గన్నవరం వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. కాంట్రాక్టు పనులన్నీ టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వల్లభనేని వంశీ అనుచరులకే ఇస్తున్నారంటూ దుట్టా రామచంద్రరావు వర్గం నేతలు బాపులపాడు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. రెండు నెల కిందట బాపులపాడు మండలం కాకులపాడు గ్రామ సచివాలయ శంకుస్థాపన కార్యక్రమంలో తలెత్తిన వివాదాలు మరోసారి రాజుకున్నాయి. వల్లభనేని వంశీ టీడీపీ అధికారంలో ఉండగా గన్నవరం నియోజకవర్గంలోని 104 గ్రామాల వైసీపీ నాయకులు, కార్యకర్తలపై 5 వేల అక్రమ కేసులు పెట్టించారని దుట్టా వర్గం ఆరోపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే వంశీతో ఎట్టి పరిస్థితుల్లో కలసి పనిచేసే ప్రసక్తే లేదని వైసీపీ కార్యకర్తలు తేల్చి చెప్పారు.
అసలేం జరిగిందంటే..
టీడీపీ అధికారంలో ఉండగా వల్లభనేని వంశీతో వైసీపీ నేతలు అనేక ఇబ్బందులు పడ్డారు. వారిపై అనేక అక్రమ కేసులు పెట్టి వేధించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక తాజాగా వంశీ చేతిలో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావుతో విభేదాలు కొట్టుకునే దాకా వెళ్లాయి. చూసుకుందాం రా అంటూ యార్లగడ్డ, వల్లభనేని వంశీ సవాళ్లు విసురుకుని, మందీ మార్భలంతో ఒకరి ఇంటికి మరొకరు బయలు దేరిన సందర్భాలు ఉన్నాయి. గన్నవరంతో పాటు నియోజకవర్గంలోని గ్రామాల్లోనూ టీడీపీ, వైసీపీ నాయకుల గొడవల కారణంగా స్పష్టంగా విడిపోయి ఉన్నారు. 2019 ఎన్నికల తరవాత జరిగిన రాజకీయ పరిణామాలతో వల్లభనేని వంశీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వంశీ వైసీపీలో అయితే చేరారు కానీ, గ్రామాల్లో ఆయన అనుచరులను, ఆయా గ్రామాల వైసీపీ నాయకులు దగ్గరకు రానీయడం లేదు. దీంతో వంశీ వైసీపీలో చేరినంత సాఫీగా క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులను, వైసీపీ నేతలు చేరదీయలేదు. గ్రామాల్లో గతంలో టీడీపీతో, వైసీపీ శ్రేణులు తలపడిన నేపథ్యంలో వారు కలవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. దీనికి తోడు వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావులతో వైరం పెంచుకున్నారు. వంశీ వైసీపీలో చేరినా ప్రత్యర్థులు వైరం మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. Must Read: వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలో చేరుతున్నాట్ట! ఎందుకో తెలుసా?
జగనన్న చేతులు కలిపినా..
గన్నవరం వైసీపీలో మూడు ముఠాల మధ్య గొడలు సర్వసాధారణంగా మారాయి. ప్రతి రెండు నెలలకు ఓ సారి వారి మధ్య ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంది. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయి వైసీ సుబ్బారెడ్డి వల్లభనేని, యార్లగడ్డ, దుట్టా వర్గాల మధ్య అనేక పర్యాయాలు రాజీ చేశారు. అయినా ఫలితం దక్కలేదు. చివరకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల కంకిపాడు మండలంలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చి గన్నవరం నేతల చేతులు కలిపారు. అందరూ కలసి పనిచేయాలని సూచించారు. గట్టిగా రెండు నెలలు కాక ముందే గన్నవరం నేతలు మరోసారి రోడ్డెక్కారు. జగనన్న ఇరువర్గాల చేతులు కలిపినా, వారి మనసులు మాత్రం కలవడం లేదు.
వంశీని జీర్ణించుకోలేని గన్నవరం వైసీపీ నేతలు
గన్నవరం నియోజకవర్గం టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీని, ప్రత్యర్థులు తమ నేతగా అంగీకరించడం లేదు. గన్నవరం నుంచి వంశీని సాగనంపడమే లక్ష్యంగా వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు వర్గాలు పనిచేస్తున్నాయి. వైసీపీ అగ్రనేతలతో వంశీ మంచి సంబంధాలు కొనసాగిస్తున్నా, నియోజకవర్గంలో మాత్రం ఆయనతో కలసి నడిచేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు సిద్దంగా లేరనేది అందరికీ తెలిసిందే. వంశీ వర్గంపై ఒత్తిడి తీసుకువచ్చి రాజీనామాకు ప్రేరేపిస్తున్నారనే అనుమానం కూడా కలుగుతోంది. వల్లభనేని రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళితే మాత్రం వైసీపీలోని ప్రత్యర్థి వర్గాలు ఓడించడానికి సిద్దంగా ఉన్నాయని తెలుస్తోంది. Also Read: ఛలో తాడేపల్లి : జగన్ వద్దనే తేల్చుకుందాం పదండి











