వైసీపీ ఈ నెల 5న ఫీజు పోరు కార్యక్రమాన్ని తలపెట్టిన విషయం తెలిసిందే. ఐతే గడిచిన ఐదేళ్లలో విచ్చలవిడిగా, ఇష్టారీతిన లక్షల కోట్ల అప్పులు చేసిన జగన్ సర్కార్..దిగిపోయే నాటికి పెద్ద ఎత్తున పెండింగ్ బకాయిలు పెట్టి వెళ్లింది. ఈ బకాయిలు కూటమి సర్కార్‌కు గుదిబండగా మారాయి. కానీ వైసీపీ అధినేత జగన్ గురివింద గింజ తన నలుపెరగదన్నట్లుగా ఇప్పుడు ఫీజు పోరు అంటూ కొత్త డ్రామాలకు తెరతీశారు.
జగన్ అధికారం కోల్పోయేనాటికి రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.2,100 కోట్లు, వసతి దీవెన కింద మరో 1,400 కోట్లు..మొత్తంగా రూ.3,500 కోట్లు బకాయిపెట్టి పోయారు. ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులకు చెల్లించాల్సిన బకాయిలను ఐదేళ్లూ జగన్ ప్రభుత్వం ఇవ్వలేదు. ప్రైవేటు కళాశాలల్లో ఫీజుల చెల్లింపు పథకాన్ని 2020-21 నుంచే నిలిపివేసింది. అంతకుముందు, అప్పటి వరకు ప్రవేశాలు పొందిన వారికి చెల్లించాల్సిన బకాయిలు రూ.500 కోట్లకుపైగా ఉన్నాయి. వీటిని చెల్లించకపోగా జగన్ సర్కార్ విజిలెన్స్ విచారణ చేయించింది. ఈ నివేదిక వచ్చినా డబ్బులు విడుదల చేయలేదు.
ఆ తర్వాత ఉన్నత విద్యామండలి ద్వారా వన్‌టైం సెటిల్‌మెంట్‌కు యాజమాన్యాలను సంప్రదించింది. మొత్తం బకాయిల్లో 75% ఇస్తామని, దానికే అంగీకరించాలంటూ ఒత్తిడి చేసింది. బకాయిల్లో 75% ఇస్తే చాలని, దీనిపై న్యాయస్థానాలకు వెళ్లబోమని యాజమాన్యాల నుంచి లేఖలు సైతం తీసుకుంది. ఇంతచేసి, ఆ డబ్బులూ ఇవ్వలేదు. ఈ బకాయిలు చెల్లించలేక కొందరు పిల్లలు ధ్రువపత్రాలను కాలేజీలోనే వదిలేశారు. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం కొందరు ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తీసుకున్నారు.
ఐనప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు రూ.700 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసింది. ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఐనప్పటికీ ఫీజు పోరు పేరుతో డ్రామాలకు సిద్ధమవుతున్నారు జగన్. కానీ నిజానికి ఇప్పుడు ఆందోళన చేయాల్సింది కూటమి నాయకులే.











