ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం విజయనగరం పురవీధుల్లో అంబరాన్ని తాకింది. మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభ స్వాగతం పలుకుతుండగా పాలధార , ఐరావతం, అంజలి రథం, బెస్తవారి వల ఒకటి తరువాత ఒకటి నడుస్తుండగా అమ్మవారి రూపం దాల్చిన ప్రధాన పూజారి వెంకటరావుకు ఆస్థానం కల్పించిన సిరిమాను మంగళవారం సాయంత్రం 3.45 గంటలకు బయలు దేరింది. పైడితల్లి అమ్మవారి ప్రధాన ఆలయం చదురు గుడి నుండి తన పుట్టిల్లైన పూసపాటి వంశీయుల విజయనగరం కోట వరకు పురవీధుల్లో ఊరేగుతూ ముమ్మారు తిరిగింది. జై పైడితల్లి అంటూ భక్తుల జయజయ ధ్వానాల మధ్య 5గంటలకు ఊరేగింపు ముగిసింది.
కరోనా నేపధ్యంలో..
కరోనా నేపధ్యంలో ఈ ఏడాది భక్తులకు సిరిమాను సంబరం ప్రత్యక్ష వీక్షణకు అవకాశం ఇవ్వకపోవడం, పట్టణంలో 144 సెక్షన్ విధించడం, పట్టణ సరిహద్దుల్లోనే మంగళవారం వేకువజాము నుండే రాకపోకలను నిషేధించడం తదితర కారణాలతో పట్టణం బోసిపోయింది.
వీవీఐపీల తాకిడి
సిరిమాను సంబరానికి ఈ ఏడాది కూడా వీవీఐపీల తాకిడి తప్పలేదు. స్థానిక మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సతీసమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఉత్తరాంధ్రకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, మాన్సాస్ ఛైర్‌పర్సన్ సంచైత గజపతి, ఆనంద గజపతి సతీమణి సుధా గజపతి, కుమార్తె ఊర్మిళ గజపతి తదితరులు అమ్మవారిని దర్శించుకుని సిరిమాను సంబరంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డా. హరిజవహర్ లాల్ , ఎస్పీ బి. రాజకుమారిలు ఆద్యంతం ముందుండి సిరిమానోత్సవం పర్యవేక్షించారు. ఉత్సవం ప్రశాంతంగా ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.











