ప్రపంచం దృష్టి అంతా ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల మీదే ఉంది. అమెరికా అధ్యక్ష పీఠాన్ని ఎవరు అధిష్ఠించబోతున్నరన్నదే ఆసక్తికర అంశం.
రిపబ్లికన్ పార్టీ తరపున ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ తరుపున జో బిడెన్ లు పోటీ పడుతున్నారు. నవంబరు 3న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరి హవా ఎలా ఉండబోతోంది? ఎవరి జాతకాలు ఎలా ఉన్నాయి అనే విషయాలను మనం తెలుసుకుందాం. పరాశర, భృగునాడీ విధానంలో ఫలితాలను విశ్లేషణ చేసుకుందాం. మా జ్యోతిష పండితులు లియో న్యూస్ కోసం చేసిన ప్రత్యేక విశ్లేషణ ఇది.
డోనాల్డ్ ట్రంప్
మొదట ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జాతకాన్ని చూద్దాం. ఆయన జూన్ 14, 1946లో జమైకాలో పుట్టారు. పుట్టిన సమయం 10.54 గంటలు. మనకు ఇంటర్ నెట్ లో లభించిన సమాచారమే దీనికి ఆధారం. ఆ ప్రకారం చూస్తే ట్రంప్ జ్యేష్ఠా నక్షత్రంలో జన్మించారు. రాశి వృశ్చికం, లగ్నం సింహం. లగ్నంలో కుజుడు ఉన్నాడంటేనే ఆయన యారగెన్సీ ఏమిటో మనకు అర్థమవుతుంది. సింహ లగ్నం అంటేనే ఎవరికీ లొంగని స్వభావం. అందులో కుజుడు ఉన్నాడంటే దాని తీవ్రతను చాలా ఎక్కువ చేస్తాడు. దాదాపు ఏడున్నరేళ్లుగా ఆయనకు ఏలినాటి శని నడిచింది. గత జనవరితో ఈ ఏడున్నరేళ్ల శని వెళ్లిపోయింది.
మరో విశేషమేమిటంటే ఆయన గ్రహ కుండలి చూస్తుంటే కాలసర్ప దోషంలో ఆయన ఉన్నారు. అన్ని గ్రహాలు రాహుకేతువుల బంధనంలో ఉన్నాయి. కన్యా రాశిలో గురువు ఆయనలోని అఖండమైన తెలివి తేటలను సూచిస్తోంది. ఆయన జాతక చక్రంలో ఉన్న రాహువు మీదకు ప్రస్తుతం గోచార రాహువు వచ్చాడు. అదే ఆయనకు ఇబ్బందికరం. గత నెలలో రాహుకేతువులు మారిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన జాతక పరిస్థితి ఏమీ బాగోలేదు. ఈ పరిస్థితి ఆయనకు ఏడాది పాటు ఉంటుంది. చంద్ర కేతువుల కలయిక ఆయనలోని మొండితనాన్ని సూచిస్తోంది. అలాగే కర్మ కారకుడు శనికి జాతకంలోని కేతువుతో సంబంధం ఉంది.
జాతక కేతువు వృశ్చికంలో ఉన్నాడు. ఆ జాతక కేతువు మీదకు గోచర కేతువు వచ్చి చేరాడు. కేతువు స్వభావమే ఆటంకాలు కల్పించడం. ఈ రెండు కేతువుల ప్రభావం ఆయన పదవిపై తీవ్రంగా పడనుంది. ప్రస్తుతం ఆయనకు గురు మహాదశ జరుగుతోంది. 2032 వరకు ఈ దశ కొనసాగుతుంది. 2016లో ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో ఆయనకు ఏలినాటి శని నడుస్తోంది. కానీ ఆ సమయంలో జాతక గురువు మీదకు గోచార గురువు వచ్చాడు. ఆ గురు ప్రభావం, దానికి తోడు గురు మహాదశ ప్రభావం ఆయనను ఏలినాటి శని దశలో కూడా అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టింది.
