విజయవాడ: నున్న బైపాస్ లో జరిగిన కాల్పుల ఘటనలో పోలీస్ శాఖ ఉద్యోగి మహేష్ అక్కడిక్కడే చనిపోయారు. మహేష్ తో పాటు మద్యం సేవించిన హరి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హరి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఈ కేసులో కొంత పురోగతి సాధించారు. కాల్పుల ఘటనకు ముందు ఇద్దరు అనుమానిత వ్యక్తులు తమ వద్దకు మూడు సార్లు వచ్చారని హరి పోలీసులకు తెలిపారు. మూడో సారి తుపాకి తీసి పాయింట్ బ్లాంక్ లో మహేష్ పై ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. మహేష్ గొంతులోంచి తూటా దూసుకుపోవడంతో అక్కడిక్కడే చనిపోయారు. స్కూటీపై వచ్చి కాల్పులు జరిపిన దుండగులు మహేష్ కారులో పరారయ్యారు. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
అతని చావు వెనుక ఆమె హస్తం ఉందా?
కాల్పుల ఘటనలో చనిపోయిన మహేష్ కు 2015లో వివాహం అయింది. ఏడాదికే విడాకులు తీసుకున్నారు. ఆ తరవాత మహేష్ ఓ డాక్టరుతో ప్రేమలో పడ్డాడని తెలిసింది. ఇద్దరిదీ వేర్వేరు కులాలైనా రెండు కుటుంబాలూ పెళ్లికి అంగీకరించాయని మహేష్ పిన్ని వివరించారు. అయితే మహేష్ కు ఎలాంటి రియల్ ఎస్టేట్ దందాలు లేవని తెలుస్తోంది. ఇంతకీ మహేష్ పై కాల్పులకు ఏవైనా అక్రమ సంబంధాలు కారణమా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.
ఆ మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మహేష్ తో ప్రేమలో మునిగితేలుతున్న డాక్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారిస్తున్నారు. అయితే సమాచారం ఎక్కడా బయటకు పొక్కనీయడం లేదు. మహేష్ పై కాల్పులకు పాల్పడింది ఎవరు? దాని వెనుక పనిచేసిన శక్తులు ఏమిటి అనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. అయితే ఘటనా స్థలంలో పెద్దగా ఆధారాలు దొరక్కపోవడంతో కేసును అనేక కోణాల్లో విచారిస్తున్నారు. మహేష్ కు ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా అనే కోణంలోనూ విచారణ సాగుతోంది.
గతంలో సస్పెండ్ అయిన మహేష్
గతంలో ఓ పోలీస్ అధికారితో అసభ్యంగా ప్రవర్తించిన మహేష్ ను కొన్నాళ్లు సస్పెండ్ చేశారు. ఆ తరవాత విధుల్లో చేరిన మహేష్ సీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే కార్యాలయంలో ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా? లేదంటే మొదటి పెళ్లి విడాకుల దాకా ఎందుకువెళ్లింది. డాక్టర్ తో వివాహం ఆ కుటుంబం వారికి ఇష్టం లేదా? అనే కోణాల్లోనూ పోలీసులు విచారణ సాగిస్తున్నారు. త్వరలోనే కేసును కొలిక్కి తెచ్చేందుకు పోలీసులు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా సీరియస్ గా తీసుకున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా విజయవాడలోనూ గన్ కల్చర్ ఎంటర్ అవడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.











