శ్రీకాళహస్తి పట్టణంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం చినికి చినికి గాలివానగా మారింది. ఈ వివాదంలో ఓ వర్గానికి మద్దతుగా కడప, కర్నూలుకు చెందిన వారిగా భావిస్తున్నగూండాలు రంగ ప్రవేశం చేశారు. స్థానికులు కొంతమందితో కలిసి వారు అర్ధరాత్రి వీర విహారం చేశారు. హద్దుల గోడను కూల్చి వేశారు. అడ్డుకున్న రిటైర్డ్ డిఎస్పీని చితకబాదారు. చంపడానికి ప్రయత్నించారు. ఈ సంఘటనకు సంబంధించి బాధితుల కథనం మేరకు..
శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన నరసింహ నాయుడుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీకాళహస్తి పానగల్ రాజా వారి వద్ద 1976లో నరసింహనాయుడు కొనుగోలు చేసిన భూమిలో సర్వే నెంబర్ 201/2dలో రెండు ఎకరాలను మొదటి భార్య కుమారుడు వంశీకృష్ణ కు, సర్వే నంబరు 201/2ఈ లో 2.94 సెంట్లను రెండో భార్య కుమారుడు పార్థసారథి కి చెందేలా భాగ పరిష్కారం చేశారు. అన్నకు ఇచ్చిన రెండు ఎకరాల భూమిలో 15 అడుగుల మేర తమ్ముడు పార్థసారథి ఓ నిర్మాణం చేపట్టారు. ఈ విషయమై నెలకొన్న వివాదంలో వారి బంధువులు పంచాయతీ నిర్వహించారు. స్థానికంగా కొంతమంది పెద్ద మనుషులు ద్వారా కూడా పంచాయతీ జరిగింది.
కానీ ఇద్దరి మధ్య సమస్య ఒక కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో అన్న వంశీకృష్ణ రెవెన్యూ అధికారుల ద్వారా తన రికార్డుల ప్రకారం సర్వే చేయించి హద్దు రాళ్ళు నాటించాడు. ఆ మేరకు ప్రహరీ గోడ నిర్మాణం చేశారు. దీంతో ఆగ్రహించిన తమ్ముడు పార్థసారథి కొంతమంది అధికార పార్టీ నాయకుల అండతో పోలీసుల ద్వారా పంచాయతీ చేయించినట్లు తెలిసింది. ఈ పంచాయతీలో రెండు ఎకరాల్లో 40 అడుగుల రోడ్డుకు స్థలం వదిలేయాలని తమ్ముడు పార్థసారథి డిమాండ్ చేశారు. ఆ మేరకు స్థలానికి మార్కెట్ ధర చెల్లిస్తే ఇవ్వడానికి తనకు అభ్యంతరం లేదని అన్న వంశీకృష్ణ చెప్పాడు. ఇందుకు తమ్ముడు పార్థసారథి అంగీకరించలేదు. దీంతో పోలీసుల వద్ద పంచాయతీ మరో రోజుకు వాయిదా పడింది.
ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తమ్ముడు పార్థసారథికి చెందిన కొంతమంది వ్యక్తులు ఆ స్థలంలోకి ప్రవేశించారు. మద్యం సేవించి వీరంగం సృష్టించారు. జెసిబి సాయంతో హద్దు ప్రహరీ గోడను కూల్చడానికి ప్రయత్నించారు. స్థానికుల నుంచి ఈ విషయం తెలుసుకున్న అన్న వంశీకృష్ణ భార్య శ్రీదేవి, ఆమె తండ్రి, రిటైర్డ్ డి.ఎస్.పి భాస్కర్ నాయుడు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంతలో ఈ విషయాన్ని స్థానిక పోలీసులతో పాటు వంద నెంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. వంశీకృష్ణ భార్య, మామ సంఘటనా స్థలానికి చేరుకునే లోపే పోలీసులు కూడా చేరుకొని ప్రహరీ గోడ కూల్చివేతను అడ్డుకున్నారు.