జో బిడెన్
జోబిడెన్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా అమెరికా అధ్యక్ష బరిలో ఉన్నారు. ఆయన 1942 నవంబరు 20న పెన్సిల్వేనియాలోని స్క్రాన్ టన్ నగరంలో జన్మించారు. పుట్టిన సమయం 12 గంటలు. అశ్వని నక్షత్రం మేషరాశి, ధనుర్లగ్నంలో పుట్టారు. ఒకరకంగా చెప్పాలంటే ఆయనది మహర్జాతకం. ఎందుకంటే గురువు తన ఉచ్ఛ స్థానమైన కర్కాటక రాశిలో ఉన్నాడు. పైగా చంద్రుడి నుంచి కేంద్ర స్థానంలో ఉండి గజకేసరి యోగాన్ని పొందారు. అంతేకాదండోయ్ ఆయనకు ప్రస్తుతం నడుస్తున్న దశ కూడా గురు మహాదశే. ఏ జాతకుడికైనా ఇంతకంటే కావలసింది ఏముంటుంది చెప్పండి.కాకపోతే ఈ దశ వచ్చే ఏడాది అక్టోబరు 4వ తేదీతో ముగిసిపోతుంది. అంటే 2005లో ఈ దశ ప్రారంభమైంది.
గురువుకు సంబంధించిన లగ్నం, గురు బలం చూస్తుంటేనే ఆయనది విశేషమైన జాతకంగా చెప్పవచ్చు. గురువు ఉన్న స్థానాన్ని బట్టి ఆయనను మృదు స్వభావిగా చెప్పాల్సి ఉంటుంది. కాకపోతే కొంత కుజుడి సొంత రాశి మేషరాశి ప్రభావం కూడా ఉంటుంది. ఆ కుజుడు కూడా చంద్రుడి నుంచి ఏడో స్థానంలో ఉండి చంద్రమంగళ యోగాన్ని కూడా ప్రసాదించాడు. కాకపోతే వచ్చే ఏడాది అక్టోబరు 4 నుంచి ఆయనకు శని మహాదశ ప్రారంభమవుతోంది. ఇది 19 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. శని తన మిత్రుడైన శుక్రుడి ఇంట్లో వృషభరాశిలో ఉన్నాడు. లగ్నం నుంచి 6వ స్థానంలో ఉండటం వల్ల ఈ శని మహాదశ కూడా ఆయనకు విశేషంగా యోగిస్తుంది.
కచ్చితంగా అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టే జాతకం ఈయనది. కాకపోతే గత నెలలో గోచార కేతువు ధనస్సు రాశి నుంచి వృశ్చిక రాశిలోకి మారిన సంగతి తెలిసిందే. ఈ కేతువు కర్కాటక రాశిలో ఉన్న జాతక గురువుతో కనెక్ట్ అవుతోంది. అందువల్ల ఓ ఏడాదిన్నర పాటు ఆయన కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే దానికి కొంత ఊరట నవంబరు నెల 21వ తేదీ నుంచి లభిస్తుంది. గురువు మకర రాశిలో వెళ్లి జాతక శనికి బలాన్ని చేకూరుస్తున్నాడు. ఆయన అధికార పీఠాన్ని అధిష్ఠించినా ఓ ఏడాదిన్నర పాటు ఆయన శత్రువు నుంచి ముప్పును ఎదుర్కోవలసి ఉంటుంది.
ఫలితం ఎలా ఉండబోతోంది?
మనకు ఇంటర్ నెట్ ఆధారంగా లభించిన సమాచారంతో మాత్రమే ఈ జ్యోతిష ఫలితాన్ని చెప్పడం జరిగింది. ఈ ఇద్దరి జాతకాలనూ పరిశీలిస్తే జో బిడెన్ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల అమెరికా అధ్యక్ష పీఠాన్ని జో బిడెన్ అధిరోహించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ట్రంప్ ది ఓటమిని అంగీకరించే స్వభావం కాదు. ఏదో విధంగా ఆ పదవిని చేపట్టటానికి ఆయన ప్రయత్నం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఆయన ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. కాకపోతే అమెరికాలో రాజకీయ అస్థిరత్వానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
-హేమసుందర్ పామర్తి











