మూడు రాజధానులు కావాలంటూ అమరావతిలో రైతుల మధ్య చిచ్చుపెట్టేందుకు కొందరు చేసిన ప్రయత్నాలను స్థానిక రైతులు నిలదీసిన సంగతి తెలిసిందే. ఎస్సీలను కులం పేరుతో దూషించాలంటూ ఏడుగురు రైతులపై కేసులు నమోదు చేశారు. వీరిని నరసరావుపేట సబ్ జైలుకు తరలించారు. అక్కడ కోవిడ్ టెస్టులు నిర్వహించి గుంటూరు జిల్లా జైలుకు తరలించే క్రమంలో ఎస్కార్టుగా వచ్చిన పోలీసులు రైతుల చేతులకు బేడీలు వేశారు. దీనిపై మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చాయి. అనేక ప్రజా సంఘాలు ఖండించాయి. దీంతో ప్రభుత్వం పరువు బజారున పడింది. దిగి వచ్చిన పోలీసు ఉన్నత అధికారులు ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా…
అమరావతి రైతుల చేతికి బేడీలు వేసిన వ్యవహారం ఉన్నత అధికారులకు, వైసీపీ ప్రభుత్వానికి తెలియకుండా జరిగిందని భావిస్తే అంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదు. అమరావతి రైతులకు బేడీలు వేసి మీడియాలో ప్రచారం చేయడం ద్వారా ఉద్యమాన్ని అణచివేయాలని కొందరు పెద్దలు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది.
రైతులకు బేడీల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోని మీడియాతోపాటు, జాతీయ మీడియా భారీగా కవర్ చేసింది. దీంతో వైసీపీ పెద్దల పరువు ఢిల్లీ స్థాయిలో పోయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు, ఇదేమీ వారికి తెలియదన్నట్టు నటిస్తున్నారు. అవునా అలా జరిగిందా? అనే ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఉన్నత అధికారి- విధుల్లో పాల్గొన్న ఆరుగురు ఎస్కార్ట్ పోలీసులను సస్పెండ్ చేశారు.
ఇక్కడ ఉన్నత అధికారుల ఆదేశాలు లేకుండా పోలీసులు రైతుల చేతికి బేడీలు వేశారని నమ్మలేం. ఎందుకంటే ఇలాంటి వ్యవహారాల్లో పోలీసులు చాలా జాగ్రత్తగా ఉంటారు. పై స్థాయి అధికారుల నుంచి వచ్చే ఆదేశాలను తూ.చ తప్పకుండా పాటిస్తారు. రైతులకు బేడీల వ్యవహారంలో ఉన్నత అధికారులు తప్పించుకునేందుకు పోలీసులపై వేటు వేశారనే విమర్శలు వస్తున్నాయి.











