ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు అదికారం చేపట్టినంతనే రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా పోటెత్తుతున్నాయి. ఇప్పటికే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), లులూ గ్రూప్ విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో పాటుగా ఆ దిశగా ఆ రెండు కంపెనీలు చర్యలు కూడా మొదలుపెట్టాయి. తాజాగా ఉక్కు రంగంలో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద కంపెనీగా అవతరించిన మిట్టల్ గ్రూప్ విశాఖలో అతి భారీ పెట్టుబడికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మిట్టల్ స్టీల్ పెట్టుబడి కార్యరూపం దాలిస్తే… దేశంలోనే అతి పెద్ద ఉక్కు తయారీ కర్మాగారానికి ఏపీ కేరాఫ్ అడ్రెస్ గా నిలవనుంది. అంతేకాకుండా విశాఖ పరిధిలోని అనకాపల్లి పరిసరాలు… మరో విశాఖను తలపించేలా సరికొత్త రూపును సంతరించుకోనున్నాయి. ఈ మేరకు మిట్టల్ స్టీల్ నుంచి వచ్చిన ప్రతిపాదనలకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు దాదాపుగా ఓకే చెప్పేసినట్లుగా ప్రచారం సాగుతోంది.
భారత్ కే చెందిన లక్ష్మి నారాయణ్ మిట్టల్ అలియాస్ లక్ష్మీ మిట్టల్ చాలా ఏళ్ల క్రితమే ఇంగ్లండ్ వెళ్లిపోయి… ఉక్కు తయారీ రంగంలో స్థిరపడిపోయారు. మిట్టల్ స్టీల్స్ పేరిట కంపెనీని నెలకొల్పిన లక్ష్మి మిట్టల్ ఆ రంగంలో పేరెన్నిగన్న వ్యాపారిగా గుర్తింపు సంపాదించారు. కాలక్రమంలో అదే రంగంలోని అర్సెలర్ కంపెనీని టేకోవర్ చేసిన మిట్టల్… తన కంపెనీ పేరును ఆర్సెలర్ మిట్టల్ గా పేరు మార్చారు. ఈ కంపెనీ ఉక్కు తయారీలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కంపెనీగా ఉంది. కొన్నేళ్ల క్రితం మాతృదేశం వైపుగా దృష్టి సారించిన మిట్టల్ తన కంపెనీని భారత్ కూ విస్తరించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో జపాన్ కు చెందిన మరో ఉక్కు తయారీ కంపెనీ అయిన నిప్పన్ తో టై అప్ అయి అర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా పేరిట దేశంలో కార్యకలాపాలు సాగిస్తున్నారు.
ప్రస్తుతం అర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా తరఫున విశాఖలో ఓ భారీ ఉక్కు తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామంటూ సదరు కంపెనీ నుంచి ఏపీ ప్రభుత్వానికి ప్రతిపాదన అందింది. ఈ ప్రతిపాదన మేరకు అనకాపల్లి పరిదిలో ఇదివరకే బల్క్ డ్రగ్ పరిశ్రమ కోసం సేకరించిన 2,200 ఎకరాల భూములను తమకు కేటాయించాలని ఈ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అందులో 7 మిలియన్ టన్నుల వార్షిక ఉక్కు తయారీ చేసే స్థాయిలో ఓ భారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని ఆ కంపెనీ తెలిపింది. భూకేటాయింపు పూర్తి అయిన మరుక్షణమే కర్మాగారం నిర్మాణాలను మొదలుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా ఆ కంపెనీ తెలిపింది. ఈ కర్మాగారం కోసం సదరు కంపెనీ ఏకంగా రూ.70 వేల కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. ఈ ప్లాంట్ లో 2029 నాటికే ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు చేపడతామని కూడా తెలిపింది. ఈ ఫ్యాక్టరీ ద్వారా ప్రత్యక్షంగా 20 వేలు, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఈ కర్మాగారం పూర్తి కాగానే… దానికి అనుబంధంగా మరో భారీ ఉక్కు తయారీ కర్మాగారాన్ని అక్కడే ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు అర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా తెలిపింది. ఏడాదికి 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు కానున్న ఈ కర్మాగారం కోసం సదరు కంపెనీ ఏకంగా రూ.1 లక్ష కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు సమాచారం. ఈ లెక్కన అనకాపల్లి పరిధిలో ఏర్పాటు చేసే తన రెండు ఉక్కు ఫ్యాక్టరీల కోసం సదరు కంపెనీ ఏకంగా రూ.1.70 లక్షల కోట్లను వెచ్చించనుందన్న మాట. ఇంతమేర భారీ పెట్టుబడులు పెడతామని ముందుకు వచ్చిన అర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ప్రతిపాదనకు ఏపీ సర్కారు దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. వెరసి… విశాఖ ఉక్కుకు కూతవేటు దూరంలో మరో విశాఖ ఆవిష్కృతం కానుందని చెప్పక తప్పదు. అంతేకాకుండా దేశంలోనే అతి పెాద్ద ఉక్కు తయారీ కేంద్రానికి విశాఖ కేరాఫ్ అడ్రెస్ గా కూడా నిలవనుంది.