( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
అంతా చట్ట ప్రకారమే చేస్తున్నాం అంటున్నారు… కానీ న్యాయ వ్యవస్థని ఆశ్రయించే అవకాశం లేని రోజుల్లో చర్యలు చేపడుతున్నారు. శని, ఆదివారాలు కోర్టు సెలవులు.. అర్థరాత్రి.. తెల్లవారు జామునే కూల్చివేతలు. గత కొంత కాలంగా విశాఖ అధికార యంత్రాంగం ఆక్రమణల తొలగింపు, ఆస్తుల స్వాధీనానికి ఎంచుకుంటున్న సమయం ఇది. ఇలా ఎందుకు జరుగుతోందన్నది బహిరంగ రహస్యమే.
పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖలో టీడీపీ నేతల లక్ష్యంగా గత కొంత కాలంగా అధికారులు ఆస్తులు స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించారని, అక్రమ నిర్మాణాలు చేపట్టారని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని.. ఇలా ఒక్కొక్కరివి ఒక్కో సాకు చూపుతూ దశాబ్దాల తరబడి వారి ఆధీనంలో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు. మూడు వారాలుగా కొనసాగుతున్న విశాఖ యంత్రాంగం చర్యలతో నెక్ట్స్ ఎవరు, ఏమిటి అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.
న్యాయ వ్యవస్థ ముందు నిలబడవని తెలిసినా..
అధికారులు తీసుకుంటున్న చర్యలు కక్షపూరితమన్న విమర్శలు వస్తున్నాయి. కోర్టు గుమ్మం తొక్కే అవకాశం లేకుండా చేస్తున్న పనులే దీనికి నిదర్శనమంటున్నారు. రికార్డులు, సిబ్బందిని సంసిద్ధం చేసుకుని… కోడి కూయక ముందే పనులు పూర్తి చేస్తున్నారు. పండుగ పూట కూడ చర్యలు తీసుకోవడానికి వెనుకాడటం లేదు. గంటా శ్రీనివాసరావుకు చెందిన అక్రమ భూములు ఉన్నాయని అడవివరంలోని 64 ఎకరాల భూమిని దీపావళి పండుగ రోజున స్వాధీనం చేసుకున్నారు. అక్కడ నేల కూల్చిన నిర్మాణాల్లో 90 శాతం నిరుపేదలకు చెందిన షెడ్లు ఉన్నాయి. వాటిని క్రమబద్ధీకరించే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు.
Must Read: బ్రేక్ : ఈ భయంతోనే వారు అర్ధరాత్రి కూల్చేశారా?
నెక్ట్స్ టార్గెట్ ఎవరు?
శని, ఆదివారాలు వస్తే చాలు టీడీపీ నేతల్లో ఒక రకమైన భయం మొదలవుతోంది. ఎప్పుడో కాలేజీలో చదువుతున్నప్పుడు అమ్మాయిని ఏడిపించారంటూ టీడీపీ నేతలపై కేసులు పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. దశాబ్దం, రెండు దశాబ్దాల క్రితం నాటి వ్యవహారాలను కూడ అధికారులు తవ్వి తీస్తున్నారు. ఒక వారం సబ్బం హరి.. మరో వారం గీతం యూనివర్సిటీ… ఇంకో వారం ఫ్యూజన్ ఫుడ్ కోర్ట్… ఇలా ఒక్కో వారం ఒక్కో టీడీపీ నేతను టార్గెట్ చేస్తూ చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యలపై ఫైల్ చేయగానే వెంటనే స్టేలు కూడా వస్తున్నాయి. అందుకే ఆ అవకాశం ఇవ్వకుండా శని , ఆదివారాలు చర్యలు చేపడుతున్నారన్న ఆరోపణలొస్తున్నాయి. మరి వచ్చే వారం ఎవరి వంతో అన్న చర్చ అప్పుడే మొదలైంది.
Also Read: ఆయన రూటే సెపరేటు..!











