(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న విజయనగరంలో కొత్త కుంపటి రాజుకుంటున్నట్లు తెలుస్తోంది. జిల్లా తెలుగుదేశం పార్టీకి అంతా తానై వ్యవహరించిన పూసపాటి అశోక్ గజపతిరాజు గత అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమార్తె అదితి గజపతిని బరిలో దించేందుకు అప్పటి సిటింగ్ ఎమ్మెల్యే మీసాల గీతను పక్కన పెట్టారన్న ఆరోపణలున్నాయి. గీత వర్గం జిల్లా కేంద్రంలో కొత్త గూడు ఏర్పాటుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అశోక్ గజపతి వ్యవహార తీరుపై ఇప్పటికే విభేదిస్తున్న గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కె. ఎ. నాయుడు కూడా గీతకు మద్దతు పలుకుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలోనే నాయుడు ఇటీవల తన అనుచరులతో కూడి నిమ్మాడలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో కలిసి మంతనాలు చేసినట్లు తెలిసింది. ఇదే జరిగితే కొన్ని దశాబ్ధాలుగా తెలుగుదేశం పార్టీకి అంతా తానై, తన బంగ్లానే జిల్లా కార్యాలయంగా మార్చుకున్న అశోక్ హవాకు చెక్ చెప్పినట్లు అవుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
కొత్త పదవులతో ..
తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో అందరూ డీలా పడటంతో కొత్త పదవులు ఉత్సాహం తెస్తాయనుకుంటే సరికొత్త తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయనే గుసగుసలు ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఒకప్పుడు రాష్ట్రంలో టీడీపీ బలంగా ఉన్న జిల్లాల్లో విజయనగరం ఒకటి. పార్టీకి బలమైన నాయకత్వంతో పాటు కేడర్ కూడా ఉండేది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో మంత్రులుగా చేసిన వారు కూడా జిల్లాలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ పరాజయం తర్వాత పార్టీని పట్టించుకున్న వారే కరువయ్యారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు చేపట్టిన పార్టీ పదవుల పందేరం కేడర్లో కొంత ఉత్సాహం తీసుకొచ్చినా, అంతకు మించి తలనొప్పులు కూడా తెచ్చిపెట్టాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పెదవులతో పలకరింత ..
విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీలో పరిస్థితి ప్రస్తుతం ‘పెదవులతో పలకరింత .. కనులతో ఛీత్కరింత’గా ఉందని ఆ పార్టీ నాయకులు బాహాటంగా అభిప్రాయపడుతున్నారు. జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు పైకి నవ్వుతూ పలకరించుకుంటున్నా, తెర వెనుక మాత్రం ఎవరి స్కెచ్‌లు వారు గీసుకుంటున్నారట. మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నవారికి పదవులు ఇవ్వకుండా కొత్తవారికి పట్టం కట్టడంపై ఓ వర్గం రుసరుసలాడుతున్నట్టు సమాచారం. జిల్లాలో టీడీపీకి పార్టీ ఆఫీస్ కూడా లేదు. అశోక్‌గజపతి రాజు బంగ్లానే పార్టీ ఆఫీసుగా ఉంటోంది. సుజయ్‌కృష్ణ రంగారావు మంత్రి అయిన సమయంలో క్యాంప్ కార్యాలయం పేరుతో విజయనగరంలో ఆఫీసు పెట్టడానికి ప్రయత్నించి వెనక్కి తగ్గారు. తాను ఆశించిన పార్టీ పదవి దక్కని గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు ఓ భవనానికి విజయనగరం పార్లమెంటరీ టీడీపీ ఆఫీస్‌గా బోర్డు పెట్టి తన నిరసన తెలిపారు. విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత కూడా వేరు కుంపటి పెట్టేందుకు ఇప్పుడు సిద్ధమవ్వడంతో వీరంతా ఒకే గూటికి చేరే అవకాశం కనిపిస్తోందన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మీసాల గీత ఇటీవల తన అనుచరులతో కలిసి ‘విజయనగరంలో గత ప్రభుత్వ హయాంలో మంజూరైన వారందరికి ఇల్లు , సబ్సిడీ ఇవ్వాలని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ వర్మను నేరుగా కలవడం’ ఇప్పుడు చర్చనీయాంశమైంది. వేరు కుంపటికి ఆమె రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ఊహాగానాలకు బలం చేకూరింది.
జిల్లాలో ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా పార్టీ పరిస్థితి మారుతోందని సర్వత్రా వినిపిస్తోంది. రాష్ట్ర అధిష్టానం ముఖ్యంగా చంద్రబాబు ఈ సమస్యపై ఎట్ల స్పందిస్తారో వేచి చూడాలి.
Must Read ;- పార్టీకి నష్టం లేకుండా , ఎవ్వరనీ నొప్పించకుండా.. టీడీపీ ముందు మరో సవాల్