ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చాణక్యుడు, జగనన్నకు అల్టిమేట్ లెక్కల మాస్టారుగా పేరుగాంచిన విజయసాయిరెడ్డి..ఇప్పుడు అదే లెక్కలతో తన పాత బాస్‌కు మైండ్ బ్లాంక్ అయ్యేలా షాకిచ్చారు! కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటిస్తూ విజయసాయి ఫిక్స్ చేసిన ముహూర్తం చూసి, తాడేపల్లి ప్యాలెస్ అందరూ నోరెళ్లబెట్టారు. గత ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు పరిమితమై, ప్రతిపక్ష హోదా కూడా దక్కక వైసీపీ పీడకలలు కంటుంటే.. సరిగ్గా అదే 11 సంఖ్యతో జగన్ రెడ్డికి సాయిరెడ్డి చేస్తున్న ర్యాగింగ్ మామూలుగా లేదు!
గతంలో దసరాకే పార్టీ పెడతానని చెప్పిన సాయిరెడ్డి, ఇప్పుడు దసరా రోజే తన కొత్త పార్టీ ఆవిర్భావ ముహూర్తాన్ని సగర్వంగా ప్రకటించారు. నవంబర్ 11వ తేదీన , ఉదయం 11 గంటల 11 నిమిషాలకు విజయవాడలోని A-కన్వెన్షన్‌లో కొత్త పార్టీని ఆవిష్కరిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అంటే..11వ నెల, 11వ తేదీ, 11 గంటలు, 11 నిమిషాలు..ఇలా వరుసగా 11:11:11:11 వచ్చేలా డిజైన్ చేసి, వైసీపీ ఓటమి సంఖ్యను ప్రతి సెకను జగనన్నకు గుర్తుచేస్తూ పబ్లిక్‌గా ట్రోల్ చేశారు. 11 అనే మాట వింటేనే గుండెల్లో రైళ్లు పరిగెత్తే వైసీపీ నేతల పచ్చి పుండుపై కారం చల్లినట్లయింది ఈ ముహూర్తం!
కేవలం ముహూర్తంతోనే ఆగితే ఆయన విజయసాయిరెడ్డి ఎందుకవుతారు? పార్టీ ఎజెండా పోస్టర్‌తో జగన్ పాలన మూలాలనే కడిగేశారు. రెండు పార్టీలు, రెండు కుటుంబాల దోపిడీకి ముగింపు పలుకుతాం.. రప్పరప్ప ఫ్యాక్షన్ల నుంచి రాష్ట్రాన్ని కాపాడుతాం అంటూ నేరుగా జగన్‌కే పంచ్‌లు విసిరారు. యువతను కేవలం జేజేలు కొట్టే గుంపులుగా మార్చేశారని, తమ పార్టీని జెన్-జీ నాయకులను తయారుచేసే ఫ్యాక్టరీగా మారుస్తామని చెప్పారు. అంతటితో ఆగకుండా.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సొంత ప్రయోజనాలు చూసుకున్నారంటూ దశకంఠుడి 10 అవలక్షణాలు పేరుతో జగన్ రాజకీయ తీరును ఉతికి ఆరేశారు.
అప్పట్లో జగన్ రెడ్డికి ఆర్థిక, రాజకీయ సలహాదారుగా ఉండి, పార్టీకి అన్ని రకాల లెక్కలు సరిచేసిన విజయసాయిరెడ్డి.. ఇప్పుడు అదే లెక్కల ఫార్ములాను జగన్‌కే రివర్స్ గుచ్చడంతో వైసీపీ క్యాడర్ సైలెంట్ అయిపోయింది. నిన్నటిదాకా తమతోనే ఉండి, లోపలి గుట్టులన్నీ తెలిసిన ముఖ్య నేతే ఈ స్థాయిలో 11 నంబర్‌తో వ్యంగ్యాస్త్రాలు సంధించడంతో..ఈ ర్యాగింగ్‌ను ఎలా తట్టుకోవాలో అర్థం కాక తాడేపల్లి వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి.











