఘటనకు సంబంధించి పేలుడు పదార్థాల సరఫరాకు సంబంధించి ప్రధాన డీలర్‌గా ఉన్న వైఎస్ ప్రతాప్ రెడ్డితో పాటుగా సబ్ డీలర్ గా ఉన్న రఘునాథరెడ్డి.. ఇద్దరినీ అరెస్ట్ చేసిన విషయాన్ని బీటెక్ రవి ప్రస్తావించారు. ఒకే ప్రమాదానికి సంబంధించి రెండు రకాల అరెస్ట్ లు ఎలా చేస్తారని ప్రశ్నించారు. సబ్ లీజుదారుగా ఉన్న నాగేశ్వరరెడ్డిపై ఎర్రచందనం అక్రమ రవాణా కేసులున్నాయని, గతంలో ఆయన జైలుకు కూడా వెళ్లివచ్చారని, ఈ విషయాలేవీ తెలుసుకోకుండానే ఆయనకు సి.రామచంద్రయ్య గనిని సబ్ లీజుకు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఇలా మామిళ్లపల్లి పేలుడులో తన పార్టీలో కీలక నేతగా ఉన్న సి.రామచంద్రయ్యను రక్షించే దిశగా సాగుతున్న జగన్ మార్కు దర్యాప్తు గుట్టును బీటెక్ రవి రట్టు చేశారనే చెప్పాలి. మున్ముందు ఈ వ్యవహారంలోనూ జగన్ సర్కారు అడ్డంగా బుక్ కాక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.











