ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తండ్రి పదవిని అడ్డు పెట్టుకుని అందిన కాడికి దోచేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. వరుసగా 3 రోజుల పాటు సాగిన విచారణలో భాగంగా సీబీఐ అధికారులు అడిగిన మెజారిటీ ప్రశ్నలకు జగన్… తెలియదు, గుర్తు లేదు అంటూ సమాధానాలు దాటవేసిన విషయమూ తెలిసిందే. అయినా ఎప్పుడో జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడెందుకంటారా?.. జగన్ మాదిరే ఆయన అనుచరులు కూడా ఇప్పుడు వివిధ కేసుల్లో విచారణలు ఎదుర్కొంటున్నారు కదా. ఈ విచారణల్లో వారు కూడా జగన్ మాదిరే… తెలియదు, గుర్తు లేదు అంటూ పోలీసుల సహనాన్ని పరీక్షిస్తున్నారట. తమ అధినాయకుడు జగనే గజినీగా మారితే.. తామెందుకు అలా మారకూడదని అనుకున్నారో, ఏమో తెలయదు గానీ… వివిధ కేసుల్లో అరెస్టైన బోరుగడ్డ అనిల్ కుమార్, పానుగంటి చైత్యలు పోలీసుల కస్టడీలో ఇలాంటి సమాధానాలే ఇచ్చారట.
జగన్ జమానాలో ప్రభుత్వ పెద్దల సంపూర్ణ మద్దతుతో చెలరేగిపోయిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ రూ.50 లక్షలు ఇవ్వాలంటూ బాబు ప్రకాశ్ అనే వ్యక్తిని బెదిరించారన్న కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో అతడిని కోర్టు అనుమతితో పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని 3 రోజుల పాటు విచారించారు. ఈ సందర్భంగా కొన్ని అంశాల్లో పోలీసులకు కొంత మేర సహకరించినా… తనపై తీవ్రమైన నేరాభియోగాలు నమోదు అయ్యే అవకాశాలున్న ప్రశ్నలకు మాత్రం బోరుగడ్డ తెలివిగా తప్పించుకునే యత్నం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా అప్పటిదాకా తాను వాడిన సెల్ ఫోన్ నెంబరు ఏమిటని పోలీసులు ప్రశ్నించగా…తన మొబైల్ నెంబరు తనకు గుర్తు లేదని, తన సెల్ ఫోన్ ఎక్కడ పడిపోయిందో కూడా తనకు గుర్తు లేదని గజినీని మించిన రీతిలో సమాధానం ఇచ్చాడట. ఈ సమాధానం విన్న పోలీసులకు షాక్ తిన్నంత పని అయ్యిందట. వాస్తవానికి బోరుగడ్డను అరెస్ట్ చేసే సమయంలోనే అతడి ఇంటిలో సోదాలు చేసిన పోలీసులు… అతడు పాల్పడ్డ నేరాలకు సంబంధించిన కొన్ని కీలకమైన ఆధారాలను సేకరించినట్లు సమాచారం.
ఇక టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడు పానుగంటి చైతన్య… పోలీసులకు సహకరిస్తున్నట్లుగానే నటిస్తూ… తాను ఇరుక్కుపోయే అంశాలకు సంబంధించి మాత్రం నోరు విప్పడం లేదట. పోలీసులు కాస్తంత కఠువుగా ప్రశ్నిస్తే… ఆ అంశం పూర్తిగా దారి తప్పిపోయే రీతిలో సమాధానం ఇస్తున్నాడట. ఈ కేసులో కోర్టు అనుమతితో చైతన్యను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అతడిని 3 రోజుల పాటు విచారించారు.
ఈ క్రమంలో టీడీపీ కార్యాలయంపై దాడికి ఉసిగొల్పిన వారి పేర్లు, వారి నుంచి తనకు అందిచన ఆదేశాలు తదితరాలను పూసగుచ్చినట్లు చెప్పిన చైతన్య… తాను ఈ కేసులో పీకల్లోతుగా ఇరుక్కుపోయే దిశగా ఎదురైన ప్రశ్నలకు మాత్రం తెలియదు, గుర్తు లేదు అంటూ సమాధానాలు దాటవేశాడట. ఇక ఈ రెండు కేసుల్లో ఇటు చైతన్య, అటు బోరుగడ్డల కస్టడీ గడువు ముగియడంతో వారిద్దరినీ పోలీసులు కోర్టు ఎదుట హాజరుపర,చికోర్టు ఆదేశాల మేరకు వానిని జైలుకు తరలించారు.
ఇదిలా ఉంటే… టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో గతంలో ప్రభుత్వ సలహాదారు పదవిలో ఉన్న వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ కీలక నేతలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాశ్ లు కూడా పలుమార్లు ఈ కేసు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. సజ్జల ఒక్కసారే ఈ కేసు విచారణకు హాజరు కాగా… నాడు ఏం జరిగిందన్న పోలీసుల ప్రశ్నలకు తనకేం గుర్తు లేదన్నట్టుగా ఆయన సమాధానం ఇచ్చారట.
ఇక అప్పిరెడ్డి, రఘురాం, అవినాశ్ లు అయితే సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ అరెస్ట్ కాకుండా ఆదేశాలు తెచ్చుకుని… విచారణకు హాజరైన సందర్భంలో తమకేమాత్రం సహరించలేదని పోలీసులు తెలిపిన సంగతి తెలిసిందే. విచారణలో ఎప్పుడో జరిగిన ఘటనలు తమకు ఎలా గుర్తుంటాయని ఈ నేతలు పోలీసులకే ఎదురు ప్రశ్నలు వేసినట్లుగా సమాచారం. మొత్తంగా జగన్ మాదిరే ఆయన అనుయాయులు కూడా పోలీసు కేసులు తప్పించుకునేందుకు గజినీల్లా మారిపోతున్న వైనంపై సెటైర్లు పడిపోతున్నాయి. ఇదంతా జగన్ లీగల్ టీమ్ కావాలనే తమ నేతలకు చెప్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.. గత కొన్ని రోజులుగా జైలు బాట పడుతున్న వైసీపీ నేతలంతా ఈ మూడు పదాలనే పదే పదే రిపీట్ చేస్తుండడంతో ఆ అనుమానాలు మరింత బలపడుతున్నాయి… మరి, దీనిని పోలీసులు ఎలా డీ కోడ్ చేస్తారో అనేది ఆసక్తికరంగా మారుతోంది..