బెజవాడ దుర్గగుడి రథంపై ఉన్న వెండి విగ్రహాల చోరీ వ్యవహారం ఒక్క అడుగూ ముందుకు పడలేదు. విజయవాడ పోలీసులకు ఈ కేసు పెద్ద సవాల్ గా మారింది. వంద మంది అనుమానితులను విచారించినా ఒక్క క్లూ కూడా దొరకలేదు. కానీ దొంగతనం ఎప్పుడు జరిగి ఉండవచ్చో మాత్రం అంచనాకు రాగలిగారని తెలుస్తోంది. పోలీసుల ప్రయత్నాలు కూడా ఫలిచేలా లేవు. ఇక ఆ వెండి సింహాల దొంగలను అమ్మవారే పట్టించాలని భక్తులు దుర్గమ్మకు మొక్కుతున్నారు.
ఎందుకు జటిలంగా మారింది
కనకదుర్గమ్మ గుడి రథంపై ఉండాల్సిన నాలుగు వెండి సింహాల ప్రతిమల్లో మూడు చోరీకి గురయ్యాయి. ఈ విషయం దేశ వ్యాప్తంగానూ సంచలనంగా మారింది. ఈ చోరీకి కొద్ది రోజుల ముందు అంతర్వేదిలో రథం దహనం కావడం కూడా హిందువుల్లో ఆగ్రహాన్ని పెంచింది. హిందూ దేవాలయాలపై వరుసగా 18 దాడులు జరిగినా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో దుర్గగుడి కేసును ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.
చోరీని చేధించేందుకు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. వారంతా నెల రోజులుగా అదే పనిలో ఉన్నారు. కానీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. అంటే చోరీ చేసిన దొంగలు, దొంగతనాల్లో ఆరితేరినవారై ఉండవచ్చు. అందుకే పోలీసులకు ఒక్క క్లూ కూడా వదల్లేదని భావించవచ్చు. కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కపోవడంతో కేసు జటిలంగా మారింది.
దొంగతనం ఎప్పుడు జరిగిందంటే?
ఈ ఏడాది జూన్ 26వ తేదీన రెండు వెండి సింహాల ప్రతిమలు మాయమైనట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. మరో రెండు సింహాల ప్రతిమలను 29వ తేదీన చోరీకి ప్రయత్నించి ఒకటి మాత్రమే తీసుకెళ్లగలిగారని ప్రత్యేక బృదం తేల్చింది. అయితే దొంగతనానికి పాల్పడింది ఎవరన్నది మాత్రం పోలీసులు తేల్చలేకపోతున్నారు. ఫోరెన్సిక్ నివేదికలోనూ పోలీసులకు క్లూ దొరకలేదు. దీంతో పోలీసులు కేసును చేధించలేక తలలు పట్టుకుంటున్నారు.
కనీసం ఒక్క ఆధారం దొరికితేనే…
దుర్గగుడి వెండి సింహాల ప్రతిమల చోరీ కేసులో ఎలాంటి ఆధారం దొరక్కపోవడంతో పోలీసులు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నారు. వంద మంది అనుమానితులను విచారించినా ఒక్క క్లూ దొరక్కపోవడంతో కేసుపై ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై పోలీసు అధికారులు చర్చిస్తున్నారు. అయితే వెండి సింహాలను ఇంటి దొంగలు మాయం చేయడం వల్లే పోలీసులు గుర్తించలేకపోతున్నారనే అనుమానాలు వస్తున్నాయి. సీసీటీవీ కెమెరాలు ఉన్నా వాటికి బ్యాకప్ కరెంటు లేకపోవడంతో అవి పనిచేయలేదని దేవాలయ అధికారులు చెబుతున్నారు. ఈ విషయం అంటే సీసీ కెమెరాలకు బ్యాకప్ లేకుండా పోయి ఎప్పటి నుంచి పనిచేయకుండా పోతాయో అనే విషయం తెలిసిన వారే దొంగతనానికి పాల్పడి ఉండవచ్చనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
రాజకీయ జోక్యం ఉందా?
దుర్గగుడి వెండి రథం వెండి సింహాల ప్రతిమలు చోరీ వెనుక అయిన వారి హస్తం ఉందనే అనుమానాలు వస్తున్నాయి. వారిని కొన్ని రాజకీయ శక్తులు కాపాడుతున్నాయని ప్రజలు అనుమానిస్తున్నారు. వారిని పోలీసులు పట్టుకుంటే ప్రభుత్వ పరువు పోతుందనే భయపడుతోందని, అందుకే అసలు దొంగలను రక్షించే ప్రయత్నం జరుగుతోందని ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నాయి. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడంటే ఇదేనేమో….











