కాజీపేట-విజయవాడ మధ్య ఆదివారం సిఓసిఆర్(కన్‌ఫర్మేటరీ ఆస్కిలోగ్రాఫ్ కార్ రన్) రైలు పరుగు విజయవంతమైంది. ప్రస్తుతం కాజీపేట-విజయవాడకు 3 నుంచి 3.5 గంటల సమయం పడుతోంది. ఈ రూట్‌లో కొత్త రైలు అందుబాటులోకి వస్తే కేవలం రెండు గంటల్లో చేరుకోవచ్చు. రెండు తెలుగు రాజధానుల దూరం మరింతగా తగ్గనుంది. దీనికి సంబంధించిన సికింద్రాబాద్-కాజీపేట్-విజయవాడకు సంబంధించిన ట్రాక్ సామర్ధ్యం పరీక్ష పనులు పూర్తయ్యాయి. అనుకున్నట్లుగా పనులన్నీ పూర్తయితే త్వరలోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు తక్కువ సమయంలో ట్రైన్‌లో చేరుకోవచ్చు.
135 కి.మీ. స్పీడ్‌తో…
135 కిలోమీటర్ల గరిష్ఠ వేగంగో 24 బోగీలతో ఆదివారం ఉదయం కాజీపేటలో ప్రారంభమైన ట్రయల్ రన్ మధ్యాహ్నం 12.30 గంటలకు పూర్తయింది. ప్రస్తుతం ఈ దూరానికి రైళ్లు ప్రయాణించాలంటే 3 నుంచి 3.5 గంటల సమయం పడుతోంది. రైళ్ల గరిష్ఠ వేగం గంటకు 110 కి.మీ. నుంచి 120 కి.మీ వరకు ఉంది. ఇందులో రాజధాని రైళ్ల వేగం మాత్రం గంటకు 120 కి.మీ ఉంది. అదే 135 గరిష్ఠ వేగంతో సికింద్రాబాద్ నుంచి కాజీపేటకు రైలు చేరడానికి గంటన్నర సమయం పడుతోంది. అదే గరిష్ఠ వేగంతో కాజీపేట నుంచి విజయవాడకు చేరుకోవాలంటే రెండు గంటలు పడుతోంది. అంటే మొత్తంగా సికింద్రాబాద్ నుంచి విజయవాడకు పట్టే సమయం మూడున్నర గంటలు మాత్రమే
తెలుగు రాష్ట్రాలకు తగ్గనున్న దూరం..
ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి విజయవాడకు చేరుకోవాలంటే రెండు మార్గాలున్నాయి. ఒకటి కాజీపేట, వరంగల్. మరొకటి నడికుడి మీదుగా మార్గం ఉంది. విజయవాడకు చేరుకోవాలంటే సికింద్రాబాద్ నుంచి దాదాపు ఐదున్నర గంటలు సమయం పడుతోంది. 135 కి.మీ.తో కొత్త రైలు ప్రజలకు ఒకవేళ అందుబాటులోకి వస్తే రెండు గంటల సమయం ఆదా అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ట్రాక్ సామర్ధ్యం పరీక్ష పనులు పూర్తయ్యాయి. గంటలు గంటలు ట్రైన్‌లో కూర్చొని ప్రయాణం చేసే వారి ఇబ్బందులు త్వరలోనే తీరే అవకాశం ఉంది.











