వైసీపీ అధినేత జగన్ రూట్ మార్చారా..?? ఆయన జై కాపు నినాదం ఎత్తుకుంటున్నారా…?? గత ఎన్నికలలో ఘోర ఓటమి తర్వాత ఆయన పీచే ముఢ్ అని రివర్స్ గేర్ వేశారా..? పార్టీలో ఆయన తీసుకుంటున్న ఒక్కో నిర్ణయం… కాపులను ప్రసన్నం చేసుకోవడానికే అనే చర్చ ప్రారంభమయింది.. వైసీపీ కో – ఆర్డినేటర్లు, ఆ పార్టీ ఆఫీసు వ్యవహారాల ఇన్ చార్జ్‌లలో కాపులకు పెద్ద పీట వేస్తున్నారు జగన్.. దీంతో, జగన్ కాపులను మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే చర్చ మొదలయింది..
వారం రోజుల క్రితం వైసీపీ ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా మాజీ మంత్రి కురసాల కన్నబాబుని నియమించారు జగన్. ఈ పోస్ట్ ఎంతో కీలకంగా భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు.. నిన్నమొన్నటివరకు ఈ బాధ్యతలను పార్టీలో ఏ2గా ఉన్న విజయసాయి రెడ్డి నిర్వహించారు.. ఆ తర్వాత జగన్ సొంత బంధువు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డి ఆ బాధ్యతలను చూశారు.. తాజాగా దానిని కాపు సామాజిక వర్గమైన కన్నబాబుని నియమించడం అంటే, ఆ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవడానికే అనే ఫీలర్‌లను వదులుతున్నారు జగన్..
లేటెస్ట్‌గా జగన్ మరో నిర్ణయం కూడా తీసుకున్నారని పార్టీ వర్గాలలో చర్చ నడుస్తోంది.. వైసీపీ కేంద్ర కార్యాలయ ఆఫీసు వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా కాపు సామాజిక వర్గానికి చెందిన నేత పేర్ని నానిని నియమించడానికి జగన్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.. ప్రస్తుతం ఆ పోస్ట్‌ని జగన్ సామాజిక వర్గానికి చెందిన లేళ్ల అప్పిరెడ్డి నిర్వహిస్తున్నారు.. తాజాగా ఆయనకు చెక్ పెట్టి, పేర్ని నానికి ఇవ్వనున్నారని తెలుస్తోంది.. వరసగా రెండు కీలక బాధ్యతలకు కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.. జగన్ నిర్ణయం వెనక ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ఉన్నాయని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు..
2024 ఎన్నికలలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది.. 2019లో ఆయనకి కాపుకాసిన ఈ సామాజిక వర్గం, అయిదేళ్ల తర్వాత రివర్స్ అయ్యారని ఓట్ల లెక్కలు చెబుతున్న పాఠాలు.. 2019 నుండి 2024 మధ్య కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం వైసీపీకి మైనస్‌గా మారింది.. ఆ తర్వాత అధినేత పవన్ కళ్యాణ్‌ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బాగా ఇబ్బందిపెట్టారు.. ఆయనని కనీసం వైజాగ్ ఎయిర్ పోర్ట్ దాటి మీటింగ్‌కి హాజరు కానివ్వకుండా చేశారు.. ఇక, పవన్ పెళ్లిళ్లపై జగన్ చేసిన కామెంట్స్ ఎంతటి దుమారం రేపాయో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.. టీడీపీకి సహజ ఓటు బ్యాంక్ అయిన బీసీలకు జనసేన అధినేత పవన్‌తో యాడ్ అయిన కాపు సామాజిక వర్గం కూడా కలిసి రావడంతో ఊహించని ఫలితాలు దక్కాయనేది ఓపెన్ ఫ్యాక్ట్.. అందుకే, జగన్ తాజాగా కాపులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని చెబుతున్నారు. మరి, జగన్ ఎత్తులు ఫలిస్తాయా.? లేదా..?? అనేది చూడాలి..











