తెలంగాణ రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరద బాధితులకు సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ కొందరు గులాబీ నేతలు మాత్రం ఆ సాయాన్ని గద్దలు తన్నుకు పోయినట్లు తన్నుకు పోతున్నారని కాంగ్రెస్ నేత ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు.
గ్రేటర్ లో వరద సాయాన్ని గులాబీ గద్దలు స్వాహా చేస్తున్నాయని రేవంత్ ఆరోపించారు. శవాలపై పేలాలు ఏరుకున్న చందంగా గులాబీ నేతలు వ్యవహరిస్తున్నారు. వరద బాధితుల సాయంలోనూ కమీషన్లు దండుకుంటున్నారు. అసలు మీ ప్రభుత్వంలోని కార్పొరేటర్లు, స్థానిక నాయకులను చూస్తే.. వీళ్లు మనుషులేనా అసలు వీరికి మానవత్వం ఉందా అనిపిస్తోంది అంటూ రేవంత్ ఆరోపించారు.
ఓట్లు దండుకోవాలన్న దురేద్దశం ఉంది తప్ప గ్రేటర్ ప్రజలను ఆదుకుందామని ఏ కోశాన లేదంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీ నాయకుల దుర్బుద్దే ఈ కుంభకోణానికి కారణమని రేవంత్ పేర్కొన్నారు. నిజంగా అధికార పక్షానికి చిత్తశుద్ధి ఉంటే కనుక పరిహారాన్ని బాధితుల బ్యాంకు ఖాతాల్లో వేసేవారు. అంతే కానీ ఇలా అత్యుత్సాహాన్ని ప్రదర్శించి మీ జేబుల్లో వేసుకునే వారు కాదంటూ ఆయన విరుచుకుపడ్డారు. మీ అత్యుత్సాహం వల్ల పరిహారం నిలిపేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
ఇప్పటికైనా మీరు వరద బాధితులకు సాయం చేయాలనుకుంటే వారికి తిరిగి పరిహారం పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి అని రేవంత్ తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన నాయకుల దోపిడి పై విజిలెన్స్ విచారణ చేపట్టాలి. నాయకులపై క్షేత్రస్థాయి ఉద్యమానికి సిద్ధమవుతామంటూ రేవంత్ ప్రభుత్వానికి తెలిపారు.