ఢిల్లీలో దీపావళి వేడుకలను నిషేధించడం వెనుక అక్కడి కాలుష్యం ప్రధాన కారణం కావచ్చు గానీ.. దేశంలో మిగిలిన అన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఏం లేవు. నిజానికి అన్ని చోట్లా ప్రమాదకర వాతావరణ పరిస్థితులే ఉన్నాయి. పైగా కొవిడ్ భయం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ సమయంలో.. అన్ని రాష్ట్రాలూ దీపావళి టపాసుల విక్రయాలను, టపాసుల వేడుకలను నిషేధించడమే మంచిదనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో కేంద్రం.. అన్ని రాష్ట్రాలతో సమీక్ష సమావేశం పెట్టుకుని.. ‘నిషేధం’ అనే మాట తమ నోటితో అనకుండా.. పండగల సందర్భంగా జాగ్రత్తలు తీసుకోండి అని సూచనలు చెబుతోంది…
కరోనా పొంచి ఉంది జాగ్రత్త
దేశంలో కరోనా తగ్గినటే ఉంది కానీ ప్రతి రోజూ 40 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. వరుసగా పండుగలు రావడం, లాక్ డౌన్ ఎత్తివేయడంతో కరోనా మరోసారి ప్రతాపం చూపే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను హెచ్చరించింది. కోవిడ్ కేసులు ఎక్కవగా వస్తోన్న ఆంధ్రప్రదేశ్, అస్సాం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ ఆరోగ్య మంత్రులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ సమీక్ష నిర్వహించారు. కోవిడ్ పరిస్థితులపై ఆయా రాష్ట్రాల మంత్రులను అడిగి తెలుసుకున్నారు. వరుసగా పండుగలు రావడం, లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులకు హర్షవర్ధన్ సూచించారు.
అయితే ఇవి కేవలం సూచనలు మాత్రమే కాదు కోవిడ్ వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందనే హెచ్చరికలుకూడా! కేంద్ర మంత్రి సుతిమెత్తగా చెప్పారని తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో దీపావళి టపాసుల అమ్మకాలను పూర్తిగా నిషేధించారు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీపావళి టపాసుల అమ్మకాలను నిషేధించే అవకాశం ఉందని తెలుస్తోంది.
రెండు ప్రయోజనాలు
దీపావళి సాంప్రదాయబద్దంగా జరుపుకోవడం జనం ఎప్పుడో మరచిపోయారు. భారీ శబ్ధాలు, పెద్ద ఎత్తున పొగ వచ్చేలా టపాసులు కాలిస్తేనే దీపావళి జరుపుకున్నట్టు లెక్క అనేదాకా వచ్చారు. ఢిల్లీలో అయితే దీపావళి వచ్చిందంటే కాలుష్యం అమాంతం పెరిగిపోతోంది. శ్వాసకోస వ్యాధులు ఉన్నవారు, చిన్న పిల్లలు గాలి కాలుష్యంతో అల్లాడిపోతున్నారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వం అటు కాలుష్య నియంత్రణతోపాటు, కోవిడ్ ను అదుపు చేసేందుకు టపాసుల అమ్మకాలను పూర్తిగా నిషేధించింది.
దీపావళిని జరుపుకునే సమయాన్ని కూడా కేవలం రెండు గంటలకు పరిమితం చేసింది. కాలుష్యం పెరిగిపోతూ ఉండటంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా దీపావళి టపాసులపై నిషేధంపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో దేశం మొత్తం టపాసుల అమ్మకాలను నిషేధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాలి కాలుష్యాన్ని నియంత్రించడంతోపాటు, కరోనా కట్టడికి కూడా ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాల్సిందే. లేదంటే గాలి కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఎంతో దూరంలో లేదనడంలో అతిశయోక్తి లేదు.