పై ఫొటోలో చేతులకు బేడీలతో కనిపిస్తున్న వ్యక్తులు కరడుగట్టిన నేరస్తులు కాదు. దొంగలు అంతకంటే కాదు. హత్యలు, అత్యాచారాలకు పాల్పడ్డ వారు అసలే కాదు. మరి వారి చేతులకు బేడీలు ఎందుకు వేసినట్టు? వారు చేసిన పాపం ఏమిటో తెలుసా? గత ప్రభుత్వ హయాంలో రాజధాని కోసం భూములివ్వండి అనగానే… క్యూ కట్టి మరీ బంగారం పండే భూములను నిలువునా త్యాగం చేసి… ఇప్పుడు అవే భూముల్లో రాజధానిని నిర్మించాలని 300 రోజులకు పైగా డిమాండ్ చేయడమే. అంతేకాకుండా ఎవరో చెప్పినట్టుగా… ఎక్కడి నుంచో కట్ట కట్టుకుని అమరావతి పరిరక్షణ ఉద్యమానికి వ్యతిరేకంగా నినదించేందుకు వచ్చే వారిని నిలువరించడమే. నిజమే.. ఈ రెండు కారణాలతో అరెస్ట్ చేసిన ఈ రైతులకు పోలీసులు ఏకంగా బేడీలు వేసి మరీ బస్కెక్కించారు. అంతేనా… అల్లంత దూరాన ఉన్న గుంటూరుకు అలాగే చేతులకు బేడీలతోనే తీసుకెళ్లి జిల్లా జైలుకు తరలించారు. ఈ విషయంపై ఇదెక్కడి న్యాయం అనే ప్రశ్నించే నాథుడే కరువవడం నిజంగానే దారుణం.
300 రోజులకు పైగా ఉద్యమం
ఇక అసలు విషయానికి వస్తే… 300 రోజులకు పైగా అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులంతా ఉద్యమాలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ ఉద్యమాన్ని పట్టించుకోకుంటే దానికదే తగ్గిపోతుంది కదా అని జగన్ సర్కారు యోచించినట్టుంది. అయితే ఏడాదికి మూడు పంటలు పండే బంగారం లాంటి భూములను త్యాగం చేసిన రైతులు… ప్రభుత్వాలు పట్టించుకోనంత మాత్రాన తమ ఉద్యమాన్ని వదిలేస్తారా? ఇక్కడా అదే జరిగింది. ప్రభుత్వం పట్టించుకోకున్నా, తమను చులకనగా మాట్లాడుతున్నా ఏమాత్రం వెరవక ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.
రైతులకు టీటీపీ నేతల భరోసా
దీంతో ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు పోటీ ఉద్యమాలను రంగంలోకి దించేశారు. అలాంటి ఓ ఉద్యమ శిబిరానికి సుదూర ప్రాంతాలకు చెందిన వారిని ట్రాక్టర్లు, ఆటోలలో తరలిస్తున్నారు. తమ భూములను త్యాగం చేసి, రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న తమపైకి ఇలాంటి వారిని వదలడమా? అన్న బాధతో , అలా ఆటోల్లో వస్తున్న కొందరిని రాజధాని రైతులు అడ్డగించారు. ఈ సందర్భంగా తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటకు కారణమయ్యారని ఆరోపించడంతో పాటు ఆటోల్లో వెళుతున్న దళితులను కులం పేరుతో దూషించారంటూ రాజధాని రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. అంతే… ఇక ముందూ వెనుకా చూసుకోకుండా కృష్ణాయపాలేనికి చెందిన కొందరు రాజధాని రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి చేతులకు బేడీలు వేసి మరీ బస్సెక్కించారు. అలాగే బేడీలతోనే వారిని సబ్ జైలు దాకా తరలించారు. ఈ దృశ్యాలు చూసిన పలువురు కంటతడి పెట్టడం మినహా ఏమీ చేయలేకపోయారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు ఆలపాటి రాజా, మాణిక్యాలరావు, కోవెలమూడి రవీంద్రలు రాజధాని రైతులను పరామర్శించారు. మీ వెంట మేమున్నామంటూ భరోసా ఇచ్చారు.











