విశాఖ సిరిపురంలో vmrda స్థలంలో ఉన్న ఫ్యూజన్ ఫుడ్స్ ను vmrda అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు.
ఖాళీ చేయాలంటూ తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, ఉన్నపళంగా ఈ చర్యలకు దిగారని నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. తమకు 2024 వరకులీజు ఉన్నప్పటికీ నోటీసులు, సమాచారం ఇవ్వకుండా అధికారులు ఖాళీ చేయిస్తున్నారు అంటూ ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని హర్ష ఆరోపించారు. లీజు అయిపోవడం తోనే ఖాళీ చేయిస్తున్నామని మరోవైపు అధికారులు అంటున్నారు.
హర్ష టీడీపీకి చెందిన నేత కావడంతో, కక్ష సాధింపులో భాగంగానే.. ప్రభుత్వం ఇదంతా చేయిస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి ని హత్య చేయడానికి ప్రయత్నించడాన్న కేసులో నిందితుడు కోడికత్తి శీను, హర్ష దగ్గర పని చేసేవాడు. అప్పట్లో ఫ్యూజన్ ఫుడ్స్ హర్ష దగ్గర కోడికత్తి శీను పనిచేయడం, హర్ష టీడీపీ లీడర్ కావడంతో.. ఆ హత్యాయత్నం ఘటన తెలుగుదేశం చేయించినట్లుగా రంగు పులమడానికి కూడా ప్రయత్నం జరిగింది.
ఈ వ్యవహారంపై యజమాని హర్ష ఏమంటున్నారంటే..
నన్నెందుకు టార్గెట్ చేసారో అర్థం కావడం లేదు అని ఫ్యూజన్ ఫుడ్స్ యజమాని హర్ష అన్నారు. అర్థరాత్రి వచ్చి తన హోటల్ సామాన్లు తీసుకువెళ్ళుతున్నారని వాపోయారు. కనీసం ఎక్కడకి తీసుకు వెళ్ళుతున్నారో చేప్పడం లేదన్నారు. తనకు 2024 వరకు లీజు ఉందని, ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని ఆయన అంటున్నారు.
అధికారులు ఇలా దౌర్జన్యంగా వ్యవహరిస్తోంటే వ్యాపారాలు చేయడమే సాధ్యం కాదని ఆయన వాపోయారు. తాను కేవలం వ్యాపారస్తుడ్ని మాత్రమేనని, రాజకీయాలు తెలియవని పేర్కొన్నారు. తనపై ఎందుకు క్షక్ష సాధింపుకు పాల్పడుతున్నారో కూడా అర్థం కావడం లేదు అని హర్ష ఆవేదన వ్యక్తం చేశారు.