పోలీసుల రాకను గుర్తించిన కొంతమంది అక్కడి నుంచి జారుకున్నారు. ఈ సమయంలో రిటైర్డ్ డి.ఎస్.పి భాస్కర్ నాయుడు పై ఆ గూండాలు దాడి చేశారు. ఈ దాడిలో భాస్కర్ నాయుడు స్వల్పంగా గాయపడ్డారు. సంఘటన స్థలంలో జెసిబి డ్రైవర్ తో పాటు ప్రహరీ గోడ కూల్చివేతలో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప ప్రాంతానికి చెందిన కొంతమందితో కలిసి స్థానికులైన మరి కొంతమంది ఇది ఈ సంఘటనలో పాల్గొన్నట్లు వంశీకృష్ణ భార్య శ్రీదేవి ఆరోపించారు.
గత కొన్ని రోజులుగా కడప, కర్నూలు ఈ ప్రాంతాలకు చెందిన గుండాల ద్వారా తమకు బెదిరింపులు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో ఈ సంఘటన చోటుచేసుకుందని తెలిపారు. కడప గ్యాంగ్ తో కలిసి తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, వారినుంచి తమకు రక్షణ కల్పించాలని కోరారు.
ఎమ్మెల్యేపై ఆరోపణలు
ఇది జరిగిన సంఘటన కాగా.. జరిగిన దౌర్జన్యంలో ఎమ్మెల్యే మధుసూదన రెడ్డి అనుయాయుల పాత్ర ఉన్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి అండ చూసుకునే బయటి వ్యక్తులు ఇక్కడ రెచ్చిపోెయి కూల్చివేతకు కూడా పాల్పడ్డారని, ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత భూతగాదా.. రాజకీయ జోక్యంతో బయటిజిల్లాల గుండాల దందాకు దారితీసిందని అంటున్నారు.
ఎమ్మెల్యేకు కూడా ఈ విషయం తెలియజెబితే.. మీరేం భయపడొద్దు నేను పోలీసులతో చెబుతాను అని ఆయన హామీ ఇచ్చారని దాడికి గురైన రిటైర్డ్ డీఎస్పీ భాస్కరనాయుడు చెప్పారు. తనను హత్య చేయడానికి ప్రయత్నించారని ఆయన అన్నారు. తనను కింద పడేసి తలమీద వేయడానికి పెద్ద రాయి ఎత్తుకున్న సమయంలో.. నరేష్ అనే కానిస్టేబుల్ వచ్చి తనను కాపాడినట్లు చెప్పారు.
కేసులేదు.. మీడియా పట్టించుకోలేదు
ఈ విషయంపై బాధితులు కూడా తొలుత పోలీసులకు తెలియజెప్పారు. జరిగిన దౌర్జన్యంపై ఫిర్యాదు రాసి ఇచ్చారు. అయితే ఎఫ్ఐఆర్ రిజిస్టరు కాలేదు. కేసు పెట్టకుండా కొందరు వ్యక్తులు ఒత్తిడి చేసినట్లుగా కూడా వినిపిస్తోంది. బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు గానీ.. చట్టపరంగా FIR నమోదు కాకపోవడం విశేషం.
దాడికి గురైనది రిటైర్డ్ డీఎస్పీ. పోలీసు అధికారిగా ఉన్నత పదవిలో బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తిమీద గుండాలు చేయి చేసుకుని, కొట్టినప్పటికీ.. కేసు పెట్టే దిక్కు లేకపోవడం గమనార్హం.
తాను నలభయ్యేళ్లు పోలీసు శాఖలో సేవలందించానని, నెల్లూరు రైల్వే డీఎస్పీగా పనిచేశానని.. తనమీదనే హత్యాయత్నం జరిగినా దిక్కులేకుండా పోయిందని భాస్కరనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులు కేసు నమోదు చేయకపోవడం, ఎఫ్ఐఆర్ కూడా లేకపోవడంతో.. మీడియా కూడా ఈ కూల్చివేతలు, దౌర్జన్యం గురించి పట్టించుకోలేదని సమాచారం. సోమవారం సాయంత్రం వరకు కూడా.. ఎఫ్ఐఆర్ రిజిస్టరు కాలేదు. ఇరువర్గాల వారిని పిలిపించి పోలీసులు రాజీ ప్రయత్నాలు చేసినట్లుగా తెలిసింది.