జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ భారతి రెడ్డి త్వరలోనే లండన్ కు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈసారి కాస్త లాంగ్ టూర్ ఉంటుందని, ఎక్కువ రోజులు అక్కడే గడిపి వస్తారని అంటున్నారు. ఎందుకంటే రెండు రోజుల క్రితమే జగన్ పాస్ పోర్టు రెన్యువల్ చేయించుకున్నారు. ఈ పాస్‌పోర్టు రెన్యువల్ కోసం జగన్, భారతి గురువారం విజయవాడ బందరు రోడ్డులోని పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లారు. సాయంత్రం 5.30 గంటలకు చేరుకొని పాస్‌పోర్టు రెన్యువల్ చేయించుకొని 5.50 గంటలకు తిరిగి తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లారు. ఎమ్మెల్సీ రఘురాం, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, మాజీ ఎంపీ సురేష్, మల్లాది విష్ణు, ఇతర వైసీపీ నాయకులు జగన్ వెంట ఉన్నారు.
జగన్ రెడ్డి బెంగళూరు నుంచి వచ్చి మరీ ఈ పాస్ పోర్టు రెన్యువల్ చేయించుకున్నారు. జగన్ పాస్ పోర్టు కోర్టు ఆధీనంలో ఉంది. అక్రమాస్తుల కేసుల్లో కోర్టుకు ఆయన తన పాస్ పోర్టును స్వాధీనం చేయాల్సి వచ్చింది. విదేశీ పర్యటనకు వెళ్లాలంటే కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. సీఎంగా ఉన్నప్పుడు జగన్ డిప్లొమాట్ పాస్ పోర్టు తీసుకున్నారు. ఇప్పుడు సీఎం పదవి పోయింది కాబట్టి ఆ డిప్లొమాట్ పాస్ పోర్టు పని చేయదు. కాబట్టి, పాత పాస్ పోర్టును రెన్యువల్ చేయించుకున్నారు.. జగన్. ఎన్నికలు ముగిశాక లండన్ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా కోర్టు ఆంక్షల మధ్యే జగన్ యాత్ర సాగిన సంగతి తెలిసిందే. యూరప్ పర్యటనకు వెళ్లే ముందు మొబైల్ ఫోన్, ఈ-మెయిల్ ఐడీ, పర్యటన వివరాలు కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని సీఎం జగన్ రెడ్డిని కోర్టు ఆదేశించింది.
అయితే, తాజాగా లండన్ వెళ్లేందుకు కూడా జగన్ – భారతి ఇద్దరూ సమాయత్తం అవుతున్నారు. కొత్త కాలం అక్కడే ఇద్దరూ సేదతీరుతారని అంటున్నారు. అయితే, లండన్ లో అవినాష్ రెడ్డి అంశం చర్చకు వచ్చే అవకాశం ఉందని అంటుున్నారు. వైసీపీ పెద్ద తలకాయల కనుసన్నల్లోనే వివేకానంద రెడ్డి హత్య జరిగిందని బలమైన అనుమానాలు ఉన్నాయి. ఆ పెద్ద తలకాయల కింద అవినాష్ రెడ్డి ఉండగా.. ఆయన సీబీఐ విచారణలో అడ్డంగా దొరికిపోయారు. ఇప్పుడు అవినాష్ రెడ్డిపైన సీబీఐ కత్తి వేలాడుతోంది. ఎప్పుడు అరెస్టు చేసే పరిస్థితి వస్తుందో తెలియని పరిస్థితి ఉంది.
అలా తమ్ముడ్ని కాపాడడం కోసం జగన్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అప్పట్లో అధికారంలో ఉండగా నడిచింది కానీ.. ఇప్పుడు ఏ పవర్ లేకుండా తమ్ముడిని కాపాడలేరు. అలా కాపాడే ప్రయత్నం చేసి.. కేంద్ర పెద్దల నుంచి ముప్పు కొని తెచ్చుకోవద్దని భారతి తన భర్తకు నచ్చ చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అవినాష్ ను కాపాడకపోతే తన ఉనికికే ప్రమాదం అన్నట్లుగా జగన్ మదిలో ఉన్నట్లుగా చెబుతున్నారు. అవినాష్ ను అరెస్టు చేసినా కూడా జగన్ ఏమీ పట్టించుకోకపోతే విచారణలో అసలు నిజాలను అవినాష్ రెడ్డి చెప్పే అవకాశం లేకపోలేదనే భావన జగన్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు. మరి ఈ వ్యవహారంలో జగన్ భారతి ఫైనల్ గా ఏం ఆలోచించుకుంటారనేదానిపై ఆసక్తి నెలకొంది.