పేదవారికి కార్పొరేట్ వైద్యం అందుతోందంటే డాక్టర్ వైఎస్ చలవేనని డిప్యూటీ సీఎం, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేటలో నూతనంగా నిర్మించనున్న 50 పడకల ఆసుపత్రికి సోమవారం మధ్యాహ్నం ఆయన శంకుస్థాపన చేశారు. నవజాత శిశువుల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన వార్డును, దంతవైద్య విభాగానికి సంబంధించిన నూతన సాంకేతిక పరికరాలను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ నరసన్నపేట ఆసుపత్రిని 50 పడకల నుంచి వంద పడకల స్థాయికి పెంపు చేస్తామన్నారు. వెయ్యి రూపాయలు దాటిన ప్రతి చికిత్స ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెచ్చింది జగన్మోహన్ రెడ్డి మాత్రమేనన్నారు.
నెలరోజుల్లోనే కిడ్నీ రీసెర్చ్ సెంటర్
అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసి, పలాసలోనే ప్రత్యేకంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం తమదేనని కృష్ణ దాస్ అన్నారు. రూ.40 కోట్లతో త్వరలోనే నరసన్నపేటలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానికులు, వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.











