మొన్న మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ వంతు అయింది… ఇప్పుడు మాజీ మేయర్ సబ్బంహరి వంతు వచ్చింది. రూపాయలు కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిని నిస్సిగ్గుగా వదిలేస్తారు. ప్రభుత్వ భూముల్లో ప్రహరీ కట్టారని.. బాత్రూం కట్టారని కూల్చివేతలకు తెగబడుతున్నారు.
మాజీ మేయర్ సబ్బం హరి నివాసం వద్ద శనివారం ఉదయం కూల్చివేత ప్రారంభించడంతో ఉద్రిక్తత నెలకొంది. సీతమ్మధారలో సబ్బం హరి ఇంటిని ఆనుకుని ఉన్న టాయిలెట్‌ను జీవీఎంసీ అధికారులు కూల్చుతున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చడంపై సబ్బం హరి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు కూల్చుతున్నారో అధికారులు చెప్పడం లేదని అన్నారు. కూల్చివేతకు కారణాల్ని ఓ కాగితంపై రాసివ్వాలంటే… స్పందించడం లేదని తెలిపారు.తాను ఎటువంటి అక్రమాలకు తావు ఇవ్వనని హరి స్పష్టం చేశారు, గొంతు నొక్కాలని చూస్తే అది ఈ జన్మలో సాధ్యం కాదని అన్నారు.
నగరంలో 80 శాతం అక్రమ నిర్మాణాలే…
ఆక్రమణలను, అక్రమ నిర్మాణాలను తొలగించుకుంటూ పోతే విశాఖలో 80 శాతం నిర్మాణాల్లో అక్రమాలు కనిపిస్తాయి. అయినా నిర్మాణాలు చేపడుతున్న సమయంలో చర్యలు తీసుకుంటే.. ప్రశ్నించే వారు ఉండరు కానీ.. కొన్నాళ్ల తర్వాత ఎటువంటి నోటీసులు లేకుండా కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారి నిర్మాణాలపై విరుచుకు పడుతుంటే అది ఖచ్చితంగా కక్షసాధింపు అన్నది అక్షరజ్ఞానం లేని వాడికి కూడా అర్థమవుతుంది.











